ఈ ఏడాది మార్చి 8న హోలీ పండుగ జరుపుకుంటారు. కులమత బేధాలు లేకుండా అందరూ హోలీ సంబరాల్లో పాల్గొంటారు. కానీ దేశంలో ఒక చోట మాత్రం హోలీని భిన్నంగా జరుపుకుంటారు. కలర్స్‌తోపాటు లడ్డూలతో కూడా హోలీ చేసేకోవడం అక్కడి ప్రత్యేకత. బ్రజ్‌లోని మథుర, బర్సానా, గోకుల్, బృందావన్ ప్రాంతాల్లో ఈ వేడుక ఘనంగా జరుగుతుంది. ఇది చూసేందుకు ప్రపంచ నలుమూలల నుంచి ప్రజలు తరలివస్తారు. వసంత కాల ప్రారంభంలో బ్రజ్ లో రంగోత్సవ్ దాదాపు 40 రోజుల పాటు సాగుతుంది. హోలీతోపాటు లడ్డూ హోలీ, ఫూలన్ హోలీ, లత్మార్ హోలీలను రంగ్వాలీ హోలీతో పాటుగా జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ఫాల్గుణ మాసంలో శుక్ల పక్ష అష్టమి తేదన బర్సానలో లడ్డూ హోలీ నిర్వహిస్తారు. ఈ ఏడాది ఆ పర్వదినం ఫిబ్రవరి 27న వస్తోంది. అంటే హోలీ కంటే ముందుగానే లడ్డుల హోలీ ప్రారంభం కానుందన్నమాట. మరి దాని ప్రత్యేకత ఏమిటో చూసేయండి.
లడ్డూ హోలీ ఎలా మొదలైంది?
మామూలుగా ఆనంద సమయాల్లో లడ్డులు పంచుకోవడం ఆనవాయితి. కానీ బర్సానలో లత్మార్ హోలీకి ముందు లడ్డులను గులాల్, అబీర్ మాదిరిగానే ఒకరి మీద ఒకరు విసురుకుంటారు. బర్సానాకు రావల్సిందిగా నందగావ్ నుంచి వచ్చిన ఆహ్వానాన్ని అంగీకరించడం కూడా ఇక్కడ ఒక సాంప్రదాయం. ఈ సంప్రదాయం ఈ లడ్డూ హోలీతో ముడి పడి ఉందని చెబుతుంటారు. ఆ ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ వందల కిలోల లడ్డుల వర్షం కురిపిస్తారు. ఈవేడుక చూసేందు దేశవిదేశాల నుంచి జనం వస్తారు. వచ్చిన వారంతా లడ్డూ ప్రసాదం తీసుకొని ఆనందిస్తారు.
లడ్డూ హోలీ ప్రత్యేకత ఇదే
లడ్డూ హోలి గురించి ఒక ప్రత్యేకమైన కథ ఉంది. ద్వాపర యుగంలో బర్సానా నుంచి హోలీ ఆహ్వానం తీసుకుని స్నేహితులు నందగావ్ వెళ్లారు. అప్పుడు నందుడు ఈ ఆహ్వానాన్ని అంగీకరించి తన పూజారి ద్వారా బర్సానాలోన వృషభానుకి వార్తను పంపించారు. ఈ సమయంలో బర్సానాలోని గోపికలు ఆ పూజారి చెంపలకు గులాల్ పూశారు. పూజారి దగ్గర గులాల్ లేకపోవడంతో గోపికల మీద లడ్డూలు విసరడం మొదలు పెట్టాడు. అప్పటి నుంచి లడ్డూ హోలీ ప్రాచూర్యంలో ఉంది. ఇప్పటికీ బర్సానాలో లడ్డూ హోలీ చాలా ఘనంగా చేస్తారు. లడ్డూ హోలీ రోజున ఆలయ ప్రాంగణం మొత్తం రాధా కృష్ణుల ప్రేమతో తడిసి ముద్దవుతుంది. ఆలయం ప్రాంగణంలో రాధాకృష్ణుల కీర్తనలు హోలీ పాటల రూపంలో మారు మోగుతాయి. భక్తజనం కూడా రాధాకృష్ణుల ప్రేమతో ఆడి పాడుతారు. లడ్డూ ప్రసాదం స్వీకరించి వారి ఆశీర్వాదం దొరికినట్టుగా భావిస్తారు. ఈ రోజు వందలాది లడ్డులు అమ్ముడవుతాయి. ఆలయాల్లో ప్రత్యేకంగా ఈ లడ్డులను తయారు చేస్తారు. రంగులకు బదులుగా ‘తియ్యని’ వేడుక జరుపుకుంటారు. మరి మీకు కూడా ఈ వేడుకలో పాల్గోవాలని ఉందా? హోలీకి ముందే అక్కడికి చేరుకోండి. వారం రోజుల వేడుకలో పాలు పంచుకోండి.