బిగ్ బాస్ సీజన్ 7లో చివరి కెప్టెన్సీ టాస్క్ ఆసక్తికరంగా సాగుతుందని ఇప్పటికే విడుదలయిన ప్రోమో చూస్తే అర్థమవుతోంది. ఇక అదే ఎపిసోడ్‌కు సంబంధించిన రెండో ప్రోమో కూడా విడుదల కాగా.. అందులో అమర్‌దీప్ కెప్టెన్ అవుతాడా లేదా అనే విషయంపై ఆసక్తి ప్రేక్షకులకు పెరిగేలా అనిపిస్తోంది. సీజన్ 7లో అమర్‌దీప్, రతిక, అశ్విని.. ఈ ముగ్గురు ఇప్పటివరకు కెప్టెన్స్ అవ్వలేరు. రతిక.. మధ్యలో ఎలిమినేట్ అయ్యి సెకండ్ ఛాన్స్‌తో మళ్లీ హౌజ్‌లోకి వచ్చింది. అశ్విని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చింది. కానీ అమర్‌దీప్ మాత్రం ముందు నుండి ఉన్నాడు. అంతే కాకుండా కెప్టెన్సీ కోసం ఎన్నోసార్లు, ఎన్నో విధాలుగా పోటీపడుతూనే ఉన్నాడు. ఇక చివరి కెప్టెన్సీలో కూడా అమర్.. అవకాశాన్ని చేజార్చుకున్నాడని ప్రోమో చూస్తే అనిపిస్తోంది.


తన భార్యకు మాటిచ్చాను..
అమర్‌దీప్‌ను కెప్టెన్ చేయాలని ఫిక్స్ అయిపోయిన శోభా.. అమర్‌తో కాకుండా ఇంకెవరితో తన ఫోటో వచ్చినా సపోర్ట్ చేస్తానని అశ్వినికి మాటిచ్చింది. అదే మాట రతికతో కూడా చెప్పింది. అసలు చివరి కెప్టెన్‌ను ఎవరిని చేయాలి అని కంటెస్టెంట్స్ అంతా సీరియస్‌గా డిస్కషన్ పెట్టారు. ఇక అమర్‌ను ఎలా కెప్టెన్ చేయాలా అని ఆలోచిస్తున్న శోభా.. ఎవరెవరు తనకు సపోర్ట్ చేస్తున్నారు అనే విషయంపై చర్చ మొదలుపెట్టింది. పల్లవి ప్రశాంత్, శివాజీ.. అమర్‌కే సపోర్ట్ అని కన్ఫర్మ్ చేసుకుంది. కానీ మరోవైపు ‘‘అమర్, అర్జున్ వస్తేనే టెన్షన్. అర్జున్ భార్య ప్రెగ్నెంట్ కదా.. తను అడిగింది నన్ను ఇంకొకసారి కెప్టెన్ చేయాలని’’ అంటూ తన సపోర్ట్‌ అర్జున్‌కే అంటూ ఇన్‌డైరెక్ట్‌గా యావర్‌తో చెప్పాడు శివాజీ.


ఏడవద్దు, ఏడ్చి ఉపయోగం లేదు..
అందరూ అనుకున్నట్టుగా అర్జున్, అమర్‌దీప్.. ఈ ఇద్దరి ఫోటోలు కెప్టెన్సీ రేసులో వచ్చాయి. అయితే ఈ ఇద్దరిలో ఒకరు మాత్రమే ముందుకు వెళ్లే అవకాశం ఉంది. శోభా, శివాజీ చేతిలోనే ఎవరు ముందుకు వెళ్లాలి అనే నిర్ణయం ఉంది. దీంతో వారిద్దరూ చర్చించడం మొదలుపెట్టారు. ‘‘ఈ ఇంటి నుండి బయటికి వెళ్లేలోపు నీకు ఏది అవసరమో అది ఇచ్చే వెళ్తాను అన్నాను’’ అంటూ అమర్‌కు తను ఇచ్చిన మాటను శివాజీతో చెప్పింది శోభా. ఇదంతా వింటున్న అమర్‌దీప్.. శివాజీని బ్రతిమిలాడడం మొదలుపెట్టాడు. ‘‘అర్థం చేసుకో అన్న ప్లీజ్ అన్న’’ అంటూ ప్రాధేయపడ్డాడు. అర్థం చేసుకున్నాను కాబట్టే గతవారం సైలెంట్‌గా ఉన్నానంటూ గుర్తుచేశాడు శివాజీ. ‘‘ఇప్పుడు అవకాశం వచ్చింది పోగొట్టకు అన్న నీకు దండం పెడతా. మా అమ్మ, మా నాన్న కూడా ఆశపెట్టుకున్నారు’’ అని చెప్తూ ఎమోషనల్ అయ్యాడు అమర్‌దీప్. ‘‘నువ్వు ఏడుస్తావేంట్రా’’ అంటూ సీరియస్ అయ్యాడు శివాజీ. ‘‘రేపు టికెట్ టు ఫైనల్ ఉంది ఆడి గెలువు. నిన్ను ఎవడు ఆపాడు. రేపు కప్పు కొట్టాలని మా అమ్మా, నాన్నకు ఉంది అంటాను ఎవడు ఒప్పుకుంటాడు ఇక్కడ’’ అని అరిచాడు. ‘‘కెప్టెన్ అవ్వాలి నేను. ఇంకొక అవకాశం లేదు. ఉంటే ఆడతాను’’ అని అమర్ బాధతో అన్నాడు. ఏడవద్దు, ఏడ్చి ఉపయోగం లేదని శివాజీ ఓదార్చాడు.


కెప్టెన్ అవ్వకపోతే కప్ రాదా..?
అమర్‌దీప్‌ కెప్టెన్ అవ్వడానికి, తను కాకపోవడానికి కారణాలు ఏంటి అని శోభాతో చర్చించాడు అర్జున్. ‘‘ఒక్కసారి కెప్టెన్ అయ్యాను అని కాకుండా ఇంకెందులో నేను తక్కువ ఉన్నాను?’’ అని శోభాను ప్రశ్నించాడు. అయితే ఇద్దరు సమానంగా స్ట్రాంగ్ అని శోభా సమాధానమిచ్చింది. అర్జున్ దగ్గరకు వెళ్లి కూడా కెప్టెన్సీ కోసం బ్రతిమిలాడుకున్నాడు అమర్. ‘‘కప్ గురించి ఏడ్చినా ఒక అర్థం.. కెప్టెన్సీ గురించి ఏంటి?’’ అంటూ అర్జున్ రివర్స్ అయ్యాడు. ‘‘నేను కెప్టెన్ కావాలి’’ అని స్టేట్‌మెంట్ ఇచ్చాడు అమర్. ‘‘కెప్టెన్ అవ్వకపోతే కప్ రాదా నీకు’’ అని కౌంటర్ ఇచ్చాడు అర్జున్. దానికి హర్ట్ అయిన అమర్.. ‘‘దేనికీ పనికిరాను, ఏ గేమ్ ఆడలేదు. నాకంటే కండలు ఉండి, హైట్ ఉండి, బాడీ ఉంటే వాళ్లు గొప్ప’’ అని ఫీల్ అవుతుండగానే తన ఫోటో కాలిపోయింది. దీంతో తను కెప్టెన్సీ రేసు నుండి తొలగిపోయాడు. ‘‘ఒకేఒక్క ఛాన్స్ పోయిందే’’ అంటూ వాష్‌రూమ్‌లోకి వెళ్లి ఏడవడం మొదలుపెట్టాడు అమర్‌దీప్.



Also Read: ఫ్రెండ్స్ మధ్య చిచ్చుపెడుతున్న చివరి కెప్టెన్సీ టాస్క్ - ప్రియాంక మౌనం!


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply