Vizianagaram Ramateertham : విజయనగరం జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థం మరో చారిత్రక ఘట్టానికి వేదిక కాబోతోంది. నీలాచలం కొండపై కోదండ రాముడి ఆలయ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. వేద పండితులు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దేవదాయ శాఖ అధికారులు విస్త్రత ఏర్పాట్లు చేశారు. ఆలయ పునః ప్రతిష్ట పూజలు శాస్త్రోక్తంగా ఆగమ శాస్త్రం ప్రకారం రామాలయ  ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. శ్రీ రాముని భక్తులు కూడా పెద్దఎత్తున హాజరయ్యారు. కానీ ఆలయ పునః ప్రతిష్టకు అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతి రాజు గైర్హాజరవ్వడం చర్చనీయాంశంగా మారింది.



దుండగుల దుశ్చర్య 


2020 డిసెంబర్ 30న విజయనగరం జిల్లా ఒక్కసారిగా అట్టుడికి పోయింది. నీలాచలం కొండపై ఉన్న పురాతన ఆలయంలోని కోదండరాముని విగ్రహాన్ని దుండగలు ధ్వంసం చేశారన్న వార్తతో రామభక్తులు, హిందువులు పెద్ద ఎత్తున నీలాచలం కొండ వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. అంతేకాకుండా ఓ వైపు బీజేపీ, మరోవైపు టీడీపీ నాయకులు సైతం తరలివచ్చి నిరసనలు తెలిపారు. దీంతో అప్పట్లో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ దుమారం రేపింది. నిందితులను పట్టుకొని నూతన విగ్రహాలను వెంటనే ప్రతిష్టించాలని ధర్నాలు, రాస్తారోకోలు మిన్ననంటాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై చర్యలు చేపట్టింది. ముందుగా విగ్రహ ప్రతిష్ఠ, కొండపై ఆలయ నిర్మాణంపై దృష్టి సారించింది. వెంటనే ఆలయ పునర్నిణానికి మూడు కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసింది. 



నాలుగు నెలల్లో ఆలయ పునః ప్రతిష్ణ


నీలాచలం కొండపై నుంచి సీతారాముల విగ్రహాలను కిందకు తెచ్చి కళాపకర్షణ చేశారు. అనంతరం కేవలం పదిరోజుల వ్యవధిలో టీటీడీ స్థపతులతో తిరుపతిలో సుందరమైన స్వామివారి విగ్రహాలను తయారు చేయించారు. ఆ విగ్రహాలను రామతీర్థంలోని బాలాలయంలో ప్రతిష్ట చేసి పూజాకైంకర్యాలను జరిపించారు. తరువాత చినజీయర్ స్వామి పర్యటించి కొండపై రాతి కట్టడంతో ఆలయ నిర్మాణం చేయాలని అధికారులకు, మంత్రులకు సూచించారు. దీంతో  గత ఏడాది డిసెంబరు 22న నూతన ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. అప్పటి నుంచి కేవలం నాలుగు నెలల్లో ఎంతో వ్యయప్రయాసలతో పూర్తిగా రాతి శిలలతో కోవెల నిర్మించారు. పూర్తిగా రాతి శిలలతో నిర్మించిన ఈ ఆలయం ఎంతో సుందరంగా దర్శనమిస్తుంది. 


సుందరమైన కళాకృతులతో 


ఈ ఆలయం ప్రధాన ద్వారంతో పాటు తలుపులు, గోడలపై సంప్రదాయ కళాకృతులు అందరినీ కట్టిపడేస్తున్నాయి. ఆలయ నిర్మాణం పూర్తికావటంతో చైత్ర మాసం సోమవారం ఉదయం 07:37 నిమిషాలకు ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిపారు. ఇందుకోసం తిరుపతి వైదిక యూనివర్సిటీతో పాటు ద్వారకాతిరుమల నుంచి రుత్వికులు వైఖానస ఆగమం ప్రకారం కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా వేదపండితులు నిర్ణయించిన ముహూర్తానికి సీతారాముల విగ్రహాలను ఆలయంలోకి చేర్చి కళాపకర్షణ చేశారు. ఈ నూతన ఆలయ ప్రతిష్ట కార్యక్రమానికి దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, రాజన్నదొర తదితరులు హాజరయ్యారు.



(దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ)


"కొందరు దుర్మార్గుల కారణంగా రామతీర్థంలో రాముల వారికి అపచారం జరిగింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఘటన జరిగిన నాలుగు నెలల్లో ఆలయాన్ని పునః నిర్మించాం. నాలుగు కోట్ల రూపాయలతో ఆలయాన్ని పునఃనిర్మాణం చేపట్టాం. సీతారాములు ఇక్కడే వెలిశారా అన్నంత సుందరంగా ప్రతిమలు తీర్చిదిద్దాం. ధ్వజస్తంభంతో సహా ఆలయంలో అన్నింటిని సమకూర్చాం. కొండ దిగువన కోటిన్నర వ్యయంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం" అని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. 


రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించేందుకు ప్రతిపాద‌న‌లు : బొత్స స‌త్యనారాయ‌ణ‌


రామ‌తీర్థంలో శ్రీ‌రామన‌వ‌మి వేడుక‌ల‌ను రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించే ప్రతిపాద‌న ముఖ్యమంత్రి వ‌ద్ద ప‌రిశీల‌న‌లో ఉంద‌ని మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ చెప్పారు. ఉత్తరాంధ్రలో రామ‌తీర్థం సీతారామ‌స్వామి ఆల‌యం ఎంతో ప్రసిద్ధి అని, భ‌ద్రచ‌లంలో శ్రీ‌రామ న‌వ‌మి రోజు జ‌రిగిన‌ట్టే, ఇక్కడ కూడా అదే సంప్రదాయంలో వేడుక‌లు జ‌రుగుతాయ‌ని అన్నారు. ఆగ‌మ పండితులు, చిన జీయ‌ర్ స్వామివారు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం, సంప్రదాయ‌బ‌ద్దంగా, శాస్త్రోక్తంగా ఆల‌య పునఃప్రతిష్ట కార్యక్రమం జ‌రిగింద‌ని చెప్పారు. సీతారాముల ద‌య‌తో ఈ ప్రాంతం శుభిక్షంగా ఉండాల‌ని బొత్స ఆకాంక్షించారు. 



ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖామంత్రి కొట్టు స‌త్యనారాయ‌ణ‌, విద్యాశాఖామంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ‌, దేవాదాయ‌శాఖ క‌మిష‌న‌ర్ డాక్టర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్‌, జిల్లా క‌లక్టర్ ఎ.సూర్యకుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.