భారతీయ జీవన విధానంలో ప్రతి చిన్న విషయం కూడా శాస్త్రబద్ధమే. ఇంటి నిర్మాణం, గదుల అమరిక, గుమ్మాలు, కిటికీలు, దిక్కులు, మూలలు వంటి విషయాలు మాత్రమే కాదు.. రోజువారీ జీవితంలో ప్రతి ఒక్క అంశాన్ని కూడా వాస్తు నియమబద్ధంగా వివరిస్తుంది. వంటగది ఏమూలన ఉండాలో అని మాత్రమే కాదు.. వంట చేయడం, వడ్డించడం వరకు చాలా విషయాలను చర్చిస్తుంది. అయితే, నియమాలను కొందరు అస్సలు పట్టించుకోరు. చాలామందికి వాటిపై పెద్దగా అవగాహన కూడా ఉండదు. ఫలితంగా ఎన్నో కష్టాలను ఎదుర్కొంటారు. 


నేటి జీవన శైలిలో ఆహారానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఎక్కడో నిలబడి, ప్రయాణం చేస్తూ ఇలా రకరకాల స్థితుల్లో మొక్కుబడిగా భోజనాలు కానిచ్చేవారు కోకొల్లాలు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటుంటారు. తీసుకునే ఆహారం ప్రాణప్రదమైంది. సాక్షాత్తు అన్నపూర్ణ స్వరూపం. తినే తిండికి సరైన గౌరవం ఇవ్వకపోతే దాని వల్ల అందాల్సిన పోషణ అందదని శాస్త్రం చెబుతోంది. ఆకలి కటిక పేదకైనా, కోటీశ్వరుడికైనా ఒకటే. ఆకలిగా ఉంటే అన్నం కావల్సిందే. ఆకలి తీర్చే అన్నానికి ఎవరైనా విలువ ఇవ్వాల్సి ఉంటుంది. నియమబద్ధంగా ఆహారం తీసుకుంటే అది ఇంటికి శుభాన్ని, ఇంట్లోని వ్యక్తులకు ఆరోగ్యాన్ని సిరిసంపదలు వద్దన్నా వస్తాయి. భోజనానికి సంబంధించి వాస్తు చెప్తున్న కొన్ని ముఖ్యమైన నియమాలు తెలుసుకుందాం.


ఏ దిక్కున కూర్చొని భోజనం చేయాలి?



  • భోజనం చేసేందుకు ఎప్పుడూ తూర్పు లేదా ఉత్తరాభిముఖంగా కూర్చోవాలి. దక్షిణాభిముఖంగా కూర్చొని ఎప్పుడూ భోజనం చెయ్యకూడదు. ఎందుకంటే దక్షిణం యమస్థానం. ఇది మృత్యువుకు సంకేతం. కనుక అటువైపు తిరిగి తీసుకునే ఆహారం ఆరోగ్యానికి మంచిది కాదు.

  • భోజనం వడ్డించుకున్న తర్వాత మొదటి ముద్దను దైవ ప్రార్థన చేసి పక్కన పెట్టాలి. భోజనం ముగించిన తర్వాత పశువులకు లేదా పక్షులకు లేదా చీమలు వంటి కీటకాలకు పెట్టాలి. ఇది అన్నపూర్ణ దేవిని ప్రసన్నం చేసుకునేందుకు చక్కని మార్గం.

  • భోజన సమయంలో గ్లాసులో నీళ్లు ఎప్పుడూ కుడి వైపు పెట్టుకోవాలి. ఇలా చేస్తే సదా శుభాలు కలుగుతాయి. జీవితం ఆనందంగా ఉంటుంది. సమృద్ధిగా కూడా ఉంటుంది.

  • భోజనం తర్వాత ప్లేట్ లో ఎప్పుడూ చేతులు కడగకూడదు. ఇలా చెయ్యడమంటే దరిద్రానికి ఆహ్వానం పలికినట్టే. సంపద నశిస్తుంది. ఇంట్లోని ఆనందం, శాంతి పోతాయి.

  • భోజనం ఎప్పుడూ శుభ్రమైన ప్రదేశంలో, శుభ్రమైన పళ్లెంలోనే చెయ్యాలి. అలా చెయ్యకపోతే అన్నపూర్ణ దేవికి కోపం వస్తుంది. ఆమె అలిగి వెళ్లి పోతుంది. ఫలితంగా తిండికి అలమటించాల్సి వస్తుందని శాస్త్రం చెబుతోంది.

  • పచ్చని ఆకులో భోంచెయ్యడం శుభప్రదం, ఇలా ఆకుపచ్చని ఆకులో భోజనం వడ్డించుకుని భోజనం చేస్తే దేవి అన్నపూర్ణ ఆనందిస్తుంది. అందుకే దేవుడికి నైవేద్యం పచ్చని ఆకులో వడ్డించాలని చెబుతారు.

  • వెండి పళ్లెం భోజనానికి ఉపయోగించేట్టయితే తప్పనిసరిగా పళ్లెం మధ్యలో బంగారంతో చేసిన బొట్టు ఉండాలి. అలా లేని వెండి పళ్లెం భోజనానికి పనికిరాదు.

  • భోజనం తర్వాత వెంటనే నిద్రించకూడదు. ఇది కూడా దరిద్రానికి చిహ్నం.  


ఈ చిన్న చిన్న నియమాలు పాటించి భోంచేస్తే ఆరోగ్యం, ఆనందం, సంపద మీ వెంటే ఉంటాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.