Kartik Purnima 2023 Date and time:  హరిహరులకు ఎంతో ప్రీతికరమైన కార్తీక మాసంలో ప్రతిరోజూ ప్రత్యేకమే అయినప్పటికీ కార్తీక పౌర్ణమికి మరింత ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు  నదీ స్నానం, దీప దానం అత్యంత విశిష్టమని.. యాగం చేసిన ఫలితం లభిస్తుందని పండితులు చెబుతారు. ఈ ఏడాది కార్తీక పూర్ణిమ విషయంలో కొంత కన్ఫ్యూజన్ ఉంది. ఈ ఏడాది అధిక మాసం రావడంతో చాలా పండుగల తిథులన్నీ రెండు రోజుల పాటూ వచ్చాయి. నవంబర్ 26, 27 తేదీల్లో ఈ పౌర్ణమి ఘడియలు ఉన్నాయి. దీంతో పవిత్రమైన కార్తిక పౌర్ణమి పండుగను ఏ రోజున నిర్వహించుకోవాలనే చర్చ సాగుతోంది.


Also Read: కార్తీక పౌర్ణమి రోజు జ్వాలా తోరణం ఎందుకు వెలిగిస్తారు!


పౌర్ణమి ఘడియలు ఇవే


నవంబరు 26 ఆదివారం మధ్యాహ్నం 3 గంటల 08 నిముషాలకు చతుర్థశి తిథి పూర్తై..పౌర్ణమి వచ్చింది. 


నవంబరు 27 సోమవారం మధ్యాహ్నం 2 గంటల 10 నిముషాల  వరకూ పౌర్ణమి ఉంది...


సాధారణంగా ఏ తిథిని అయినా సూర్యోదయానికి ఉన్నప్పుడే పరిగణలోకి తీసుకుంటారు. అలా అయితే సోమవారం కార్తీక పౌర్ణమి అవుతుంది..అందుకే చాలా పంచాంగాలలో కార్తీక పౌర్ణమి సోమవారం అనే చెప్పారు. కానీ పౌర్ణమి చంద్రుడికి సంబంధించిన పండుగ. అంటే పున్నమి ఘడియలు రాత్రికి ఉండడం ప్రధానం..అందుకే కార్తీక పౌర్ణమి ఆదివారమే జరుపుకోవాలనే వాదన ఉంది. అయితే ఉపవాసం ఉండి పౌర్ణమి దీపాలు వెలిగించుకోవాలి అనుకునేవారు ఆదివారమే అనుసరించాలని చెబుతున్నారు పండితులు.. కొందరు పున్నమి నోములు చేసి ఉదయాన్నే ముత్తైదువలకు తాంబూలం ఇచ్చుకుంటారు..వారంతా సోమవారం రోజు నియమాలు పాటించాలి.


Also Read: కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులతో దీపం ఎందుకు వెలిగించాలి!


ఆదివారమే కార్తీక పౌర్ణమి


కార్తిక పౌర్ణమి అంటే ఆ రోజున చేయాల్సిన అతిముఖ్యమైన పని దీపం వెలిగించడం. దీపం వెలిగించడం ద్వారా.. జీవితంలోకి కొత్త కాంతిని ఆహ్వానిస్తారు. సూర్యాస్యమయం తర్వాత దీపం వెలిగిస్తున్నప్పుడు పౌర్ణమి ఘడియలతోపాటు కృత్తిక నక్షత్రం ఉండాలి. ఇలా చూసుకున్నప్పుడు 26వ తేదీన మాత్రమే ఈ ఘడియలు ఉన్నాయి. అందుకే ఆదివారమే కార్తీక పౌర్ణమి. 


Also Read: కార్తీకమాసంలో పాటించే ఈ నియమం శారీరక, మానసిక ఔషధం!


కార్తీక స్నానం


కార్తీక పౌర్ణమి రోజు  సూర్యోదయానికి ముందే పవిత్ర స్నానం ఆచరించాలి. సమీపంలో ఉన్న నదిలో అయినా లేదంటే ఇంట్లో ఏదైనా నది నీరుంటే ఆ నీటిని కలుపుకుని స్నానమాచరించవచ్చు. ఈ రోజు వైష్ణవ ఆలయాల్లో సాయంత్రం దీపాలు వెలిగిస్తారు. కొందరు ఏడాది మొత్తం ఫలితం పొందేందుకు 365 వత్తులు వెలిగిస్తారు. అభిషేక ప్రియుడైన శివునికి పాలు, తేనెతో అభిషేకం చేస్తారు, శివాలయాల్లో జరిగే జ్వాలాతోరణానికి హాజరవుతారు. ఈ రోజు చంద్రోదయం తర్వాత పచ్చి పాలను నీటిలో కలిపి చంద్రుడికి అర్ఘ్యం సమర్పించాలి.  శ్రీ మహా విష్ణువును పూజించిన తర్వాత చలిమిడి, వడపప్పు సహా పంచామృతాన్ని ప్రసాదంగా సమర్పించి ఉపవాసం విరమించాలి. 


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply