కొంత మంది ఎంత కష్టపడి పనిచేసినా ఆశించిన ఫలితాలు సాధించలేరు. ఇంట్లో వారి ఆరోగ్యం కోసం చక్కని రుచికరమైన ఆరోగ్యవంతమైన ఆహారం తయారవుతుంది. కానీ ఎప్పుడూ ఎవరో ఒకరు జబ్బు పడుతూనే ఉంటారు. ఎందుకు ఇలా జరుగుతుందనేది అర్థం కాదు. వాస్తు ఇలాంటి విషయాల గురించి చాలా క్షుణ్ణంగా చర్చిస్తుంది. వాస్తును అనుసరించి కొన్ని వస్తువులు పొరపాటున కూడా వంటగదిలో పెట్టుకోకూడదు.


వంటింట్లో పెట్టుకోకూడని వస్తువులు


చీపురు పెట్టొద్దు: చీపురుని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. వంటగది సహా ఇల్లంతటిని శుభ్రం చేస్తారు. ఆ తర్వాత దానిని ఎప్పుడూ కూడా వంటగదిలో ఉంచుకోకూడదు. అలా ఉంచితే అశుభం. వంటగదిలో చీపురు ఉంచితే ఇంట్లో వారికి అనారోగ్యాలు కలుగుతాయట. అన్నపూర్ణా దేవి అలుగుతుందని కూడా వాస్తు చెబుతోంది. ఇంట్లో ధాన్యం నిలువలు కూడా తగ్గిపోతాయి.


మందులు ఉంచొద్దు: వంటింట్లో అందరి ఆయురారోగ్యాల కోసం ఆహారం తయారవుతుంది. అక్కడ పొరపాటున కూడా మందులు ఉంచకూడదు. అలా చెయ్యడం వల్ల ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ వస్తుంది. ఫలితంగా కష్టాలు, అనారోగ్యాలు, ఆర్ధిక ఇబ్బందులు రావచ్చు. కాబట్టి ఇంట్లో ఎవరు వాడే మందులైనా సరే వంట గదిలో కాకుండా మరెక్కడైనా పెట్టుకోవాలి.


అద్దం వద్దు: వంటింట్లో అద్దం ఉండకూడదు. వంట గదిలో అద్దం ఉండడం వల్ల అగ్నికి ప్రతిబింబం ఏర్పడుతుంది. అందువల్ల అద్దంలో శక్తి ఉత్పత్తి అవుతుంది. ఇది ఇంటికి చాలా హానికరం. వంటగదిలో అద్దం ఉంటే కష్టాలు ఎన్నటికీ తీరవని వాస్తు చెబుతోంది.


పాడైన వస్తువులు ఉంచొద్దు: చాలామందికి వంటింట్లో వాడే వంట పాత్రలు లేదా ఇతర వస్తువులు పాడైపోయినా, విరిగి పోయానా, రంథ్రాలు పడినా సరే వాటిని పారెయ్యడానికి ఇష్టపడరు. కానీ వాస్తు ఇలా పాడైపోయిన వస్తువులను ఇంట్లో ఉంచుకోవడం అశుభం. వంటగదిలో పాడైపోయిన వస్తువులు, పనికిరాని పాత్రల వంటి వ్యర్థాలు ఉంచుకోకూడదు. ఇది అన్నపూర్ణ దేవికి చేసే అవమానంగా భావించాల్సి ఉంటుంది. కనుక వంటింట్లో పనికిరాని వస్తువులు ఏమున్నా తీసెయ్యాలి.


ఇవి వంటింట్లో తప్పక ఉండాలి


⦿ కొన్ని వస్తువులు వంటింట్లో నిండుకోకుండా కూడా చూసుకోవాలి. కొన్ని వస్తువులు ఎప్పుడూ ఇంట్లో లేకుండా ఉండకూదని వాస్తు చెబుతోంది. ఆ పదార్థాలు లేదా వస్తువులు అయిపోవడానికి ముందే తెచ్చి ఇంట్లో నిలవ ఉంచుకోవాలి.


⦿ వంటింట్లో ఉప్పు ఎల్లప్పుడు ఉండాలి. సముద్రం నుంచి పుట్టిన ఉప్పు లక్ష్మీకి సోదర సమానం. అంతేకాదు ఉప్పు ఇంట్లోని నెగెటివ్ ఎనర్జీని పారద్రోలుతుంది. వాస్తు దోషాలకు కూడా పరిహారంగా ఉంటుంది. రాహు, కేతు ప్రభావాలను నివారిస్తుంది. కాబట్టి ఉప్పు నిండుకోకుండా చూసుకోవాలి.


⦿ పసుపు చాలా పవిత్రమైందిగా భావిస్తారు. ప్రతి వంటలోనూ చిటికెడైనా పసుపు వాడాలి. పసుపు గురు గ్రహానికి ప్రతీక. ఇంట్లో పసుపు నిండుకుంటే గురు గ్రహదోషం కలుగుతుంది. అన్ని పనులకు ఆటంకాలు ఎదురవుతాయి.


⦿ బియ్యం ప్రధాన ఆహార ధాన్యం మనకు. ఇది ధాన్య లక్ష్మికి ప్రతీక. శుక్ర గ్రహానికి ప్రతీక. వంటగదిలో బియ్యం నిండుకోవడం అంటే అందుకు శుక్రుడి దోషం అని భావిస్తారు. బియ్యం నిండుకోవడం అంటే డబ్బుకు కొరతగా భావించాలి. అందుకే వంటింట్లో బియ్యం నిండుకోకుండా చూసుకోవాలి.  


Also Read: మీరు అటు తిరిగి భోజనం చేస్తున్నారా? జాగ్రత్త, కష్టాలు వెంటాడుతాయ్!