Supreme Court Notice To CM Jagan : వాలంటీర్లకి నెలకి 200 రూపాయలు ఇచ్చి, సాక్షి పేపర్ని కొనిపించడం అధికార దుర్వినియోగం అని సుప్రీం కోర్టులో ఈనాడు దినపత్రిక పిటిషన్ దాఖలు చేసింది. వాలంటీర్లకు పత్రిక కొనుగోలు చేసేందుకు డబ్బులు మంజూరు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను తక్షణం నిలిపవేసేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్‌లో ఈనాడు యాజమాన్యం కోరింది. దీనిపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం విచారణ జరిపింది. ఈనాడు యాజమాన్యం తరపున సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. విచారణ సందర్భంగా ఏ పత్రికను కొనుక్కోవాలనే స్వేచ్చ వ్యక్తికి లేదా అని సీజేఐ ప్రశ్నించారు. అయితే వాలంటీర్లు అందరూ ప్రభుత్వ సపోర్టర్లు అని వారికి పత్రిక కొనుగోలు కోసం ప్రజాధనం ఇవ్వడం ఆర్టికల్ 19(1)(a)ను ఉల్లంఘించినట్లేనని రోహత్గీ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.
ఈనాడు పత్రికపై ఎల్లో జర్నలిజం అంటూ విమర్శలు చేస్తూంటారని ఆ పత్రికను చదవొద్దని పిలుపునిస్తూంటారని సీజేఐ దృష్టికి తీసుకెళ్లారు. అయితే పత్రికను కొనుగోలు చేయడానికి రూ. రెండు వందలు ఇవ్వడాన్ని ఎలా వ్యతిరేకిస్తారని సీజేఐ ప్రశ్నించారు. ఈ ధనం అంతా నేరుగా సాక్షి ఖాతాలోకి పోతోందని రోహత్గీ వివరించారు. అయితే ఖచ్చితంగా సాక్షి పేపరే కొంటున్నారని చూపించాలని సీజేఐ రోహత్గీని కోరారు. రోహత్గీ కొన్ని ఆధారాలను సీజేఐ ముందు ఉంచారు. అంటే ప్రజాధనాన్ని సాక్షి పేపర్ కు ప్రయోజనం కల్పించేందుకు ఉపయోగిస్తున్నారా అని సీజేఐ ప్రశ్నించారు. ఈ వ్యాజ్యంలో సీఎం జగన్‌ను పార్టీగా ఇంప్లిడీ చేయడం ఎందుకని సీజేఐ ప్రశ్నించారు. సాక్షిపత్రికకు సీఎం జగనే ఓనరని రోహత్గీ సీజేఐకి తెలిపారు. దీంతో నోటీసులు జారీ చేయాలని ఆదేశించిన సీజేఐ తదుపరి విచారణను ఏప్రిల్ పదో తేదీకి వాయిదా వేసింది.
విస్తృత సర్క్యులేషన్ ఉండి, ప్రభుత్వ పథకాల సమాచారం ఇచ్చే పేపర్ కొనాలని వలంటీర్లకు నెలకు రూ.200 మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఏపీలో రెండు లక్షల 60 వేల మంది వలంటీర్లు ఉన్నారు. పేపర్ కొనేందుకు ఒక్కో వలంటీరుకు రూ. 200 మంజూరు చేశారు. అడిషనల్ ఫైనాన్షియల్ సపోర్ట్ పేరుతో వలంటీర్ల పేస్లిప్‌లో రూ. 5 వేలకు అదనంగా ఈ రూ.200 అలాట్ చేశారు. ఏజెంట్ ఇచ్చిన పేపరు బిల్లును యాప్‌లో అప్లోడ్ చేయాలని వలంటీర్లకు ఆదేశాలు జారీ చేశారు. అయితే వారందరితో బలవంతంగా సాక్షి దినపత్రికనే కొనిపిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ జీవోపై ఈనాడు యాజమాన్యం కొంత కాలం కిందట హైకోర్టులో పిటిషన్ వేసింది. సీఎం జగన్ కుటుంబ యాజమాన్యంలోని ‘సాక్షి’ పత్రిక సర్క్యులేషన్‌ను పెంచుకొనేందుకే ఈ జీవోను తెచ్చారని వాదించింది. తనకు ఆర్థిక నష్టం కలిగించే ఆ జీవోను రద్దుచేయడంతోపాటు, ఆ పత్రిక సర్క్యులేషన్‌ను ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ (ఏబీసీ) పరిగణించకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.
ఫలానా పత్రిక కొనుగోలు చేయాలని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో ఎక్కడా పేర్కొనలేదని ప్రభుత్వ లాయర్లు హైకోర్టులో వాదించారు. ప్రభుత్వ పథకాలపై ఉద్యోగులకు అవగాహన పెరగాలనే ఉద్దేశంతో పత్రికల కొనుగోలుకు రూ.200 ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. విస్తృత వినియోగంల ఉన్న పత్రికను కొనుగోలు చేయాలని మాత్రమే జీవోలో పేర్కొన్నామని.. హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. విచారణ తర్వాత ప్రభుత్వ వాదననే హైకోర్టు సమర్థించింది. దీంతో ఈనాడు యాజమాన్యం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.