Vidur Niti in telugu: దృతరాష్ట్ర మ‌హారాజు సోదరుడు, కురు సామ్రాజ్య ప్రధాన మంత్రి విదురుడు. సునిశిత ఆలోచనా ధోరణి, దార్శనికత కలిగిన గొప్ప మేధావి. సరళమైన ప్రశాంత చిత్తం కలిగిన స్థిత ప్రజ్ఞ‌త కలిగిన రాజకీయవేత్త. కృష్ణ భగవానుడికి కూడా అత్యంత ప్రీతి పాత్రుడు. దృతరాష్ట్రుడు ముఖ్య విషయాలన్నింటికీ విదురుడిని సంప్రదించిన త‌ర్వాతే నిర్ణయాలు తీసుకునేవాడు. అలా వారిద్దరి మధ్య సాగిన సంభాషణలే విదుర నీతిగా ప్రాచుర్యం పొందాయి. అనేక జీవిత సత్యాలను విదురుడు దృతరాష్ట్రుడికి చెప్పినట్టుగా ప్రపంచానికి మార్గదర్శనం చేశాడు. అందులో భాగంగా జీవన విధానం, ధనం, కర్మ వంటి అనేకానేక విషయాల గురించిన వివరణలు ఇచ్చాడు. ప్రతి వ్యక్తి తన జీవితంలో 10 నియ‌మాలు తప్పనిసరిగా పాటించాలి. ఈ నియమాలను అనుసరిస్తే, అతను జీవితంలో ఎప్పటికీ విఫలంకాడ‌ని విదుర‌నీతిలో తెలిపాడు.


ఈ మూడూ న‌ర‌కానికి ద్వారాలు


కామం, దురాశ, కోపం నరక ద్వారాలు అని విదురుడు పేర్కొన్నాడు. ఈ మూడు ల‌క్ష‌ణాల కార‌ణంగా మీరు ఎప్పుడూ ఇబ్బంది పడతారు. జీవితంలో ముందుకు సాగలేరు.


మోస‌గాడిని న‌మ్మ‌వ‌ద్దు


నమ్మకాన్ని వమ్ము చేసిన వ్యక్తిని పొరపాటున కూడా మళ్లీ నమ్మకూడదు. నమ్మదగిన వ్యక్తులను మాత్రమే నమ్మండి. ఇలా చేయడం వల్ల జీవితంలో సుల‌భంగా విజయం సాధిస్తారు.


స‌జ్జ‌న సాంగ‌త్యం


మంచి పనులు చేసే వ్యక్తి సాంగత్యంలో ఉండండి. చెడు పనులు చేసే వారికి దూరం పాటించండి. నిత్య జీవితంలో చేసే సాంగత్యం పై మన జీవితం, మన ఉన్నతి అధారపడి ఉంటాయి. అది మన మనస్సును, భవిష్యత్తును, మన ఆత్మను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. సజ్జన సాంగత్యం మన ఉన్నతికి ఎంతగానో దోహదపడుతుంది.


స్థిత‌ప్ర‌జ్ఞ‌త‌


మంచి పనులు చేసేవాడిని పండితుడు అని అంటారు. సన్మానం పొందినప్పుడు ఉప్పొంగని, సన్మానించినప్పుడు కోపగించని వ్యక్తి ఉత్తముడు. అలాంటి వ్యక్తిని మహా పండితుడు అంటారు.


మ‌న‌సుపెట్టి ప‌నిచేయండి


కొన్ని పనులు జాగ్రత్తగా పరిశీలించి ప్రారంభిస్తే మంచిది. విచిలిత‌ మనస్సుతో చేసే పని అసంపూర్ణం. ఏ పనైనా నిండు మనసుతో చేస్తే ఆ పనిలో విజయం మాత్రమే దక్కుతుంది.


పంచేంద్రియాలపై నిగ్ర‌హం


పంచేంద్రియాలను అదుపులో పెట్టుకోలేని వ్యక్తి జీవితంలో ఎప్పటికీ విజయం సాధించలేడు. ఇంద్రియ నిగ్రహం లేకపోవడమే ఎన్నో అనర్థాలకు కారణం. మనిషి ఇంద్రియాలను పూర్తిగా అదుపులో ఉంచుకోగలిగితే సమస్యలు వాటంతటవే తొలగిపోతాయి.


అనుమానితుడికి ధ‌నం ఇవ్వ‌ద్దు


ఒక వ్యక్తిపై అనుమానం ఉంటే, అతనికి ఎంత‌ అవసరమైనప్పటికీ డబ్బు ఉపయోగించుకోవడానికి ఎప్పుడూ అనుమతించకూడదు. అలాంటి వ్యక్తి ఇతరుల సొమ్మును సక్రమంగా వినియోగించడు.


బ‌ల‌హీనుల‌ను క్ష‌మించ‌డం


ఒక వ్యక్తి బలంగా ఉన్నా, తన కంటే బలహీనమైన వారిని క్షమించి, సహాయం చేయాలి. అలాంటి వ్యక్తి స్వర్గానికి వెళ్తాడు.


అనారోగ్యం


నిత్యం అనారోగ్యంతో బాధపడే వ్యక్తి డబ్బు లేకపోవడంతో ఇబ్బందులు పడుతూనే ఉంటాడు. అటువంటి వ్యక్తికి అనారోగ్యం నుంచి విముక్తి పొందడమే ఆనందం.


సోమ‌రికి స‌హాయం వద్దు


సోమరిపోతుగా మారిన‌ వ్యక్తి డబ్బు సహాయం చేయ‌మ‌ని అడిగితే, అతనికి ఎప్పుడూ సహాయం చేయవద్దు. అలాంటి వ్యక్తి మీ డబ్బును ఎప్పటికీ తిరిగి ఇవ్వలేడు.



Also Read:  ఇలాంటి పనులు చేస్తే నవగ్రహాల ఆగ్రహానికి గురికాతప్పదు!