Manidweepam: మణిద్వీపం అని తలచినంత మాత్రమే సకల దారిద్యాలు దూరమవుతాయని శాస్త్ర ప్రమాణం. మణిద్వీపాన్ని మనసారా చదివినా లేక గానం చేసినా వచ్చే ఫలితాలను వర్ణించడం వేయిపడగల ఆదిశేషుడుకి కూడా సాధ్యం కాదని ప్రతీతి. శ్రీ మహాత్రిపురసుందరి శ్రీ లలితా జగన్మాత అమ్మవారు నివాసముండే పవిత్ర ప్రదేశమే మణి ద్వీపం. 14 లోకాల అనంతరం సర్వలోకంలో ఆమె కొలువై ఉంది. యావత్ జగతిని పరిరక్షించే అమ్మవారి మదిలో ఏర్పడిన ఆలోచనలకు అనుగుణంగా ఈ లోకం ఉద్భవించింది. నాలుగువైపులా అమృతంతో కూడిన సముద్రం సరిహద్దులుగా ఉన్న మణిద్వీపం గురించి దేవీ భాగవతంలో వర్ణించారు.
మణిద్వీపం శ్రీ లలిత త్రిపుర సుందరి నివాసం. మణిద్వీపాన్ని శ్రీపురం / శ్రీనగరం అని కూడా అంటారు. దీనిని వేద వ్యాస మహర్షి సుధా సముద్రం అని పిలవబడే అమృత మహాసముద్రం మధ్యలో ఉన్న ఒక ద్వీపంగా వర్ణించారు. మణిద్వీప వర్ణన మణిద్వీపాన్ని వివరించే శక్తిమంతమైన స్తోత్రం. ఈ స్తోత్రాన్ని పఠించనంత మాత్రమే అద్భుతాలు జరుగుతాయని భక్తుల విశ్వాసం. మణిద్వీప వర్ణనలోని 32 శ్లోకాలను రోజుకు 9 సార్లు, వరుసగా 9 రోజులు భక్తితో పారాయణం చేస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని విశ్వసిస్తారు. అమ్మవారి నివాస స్థానమే మణిద్వీపం. ఈ మణిద్వీప వర్ణనను శ్రద్ధతో పారాయణం చేస్తే సకల జాతక దోషాలు తొలగిపోతాయి. భూత ప్రేత పిశాచ బాధలుండవు. గృహ ప్రవేశం చేసేటప్పుడు, శంకుస్థాపన చేసేటప్పుడు దీనిని ఇంట్లో పారాయణం చేయడం సంప్రదాయంగా వస్తోంది. ఇలా చేయడం వల్ల ఇంట్లో వాస్తు దోషాలు పోతాయి. మనుషుల్లోని అశాంతి తొలగిపోతుంది.
వేదవేదాంత గోష్ఠులు ఒకవైపు, వేణువీణా నాదాలు మరోవైపు, మనోహరమైన నాట్యవిన్యాసాలు ఇంకోవైపు మణిద్వీప వైభవాన్ని ప్రకటిస్తూ ఉంటాయి. స్వర్ణమణిమయ ఖచితమైన మణిద్వీపంలోని చింతామణి గృహంలో, శ్రీ చక్రం మధ్యలో, రక్తవస్త్రాలను, ఎరుపురంగులో ఉన్న కస్తూరికాది లేపనాలను ధరించి, మంగళాకరమైన పర్యంకంపై భువనేశ్వరీమాత భువనేశ్వరుడితో కలిసి అతని వామభాగంలో కొలువుదీరి ఉంటుంది. ఆవిడే ఆదిశక్తి. భువనేశ్వరిగా, త్రిపుర సుందరిగా కొలువుదీరిన అమ్మవారి పర్యంకానికి బ్రహ్మ, విష్ణు, రుద్రులు, ఈశ్వరుడు నాలుగు కోళ్లుగా ఉంటారు. సదాశివుడు పలకరూపంలో ఉంటాడు. ఆమె కటాక్ష జనితాలై విజ్ఞానం, ఆనందం అనే నదులు, నవనిధులు, అష్టసిద్ధులు ప్రవహిస్తుంటాయి. సూర్యాగ్ని చంద్రులు ఆమెకు కన్నులుగా వెలుగొందుతూ ఉంటారు. కాళి, కాత్యాయని, వారాహి, చాముండాది దేవతలు గణాధ్యక్షులుగా ఉంటారు. మహదహంకారాదులు, పంచభూతాలు, కాలం ఆమె తత్త్వాలుగా చేతనాచేతనమైన సకల విశ్వాన్ని రక్షిస్తుండగా… చిరునవ్వుముఖంతో, కారుణ్యపూరితమైన చూపులతో దర్శనమిస్తుంటుంది ఆదిశక్తి. పాశాంకుశ వరాభయ హస్తాలతో, వర్ణనాతీత శారీరక కాంతులతో అలరారుతూ ఉండే ఆమెను లజ్జ, తుష్టి, పుష్టి, కీర్తి మొదలైన కాంతులు సేవిస్తుంటాయి.
అమ్మవారు కొలువై ఉన్న ఈ చింతామణి గృహం ప్రళయకాలంలో సంకుచితమై తిరిగి వర్ధిల్లుతూ ఉంటుంది. మణిద్వీపం చుట్టూ కాంస్యం, తామ్రం, సీసం, ఇత్తడి, పంచలోహాలు, పుష్యరాగం, పద్మరాగం, గోమేధికం, వజ్రం, వైడూర్యం, ఇంద్రనీలం, మరకతం, ప్రవాళం, మాణిక్యం మొదలైన ప్రాకారాలు ఉంటాయి. చింతామణి గృహం సూర్యకాంత, చంద్రకాంత మణులతో నిరంతరం ప్రకాశిస్తుంటుంది. ఆమె సంకల్పంతో ఈ చరాచర సృష్టి జరిగింది. మొదట నిరాకార, నిర్గుణ ‘నిష్కళ’ స్థితి నుంచి సంకల్పం.. శక్తి సంకల్పాల నుంచి చైతన్యం, దాని ద్వారా మనసు, బుద్ధి శరీరాలు ఆవిర్భవించి సగుణమూర్తిగా భాసించాయి. శక్తి నుంచి శారీరక బలం, సౌభాగ్యాలు.. చైతన్యం ద్వారా తెలివి, స్ఫూర్తి, ఎరుక (ఆధ్యాత్మిక జ్ఞానం)లు వెలుగుచూశాయి. తర్వాత ఆ శుద్ధ చైతన్యమే శివశక్తులు (చైతన్యశక్తులు)గా వస్తుప్రపంచమై అనంత సృష్టి వెలుగు చూసింది. ఈ అనంతశక్తిని శరీరంలో ఉంటే కుండలినిగా, వస్తువులలో విద్యుత్తుగా, లోకాలలో ఆకాశంగా వ్యవహరిస్తాం.
నిజానికి మన దేహమే మణిద్వీపం. దేహంలోని హృదయం దహరాకాశం. కాశం అంటే వెలుగు. విశిష్టమైన వెలుగే ప్రకాశం. అజ్ఞానపు చీకటిని తొలగించే జగన్మాత మన దేహంలో సూక్ష్మంగా ప్రకాశిస్తుంటుంది. తెలుసుకోగలిగితే ఆ మంత్రరూపిణి మన మనసులోనే కొలువై ఉన్నది. లోకం అంటే మనసు. మనసును దాని పరిమితులలో నిలిపి అమితమైన చైతన్యాన్ని కలిగించేది మంత్రం. మంత్రాన్ని నియమిత అంతరాలలో మననం చేయడం వల్ల అది మనల్ని కాపాడుతుంది.
ఈ బ్రహ్మాండాన్ని కనురెప్పపాటులో సృష్టించి, లయం చేయగల 32 మహాశక్తుల పరిరక్షణలో ఈ సమస్త విశ్వం ఉండటం వల్ల 32 రకాల పూలతో, పసుపు, కుంకుమలతో.. నవరత్నాలతో.. రాగి, కంచు, వెండి, బంగారము మెదలగు లోహాలతో యధాశక్తి అమ్మవారిని పూజించవచ్చు. 32 రకాల నైవేద్యాలతో, సుగంధ ద్రవ్యాలతో మణిద్వీప నివాసినిని పూజిస్తారు. మణిద్వీప వర్ణన, చింతామణి గృహవర్ణనలు వింటేనే సకల పాపాలూ నశిస్తాయని భక్తులు విశ్వసిస్తారు.
గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.