2023 నాటికి  80 శాతం కొత్త 5G స్మార్ట్ ఫోన్లు


భారత్ లో 5G నెట్ వర్క్ సేవలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. జియో, ఎయిర్ టెల్ లాంటి సెల్యూలార్ కంపెనీలు రోజు రోజు 5G నెట్ వర్క్ పరిధిని విస్తృతం చేస్తున్నాయి. ఇప్పటికే సుమారు 60 నగరాలు, పట్టణాల ప్రజలకు ఈ సేవలను అందుబాటులోకి తెచ్చాయి. వచ్చే ఏడాది చివరి నాటికి దేశ వ్యాప్తంగా 5G సేవలు అందుబాటులోకి తేనున్నట్లు జియో వెల్లడించింది. అటు 2024 చివరి నాటికి దేశమంతటా 5G సేవలను విస్తరిస్తామని ఎయిర్ టెల్ తెలిపింది. ఈ నేపథ్యంలో ఇండియన్ సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ICEA) చైర్మన్ పంకజ్ మొహింద్రూ కీలక విషయాలను వెల్లడించారు.


2024 నాటికి దేశ వ్యాప్తంగా 5G సేవలు


దేశంలో ఇప్పటికే 60 నగరాలు, పట్టణాలు కొత్త సాంకేతికతను ఆస్వాదిస్తున్నట్లు  పంకజ్ తెలిపారు. 2023 చివరి నాటికి, 75-80 శాతం కొత్త స్మార్ట్‌ ఫోన్‌ లు లాంచ్ అవుతాయని చెప్పారు. ఇవన్నీ 5G నెట్ వర్క్ కు సపోర్టు చేసేలా ఉంటాయని వెల్లడించారు. ఈ ఏడాది అక్టోబర్ 1న ప్రధాని నరేంద్ర మోడీ 5G సేవలను అధికారికంగా ప్రారంభించారు.  టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు ఎంపిక చేసిన నగరాల్లో ఈ సేవలను ప్రారంభించారు. 2023 చివరి నాటికి లేదంటే 2024 ప్రారంభ నెలల్లో దేశ వ్యాప్తగా ఈ సేవలు విస్తరించేలా ప్లాన్ చేస్తున్నారు. “దేశంలో 5G టెక్నాలజీ శరవేగంగా విస్తరిస్తోంది. ఈ 5G టెక్నాలజీని కొత్త తరం టెలికాం పరికరాల తయారీదారులు, అప్లికేషన్ ప్రొవైడర్లు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT), మెషిన్-2-మెషిన్ (M2M), హెల్త్‌ కేర్ సర్వీసెస్, ఇతరులతో కలిసి మరింత సమర్థవంతంగా ఈ సేవల పరిధిని పెంచుతున్నాం” అని పంకజ్ మొహింద్రూ వెల్లడించారు.  


సెమీకండక్టర్ ఎకో సిస్టమ్ ఏర్పాటుకు రూ. 76 వేల కోట్లు


వాస్తవానికి దేశంలో 5G సేవలను ప్రారంభించక ముందే, దాదాపు 80 నుంచి 100 మిలియన్ల 5G సపోర్టు చేసే  ఫోన్‌లు  మార్కెట్లో ఉన్నాయి. 'ఎరిక్సన్ మొబిలిటీ రిపోర్ట్' ప్రకారం, 690 మిలియన్ల వినియోగదారులతో 2028 నాటికి భారతదేశంలో మొబైల్ సబ్‌ స్క్రిప్షన్‌లలో 53 శాతం 5Gతో ప్రపంచంలోనే టాప్ లో నిలువనుంది.  భారతదేశంలో 5G సబ్‌ స్క్రిప్షన్‌లు 2022 చివరి నాటికి దాదాపు 31 మిలియన్లకు చేరుకోనున్నట్లు తెలుస్తోంది. 2020లో భారతీయ సెమీకండక్టర్ మార్కెట్ $15 బిలియన్లు ఉండగా, 2023 నాటికి $63 బిలియన్లకు చేరుతుందని పంకజ్ మోహింద్రూ చెప్పారు. "5G దేశానికి గొప్ప అవకాశం. సెమీకండక్టర్ ఫ్యాబ్, కాంపౌండ్ సెమీకండక్టర్స్, డిస్క్రీట్ సెమీకండక్టర్స్, అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్ (ATMP) యూనిట్లు సహా మొత్తం సెమీకండక్టర్ ఎకో సిస్టమ్ ను ఏర్పాటు చేయడంపై ప్రభుత్వం  దృష్టి సారించింది. ఇందుకోసం రూ. 76,000 కోట్ల ప్రోత్సాహక వ్యయాన్ని ప్రభుత్వం అందిస్తోంది" అని మొహింద్రూ వివరించారు.


Read Also: మీరు విమానాశ్రయాల దగ్గర నివసిస్తున్నారా? ఇప్పట్లో 5Gని పొందలేరు, ఎందుకో తెలుసా?