Bandi Sanjay :  పరువు నష్టం దావా నోటీసులు పంపిన కేటీఆర్‌పై బండి సంజయ్ మండిపడ్డారు.  టీఆర్ ఉడుత ఊపులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. కేటీఆర్ పంపిన లీగల్ నోటీసులను లీగల్ గానే ఎదురుకుంటామని చెప్పారు.  కేటీఆర్ ను మంత్రి వర్గం నుంచి బర్త్ రఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ పరువుకే 100 కోట్లు అయితే 30లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకమైందన్నారు. మరి వాళ్లకు ఎంత మూల్యం చెల్లిస్తావో చెప్పాలన్నారు. నిరుద్యోగులకు లక్ష రూపాయలు ఇవ్వాలన్నారు.  అమెరికాలో చిప్పలు కడిగే స్థాయి నుంచి కేటీఆర్ కు వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని సంజయ్ డిమాండ్ చేశారు. పేపర్‌ లీకేజీ వ్యవహారంపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలి. నష్టపోయిన నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష చొప్పున పరిహారం ఇవ్వాల్సిందే. కేటీఆర్‌ను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్‌ చేసేదాకా పోరాడతాం'' అని బండి సంజయ్‌ డిమాండ్ చేశారు. 


TSPSC  పేపర్ లీకేజీపై  కాంగ్రెస్, బీజేపీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లకు మార్చి 28న  మంత్రి కేటీఆర్  లీగల్  నోటీసులు పంపించారు.  తనపై  నిరాధారమైన , ఆసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ  నోటీసుల్లో  పేర్కొన్నారు. సుదీర్ఘకాలం పాటు ప్రజా జీవితంలో ఉన్న తన పరువుకు భంగం కలిగించాలన్న దురుద్దేశంతోనే బండి సంజయ్, రేవంత్ రెడ్డిలు పదేపదే అబద్ధాలను మాట్లాడుతున్నారన్నారు. తనపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణలు చెప్పాలని నోటీసుల్లో తెలిపారు. వారం రోజుల్లోగా క్షమాపణలు చెప్పాలని లేకపోతే  ఇండియన్ పీనల్ కోడ్‌లోని 499, 500 నిబంధనల ప్రకారం రూ. 100 కోట్ల పరువు నష్టం దావాను ఎదురుకోవాల్సి వస్తుందని కేటీఆర్ తన నోటీసుల్లో పేర్కొన్నారు.


పేపర్ లీకేజీ కేసుల చుట్టూ తెలంగాణ రాజకీయం నడుస్తోంది.   టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు బండి సంజయ్ కూడా పూర్తి స్థాయిలో కేటీఆర్ ను టార్గెట్ చేశారు. కేటీఆర్‌కు తెలిసే పేపర్ లీక్ జరిగిందని ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలకు ఆధారాలివ్వాలని లీకేజీపై ప్రత్యేకంగా ప్రభుత్వం  నియమించిన దర్యాప్తు బృందం నోటీసులు జారీ చేసింది. రేవంత్ రెడ్డి సిట్ ఎదుట విచారణకు  హాజరై.. తానను చేసిన ఆరోపణలకు ఆధాలంటూ  కొన్ని పత్రాలిచ్చారు. కానీ  బండి సంజయ్ మాత్రం సిట్ ఎదుట హాజరు కాలేదు. రెండు సార్లు నోటీసులు జారీ చేశారు. సిట్ పై తనకు నమ్మకం లేదని సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు..  బండి సంజయ్ తమ  ఎదుట హాజరు కాకపోవడంతో సిట్ అధికారులు తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నదానిపై ఉత్కంఠ ఏర్పడింది. 


ఈ లోపు కేటీఆర్ వందకోట్లకు పరువు నష్టం దావా వేశారు. దీనిపైనా అటు రేవంత్ .. ఇటు  బండి సంజయ్ తీవ్రంగా స్పందిస్తున్నారు.  తన కు క్షమాపణలు చెప్పకపోతే..   కోర్టులోనే తేల్చుకుంటామని కేటీఆర్ అంటున్నారు ., మొత్తంగా పేపర్ లీకేజీ కేసు  రాజకీయ సంచలనంగా మారుతోంది.