Bigg Boss Telugu 7 Latest Episode: బిగ్ బాస్ సీజన్ 7 చివరిదశకు చేరుకోగా.. చివరి కెప్టెన్సీ టాస్క్ కోసం పోటీ మొదలయ్యింది. ఇప్పటివరకు హౌజ్‌లో అసలు కెప్టెన్ అవ్వనివారు ముగ్గురు ఉన్నారు. వారే అమర్‌దీప్, రతిక, అశ్విని. ఈ ముగ్గురిలో కెప్టెన్ అయ్యే ఛాన్సులు అమర్‌కే ఎక్కువ ఉన్నాయి. అమర్ మొదటి వారం నుండి పవర్ అస్త్రా కోసం, కెప్టెన్సీ కోసం ఎంతో కష్టపడ్డాడని చాలామంది హౌజ్‌మేట్స్ భావిస్తుండడంతో అందరి సపోర్ట్‌తో తను గెలుస్తాడని, కెప్టెన్ అవుతాడని ప్రేక్షకులు ఫిక్స్ అయ్యారు. తను దాదాపుగా కెప్టెన్ అయిపోయాడు అనే సమయానికి బిగ్ బాస్ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు.


కెప్టెన్సీపై ఆశలు..
కెప్టెన్సీ కోసం బిగ్ బాస్.. కంటెస్టెంట్స్‌కు మెషీన్ గన్ టాస్క్ ఇచ్చారు. అమర్‌దీప్‌తో పాటు అర్జున్ కూడా చివరి కెప్టెన్సీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. రెండోసార్లు తను కెప్టెన్ అవ్వడం తన భార్య కోరిక అని అందరితో చెప్పుకొచ్చాడు. దీంతో అమర్‌కు సపోర్ట్ చేయాలనుకున్న కొందరు కంటెస్టెంట్స్.. అర్జున్‌కు సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. అర్జున్ లేదా యావర్‌లో ఒకరిని తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు యావరే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తనను కెప్టెన్సీ రేసు నుండి తీసేయమన్నాడు. అంతే కాకుండా అర్జున్ భార్య తనకు వదినతో సమానమని, వదిన కోసం ఏమైనా చేస్తానని అన్నాడు. ఈ మాటలు విన్న శివాజీ ఎమోషనల్ అయ్యాడు. అశ్విని సైతం స్వీట్ అంటూ యావర్‌కు ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చింది. యావర్ తరహాలోనే గౌతమ్ కూడా అర్జున్ కోసం స్వచ్ఛందంగా కెప్టెన్సీ రేసు నుండి తప్పుకున్నాడు.


నువ్వు కెప్టెన్ అవ్వడం ఇష్టం లేదు..
అందరూ అనుకున్నట్టుగానే చివరి రౌండ్‌లో అర్జున్, అమర్‌దీప్ మిగిలారు. ఇక వీరిద్దరిలో ఎవరు కెప్టెన్ అవ్వాలి, ఎవరు తప్పుకోవాలి అనే నిర్ణయం శోభా, శివాజీల చేతిలోకి వెళ్లింది. ముందు నుండి అనుకున్నట్టుగానే తనను కెప్టెన్ చేశాడు కాబట్టి అమర్‌ను తను కెప్టెన్ చేయాలి అనుకుంటున్నానని శోభా చెప్పింది. ఆ పాయింట్ అర్జున్‌కు నచ్చలేదు. చర్చకు దిగాడు. ‘‘ఫ్రాంక్‌గా చెప్తున్నాను నువ్వు కెప్టెన్ అవ్వడం నాకు ఇష్టం లేదు’’ అంటూ అర్జున్ ఈగోను హర్ట్ చేసింది శోభా. దీంతో తనకే కెప్టెన్సీ కావాలని అర్జున్ స్ట్రాంగ్‌గా నిలబడ్డాడు. ఆ తర్వాత శివాజీ.. అర్జున్‌కు సపోర్ట్ చేస్తున్నట్టు చెప్పాడు. అర్జున్ భార్య తనకు కూతురిలాంటిది అని, తను అర్జున్ రెండోసారి కెప్టెన్ అయితే చూడాలనుకుంది కాబట్టి తనకు సపోర్ట్ చేస్తానని ప్రకటించాడు. దీంతో అమర్‌దీప్ ఒక్కసారిగా షాకయ్యాడు.


మా అమ్మ, నాన్న కూడా కోరుకుంటున్నారు..
అర్జున్ భార్య గురించి ఆలోచించి తనను కెప్టెన్ చేస్తే.. తన తల్లిదండ్రుల గురించి ఆలోచించి తనను కూడా కెప్టెన్ చేయొచ్చుగా అని శివాజీని బ్రతిమిలాడడం మొదలుపెట్టాడు అమర్‌దీప్. అదే క్రమంలో ఎమోషనల్ కూడా అయ్యాడు. ఏడవద్దని, సెంటిమెంటల్‌గా మాట్లాడొద్దని అమర్‌కు గట్టిగా చెప్పేశాడు శివాజీ. శోభా కూడా తన నిర్ణయాన్ని మార్చుకోమని శివాజీని బ్రతిమిలాడింది. ఎమోషనల్ అయ్యింది. చేతులు పట్టుకొని ఎప్పుడూ ఏదీ అడగలేదు. ఇది ఒక్కటి చేయమని రిక్వెస్ట్ చేసింది. అయినా కూడా శివాజీ.. అర్జున్‌కు సపోర్ట్ చేయాలని స్ట్రాంగ్‌గా నిర్ణయించుకున్నాడు. 


శివాజీ మనసులో కుట్ర..
ఈ చర్చల మధ్యలో శివాజీ ఒక మాట అన్నాడు. ఇలా ఫీల్ అయ్యేవాడివి కెప్టెన్ ఎలా అవుతావని, ఒకవేళ కెప్టెన్సీ వచ్చినా డిప్యూటీలుగా కొత్తవారికి అవకాశం ఇవ్వాలని ఆలోచన నీకు లేదని అమర్‌కు సూటిగా చెప్పేశాడు. అంతే కాకుండా అశ్విని కూడా అవకాశం కోసం ఎదురుచూస్తుందని, తనకు డిప్యూటీగా అవకాశం ఇద్దామనే ఆలోచనే నీకు లేదని అమర్‌తో అన్నాడు. దీంతో అమర్ కెప్టెన్ అయితే ప్రియాంక, శోభాలను డిప్యూటీలు చేస్తాడనే కారణంతో కూడా శివాజీ.. అమర్‌కు సపోర్ట్ చేయడం లేదని కొందరు ప్రేక్షకులు భావిస్తున్నారు. అర్జున్ ఒప్పుకుంటే తనకు ఓకే అని శివాజీ చెప్పడంతో.. అర్జున్ దగ్గరకు వెళ్లి బ్రతిమిలాడడం మొదలుపెట్టాడు అమర్. శోభా అన్న మాటలు తనను ట్రిగర్ చేశాయని, అందుకే కెప్టెన్సీ వదులుకోవడానికి తను సిద్ధంగా లేనని అర్జున్ చెప్పేశాడు. దీంతో అమర్ కూడా ఆశలు వదులుకున్నాడు. ‘‘ఇంత అడుక్కున్న తర్వాత నాకు కెప్టెన్సీ అవసరం లేదు. నేనే పనికిమాలినోడిని. నాకు గేమ్స్ ఆడడం చేతకాదు’’ అంటూ పక్కకు వెళ్లి కూర్చున్నాడు. అప్పటికే ఎన్నోసార్లు బిగ్ బాస్ అడిగినా.. శివాజీ, శోభా తమ నిర్ణయాన్ని చెప్పకపోవడంతో చివరి కెప్టెన్సీ టాస్క్‌ను రద్దుచేస్తున్నట్టు బిగ్ బాస్ ప్రకటించాడు.


Also Read: అర్థం చేసుకో అన్నా ప్లీజ్, దండం పెడతా - కెప్టెన్సీ కోసం అమర్‌దీప్ మళ్లీ ఏడుపు


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply