వాస్తు శాస్త్రాన్ని అనుసరించి ప్రతి దిక్కుకి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకతను, ప్రాధాన్యతను అనుసరించి నిర్మాణాలు పూర్తిచేసుకోవాలి. అలా లేని పక్షంలో ఆ నిర్మాణం అంత అనుకూలంగా ఉండదు. తెలియని అశాంతి, ఆర్థిక కష్టాలు, మనస్పర్థలు ఇలా రకరకాల సమస్యలు వెంటాడుతాయి.
ఏ నిర్మాణానికైనా ఈశాన్యం చాలా పవిత్రమైన దిశ. దీన్ని ఈశాన్య కోణం లేదా ఈశాన్య మూల అని కూడా అంటారు. ఈ దిశతో ఇంట్లో నివసించే వారి ఆరోగ్యం, ఆనందం, సంపద ముడిపడి ఉంటాయి. తూర్పు, ఉత్తరం కలిసే చోటు ఈశాన్యం అవుతుంది. ఉదయం సూర్యకిరణాలు తగిలే చోటు ఇది. పొద్దటి వెలుగు ఆరోగ్యానికి చాలా అవసరం. అందుకే ఇది పవిత్రమైన ప్రదేశం. ఈ దిక్కును కొంత జాగ్రత్తగా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. తగిన జాగ్రత్తలతో పవిత్రంగా పెట్టుకోవాల్సిన ప్రదేశం ఇది.
ఈశాన్యంలో ఉండకూడనివి
- ఈ ప్రాంతం ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. ఏమాత్రం అపరిశుభ్రత చేరినా చాలా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సి రావచ్చు.
- ఈశాన్యంలో టాయిలెట్ అసలు ఉండకూడదు. తెలియక ఒకవేళ నిర్మించినా వెంటనే తొలగించాలి. లేదంటే చాలా ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కోవాల్సి రావచ్చు.
- ఈశాన్యంలో టాయిలెట్లు ఉంటే ఇంట్లో అనారోగ్యం చేరుతుంది. ప్రతి ఒక్కరూ అనారోగ్యం బారిన పడవచ్చు.
- వెంటనే తొలగించడం సాధ్యపడని పరిస్థితుల్లో టాయిలెట్ లో ఒక గాజు గిన్నెలో సముద్రపు ఉప్పు, కర్పూరం, పటిక ఉంచాలి.
- ఈశాన్యంలో వంట గది ఉన్నాకూడా మంచిది కాదు. ఇది కూడా ఇంట్లో వ్యాధులు ప్రభలేందుకు కారణమవుతుంది.
- వంటగది ఆగ్నేయానికి మార్చడం సాధ్యం కాదని అనుకుంటే గ్యాస్ సిలెండర్ కింద ఆకుపచ్చని టైల్ లేదా రాయిని పెట్టడం వల్ల కాస్త ఉపయోగం ఉండొచ్చు.
- ఈశాన్యం మూసి ఉన్నట్టుగా ఎలాంటి కట్టడాన్ని కట్టకూడదు. గదులు నిర్మించకూడదు.
- ఈశాన్యం వైపున బయట కానీ, లోపల గానే మెట్లు ఉండకూడదు.
- ఈశాన్యంలో బెడ్ రూమ్ కూడా ఉండకూడదు.
- ఈశాన్యంలో షూరాక్ కూడా ఉండకూదు, నైరుతి పడమర దిక్కులలో షూరాక్ ఉండాలి.
ఈశాన్యంలో ఇవి ఉంటే..
- ఈశాన్యంలో పూజ గది ఉండాలి.
- దేవుడి చిత్రపటాలు ఉండాలి.
- ప్రధాన ద్వారం ఈశాన్యంలో ఉంటే మంచిది.
- ప్రధాన ద్వారానికి శుభ సూచికలు కలిగిన తోరణం అలంకరించాలి.
- ఈశాన్యం దిక్కు తేలికగా ఉండాలి. ఎలాంటి బరువులు ఉండకూడదు.
- ఈశాన్యం మూల పెరిగి ఉన్న స్థలంలో ఇల్లు నిర్మిస్తే సకల సంపదలు కలుగుతాయని వాస్తు చెబుతోంది.
- బోర్వెల్ లేదా బావి ఈశాన్యంలో ఉంటే మంచిది.
- ఈశాన్యం నీటితో సంబంధం కలిగి దిశ కాబట్టి ఈ గోడకు లేతనీలం రంగు వెస్తే బావుంటుంది.
- ఈశాన్యంలో చిన్న నీటి తొట్టెలు సానుకూల శక్తిని తెచ్చి పెడతాయి.
- ఫిష్ అక్వేరియం కూడా అమర్చుకోవచ్చు. అందులో 9 గోల్డ్ ఫిష్, ఒక బ్లాక్ ఫిష్ ఉంటే అదృష్టమని నమ్మకం.
- ఈశాన్యంలో తులసి మొక్క చాలామంచిది. ప్రతికూల శక్తులను నశింపజేసి సానుకూల శక్తులను ప్రసరింపజేస్తుంది.
- ఈశాన్యంలో ఆవూదూడ, బుద్ధ విగ్రహాలు అలంకరణకు పెట్టుకోవచ్చు.