Vastu Tips In Telugu: ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరగడం వల్ల సంతోషం దూరమైపోతుంది. ఎంత సంపాదించినా అవసరానికి డబ్బు చేతిలో ఉండదు. కుటుంబంలో అనుకోని చికాకులు వెంటాడుతుంటాయి. పోనీ ఇంటి సభ్యుల జాతకంలో ఏదైనా దోషం ఉందా అంటే అదీ ఉండదు. సమస్యేంటో తెలియదు కానీ ఇంట్లో పరిస్థితి బావోదు. ఇలాంటప్పుడు చిన్న చిన్న వాస్తు మార్పులు చేయడం ద్వాలా నెగిటివ్ ఎనర్జీని తరిమికొట్టొచ్చంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. ఇంట్లో ప్రతికూల శక్తి తగ్గించుకోవడం ద్వారా ప్రశాంతతతో పాటూ సంపద కూడా పెరుగుతుంది,ఇంట్లో అందరూ ఆనందంగా ఉంటారు. కెరీర్ బావుంటుందని సూచిస్తున్నారు. ముఖ్యంగా ఈ 6 జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు...అవేంటో చూద్దాం...


 Also Read: వారఫలం ( మార్చి 17 to 23) - ఈ వారంలో మీకు శుభప్రదమైన రోజులివే!


1. ఇంటిని పరిశుభ్రంగా ఉంచాలి


గందరగోళంగా ఉండే ఇంటిని చూస్తే మనకే చికాకుగా అనిపిస్తుంది. అలాంటప్పుడు లక్ష్మీదేవి అక్కడ ఎలా కొలువై ఉంటుంది? అందుకే ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు. అనవసర వస్తువులు సేకరించడం,పనికిరాని వస్తువులు ఇంట్లో ఉంచడం అస్సలు చేయకూడదు. వ్యర్థ్యాలను ఎప్పటికప్పుడు తొలగించడం మంచిది. 


నిత్యం దీపం వెలిగించండి


“దీపం జ్యోతి పరంబ్రహ్మ దీపం సర్వ తమోపహమ్
దీపేన సాధ్యతే సర్వం దీప లక్ష్మీ ర్నమోస్తుతే”


దీపం  జీవాత్మకే కాదు పరమాత్మకి ప్రతీక. అందుకే  దేవుడికి పూజ చేసేప్పుడు ముందుగా దీపం వెలిగిస్తారు. అందుకే దీపారాధన అంటారు..అంటే దేవుడి కన్నా ముందు దీపాన్ని ఆరాధిస్తున్నాం అని అర్థం. ఏ ఇంట్లో నిత్యం దీపారాధన చేస్తారో  ఇక్కడ నెగిటివ్ ఎనర్జీకి చోటుండదు. 


ఉదయం సమయంలో పెట్టే దీపం మాత్రమే కాదు సంధ్యాదీపం మరింత పవర్ ఫుల్. 


దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వ తమోపహమ్‌
దీపేన సాధ్యతే సర్వమ్‌ సంధ్యా దీప నమోస్తుతే
శుభం కరోతు కళ్యాణ మారోగ్యం సుఖ సంపదం
శత్రు బుద్ధి వినాశం చ దీపజ్యోతి ర్నమోస్తుతే


ఇంటి ప్రవేశ ద్వారం వద్ద నిత్యం సంధ్యాదీపం వెలిగించడం ద్వారా ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశిస్తుంది. సాయంత్రం సమయంలో ద్వారం వద్ద దీపం వెలిగించడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో అడుగుపెడుతుందని విశ్వాసం.


Also Read: ఈ 3 రాశుల రాజకీయ నాయకులు ఎంత ఖర్చుచేసినా ఓటమి తప్పదు!


3. మామిడి తోరణాలు కట్టండి


ఇంటి ద్వారానికి మామిడి తోరణాలు కట్టడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఎండిన ఆకులను కాకుండా పచ్చగా కళకళలాడుతూ ఉండే మామిడి ఆకులను తోరణంగా కట్టండి. ఆధ్యాత్మికంగానే కాదు..ఆరోగ్యపరంగా కూడా ఇది చాలా మంచిది. 


4. ఉప్పు


నిత్యం ఇంట్లో ఏదో ఒక సమస్య వెంటాడుతున్నప్పుడు, వివాదాలు జరుగుతూ ఉన్నప్పుడు ముఖ్యంగా చేయాల్సిన పనేంటంటే ఉప్పు నీటితో ఇంటిని తుడవడం. ఇల్లు ఊడ్చిన తర్వాత తడిగుడ్డ పెట్టేటప్పుడు ఆ నీటిలో కొంచెం రాళ్ల ఉప్పు వేస్తే చాలు. ఇంట్లో ఉండే నెగెటివ్ ఎనర్జీని ఉప్పు తరిమికొడుతుందంటారు వాస్తు నిపుణులు..


Also Read: రానున్న ఎన్నికల్లో ఈ రాశుల రాజకీయ నాయకులు ధనం నష్టపోయినా గెలుపు పక్కా!


5. సూర్యుడికి నమస్కారం - అర్ఘ్యం ఇవ్వడం


చాలా అనారోగ్య సమస్యలకు పరిష్కారం సూర్యారాధన. సూర్య నమస్కారాలు కూడా అందుకే చేస్తారు. అయితే ఆరోగ్యం కోసం మాత్రేమ కాదు ఇంట్లో ప్రతికూల శక్తులు తొలగించేందుకు కూడా సూర్యారాధన చేస్తారు. సూర్యోదయానికి ముందే స్నానమాచరించి నమస్కారం చేయడం, అర్ఘ్యం సమర్పించడం ద్వారా ఆ ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తుంది. నిత్యం సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం ద్వారా మీ జాతకంలో ఉండే దోషాలు తొలగిపోయి.. ఇంటా బయటా గౌరవం దక్కుతుంది


6. తులసి పూజ


తులసికి ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నిత్యం తులసి మొక్క దగ్గర దీపారాధన చేయాలి.. కుదరకపోతే కనీసం మొక్కకు నీళ్లు సమర్పించి నమస్కరించాలి. ఇంటి ముందున్న తులసి మొక్క పచ్చగా ఉంటే ఆ ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నట్టే అంటారు పండితులు. ముఖ్యంగా శుక్రవారం రోజు తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి నమస్కరించాలి.


(ఉగాది 2024 - 2025  క్రోధి నామ సంవత్సరం  వృషభ రాశి వార్షిక  ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)


ఇవన్నీ చిన్న చిన్న విషయాలే కానీ వీటిని పాటించడం ద్వారా ఇంట్లో ప్రశాంతత నెలకొంటుందని చెబుతారు వాస్తు శాస్త్ర నిపుణులు...


గమనిక: కొందరు వాస్తు నిపుణుల సూచనలు ఆధారంగా రాసిన కథనం... దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం...