Vishwakarma Puja 2022:  పురాణాల ప్రకారం, విశ్వకర్మ పుట్టిన రోజునే ‘విశ్వకర్మ జయంతి’గా జరుపుకుంటారు.  వాహనాలు, ఆయుధాలతో పాటు హిందూ దేవుళ్లు, దేవతల  రాజభనాల సృష్టికర్త అని చాలా మంది నమ్ముతారు. ద్వారకా నగరాన్ని విశ్వకర్మే సృష్టించాడని చెబుతారు. ఏటా సూర్య భగవానుడు సింహ రాశి నుంచి కన్యా రాశిలోకి ప్రవేశించే సమయంలో విశ్వకర్మ జయంతి వేడుక  జరుపుకుంటారు. ఈ సంవత్సరం సెప్టెంబర్ 17 శనివారం విశ్వకర్మ జయంతి. ఈ రోజు హస్తకళాకారులు విశ్వకర్మ పూజలో భాగంగా తమ పనిముట్లను ఉంచి ఆరాధిస్తారు. ఈ రోజు వాటిని ఏ పనికీ ఉపయోగించరు. తాము క్షేమంగా ఉండాలని..నిత్యం జీవనోపాధిని కల్పించి సురక్షింతగా ఉంచాలని.. తాము చేపట్టే ప్రతి పనిలో విజయం సాధించేలా చేయాలని విశ్వకర్మని ప్రార్థిస్తారు.


Also Read: బుధుడు, సూర్యుడు ఉన్న రాశిలోనే శుక్రుడి సంచారం, ఈ 5 రాశులవారికి శుభసమయం


విశ్వకర్మను దైవ వడ్రంగి, స్వయంభు అని పిలిచేవారు. ఈ పండుగ ఎక్కువగా అస్సాం, ఉత్తరప్రదేశ్, కర్నాటక, పశ్చిమబెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, త్రిపుర రాష్ట్రాల్లో ఎక్కువగా జరుపుకుంటారు. నేపాల్ లోనూ అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటారు. విశ్వకర్మ జయంతి రోజున దేవాలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. విశ్వకర్మ  వాహనం అయిన ఏనుగును కూడా ఈ రోజు పూజిస్తారు. అన్నదానాలు నిర్వహిస్తారు. కొన్నిచోట్ల గాలిపటాలు కూడా ఎగురవేస్తారు. 


Also Read: శరన్నవరాత్రుల్లో తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలివి!


విశ్వకర్మ భూమిపై అనేక రాజభవనాలు, నిర్మాణాలు, ఆయుధాలను సృష్టించాడు. అందుకే తనను పౌరాణిక ఇంజనీర్ అని కూడా అంటారు. భూలోకంలో ద్వారకా నగరాన్ని, పాండవుల కోసం ఇంద్రప్రస్థాన్ని, హస్తినాపురం నగరాన్ని, రావణుడి కోసం లంకా నగరాన్ని విశ్వకర్మ సృష్టించినట్లు శాస్త్రాల ద్వారా తెలుస్తోంది. మహాదేవుని చేతిలో ఉండే త్రిశూలం, విష్ణువుతో ఉండే సుదర్శన చక్రం, యమరాజు చేతిలో ఉండే పాశం, కర్ణుని కుండలు, పుష్పక విమానాలన్నీ విశ్వకర్మే సృష్టించాడని చెబుతారు. వేదాలు విశ్వకర్మను సర్వపాప సంహర్తగా పేర్కొన్నాయి. సృష్టి ఆదినుంచి సుప్రసిద్ధులైన శిల్పకారులు ఐదుగురున్నారు. వీరు విశ్వకర్మకు జన్మించినవారే. వారెవరంటే...


1.కమ్మరి (అయోకారుడు) - ఇనుము పని
2.సూత్రకారుడు(వడ్రంగి ) వర్ధకుడు - కొయ్య పని
3.కాంస్యకారి (కంచరి) తామ్ర కారుడు - రాగి, కంచు, ఇత్తడి పని
4.స్తపతి ( శిల్పి) శిల్ప కారుడు - రాతి పని
5.స్వర్ణకారి (స్వర్ణకారుడు) - బంగారు పని


విశ్వకర్మ పుట్టుక గురించి భిన్నాభిప్రాయాలు చాలా ఉన్నాయి. ఒక గ్రంథం ప్రకారం బ్రహ్మకుమారుడు ధర్ముడు, ధర్మ కుమారుడు వాస్తు దేవుడు. వాస్తుదేవుడి కుమారుడు విశ్వకర్మ అని చెబుతారు. మహాభారతంలో కూడా విశ్వకర్మ ప్రస్తావన ఉంది.విశ్వకర్మను బ్రహ్మ దేవుని కుమారుడని చెబుతారు.  వరాహ పురాణం ప్రకారం, బ్రహ్మదేవుడు విశ్వకర్మను భూలోకానికి వెళ్లామని ఆదేశించాడని చెబుతారు.ఇవి ఎంతవరకు వాస్తవం అనేదానికి ఎలాంటి ఆధారాలు లేవు.


విశ్వకర్మ స్తుతి
‘‘ఓం భగవాన్ విశ్వకర్మ దేవా శిల్పి ఇహ గచ్చ ఇహ సుప్రతిస్తో భవ’’
‘‘ఓం అనంతం నమః ఓం కూమాయై నమః
ఓం శ్రీ సృష్టతనాయ సర్వసిద్ధాయ విశ్వకర్మాయ నమో నమః’’