దీపావళి దివ్వెల వెలుగుల పండగ. ఈ పండగ పిల్లలు పెద్దలు అందరికీ చాలా ఇష్టమైన పండగ. కొత్త బట్టలు, దీపాలు, బాణాసంచా, లక్ష్మీ పూజలు, ఇంటికి వచ్చే అతిథులు, కలుసుకోవాల్సిన బంధువులు ఇలా రకరకాల సంప్రాదాయాలు ఉంటాయి. పండగ నాడు ఉండే సందడి ఎలాగూ ఉంటుంది. అయితే పండగకి వారం పదిరోజుల ముందు నుంచి పండగ సందడి మొదలవుతుంది. ఇల్లు అందంగా అలంకరించడానికి అవసరమైన సామాగ్రి కొనడం, కొన్న వాటిని అలంకరించడం, ఇంట్లోని చెత్త పారేయ్యడం, కొత్త వస్తువులు కొనుక్కోవడం ఇలా ఎన్నో కొత్త విషయాలతో ముడి పడిన పండగ దీపావళి. అయితే ఇల్లు అనగానే వాస్తు ఉంటుంది. చేసే అలంకారం వాస్తును అనుసరించి చేసుకుంటే మరింత మంచిది కదా ఇంటి క్లీనింగ్ నుంచి రకరకాల అలంకారాలలో వాస్తు నియమాలను ఒకసారి తెలుసుకుందాం.


ఇల్లు పరిశుభ్రంగా ఉంటేనే లక్ష్మీ కటాక్షం


ఇల్లు అలంకారానికి ముందు ఒక సారి క్లీన్ చేసుకుంటాం. పరిశుభ్రమైన ఇల్లు లక్ష్మీ నిలయంగా భావిస్తారు. ఇల్లు ఆఫీసులు, వ్యాపార స్థలాల ప్రతి మూల నుంచి చెత్త చెదారం తీసి పారస్తే నెగెటివ్ ఎనర్జీ బయటికి పంపేసినట్టు అవుతుంది. కిచెన్, స్టోర్ రూం వంటివన్నీ అవకాశాన్ని బట్టి శుభ్రం చెసుకోవాలి. ఎక్కడా చెత్త లేకుండా తీసేస్తే తప్ప ఇల్లు శుభ్రపడినట్ట కాదని గుర్తుంచుకోవాలి.  


పాత వస్తువులు పడేయండి: సంపాదించడం కంటే వదులుకోవడం కష్టం అంటారు పెద్దలు. చాలామంది ఇంట్లోని ఏ వస్తువును బయట పడెయ్యడానికి ఇష్ట పడరు. కొన్ని వస్తువులు ఏళ్ల తరబడి వాడకపోయినా అవి అటక మీద మగ్గుతూ ఉంటాయి. అలాంటి వాటిని గుర్తించి ఈ దీపావళికైనా వదిలించుకోవడం మంచిది. విరిగిపోయిన, పగిలిపోయిన ప్రతి వస్తువును బయట పడేయ్యాలి. అంతేకాదు ఏళ్ల తరబడి వాడని ఎలక్ట్రానిక్ వస్తువులు, బొమ్మలు, వస్తువులను కూడా వదిలించుకోవడం మంచిది. ఇలాంటివి కూడా నెగెటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తాయి.


ఈ దిక్కుల్లో విరిగిన ప్రతిమలు తీసేయండి: ఇంట్లోని ఉత్తర దిక్కుకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఉత్తరం, ఈశాన్య దిక్కులను ఎప్పుడూ శుభ్రంగా పెట్టుకోవాలి. సాధారణంగా ఇటువైపే పూజ గది ఉంటుంది. కానీ పూజ గదిలో సైతం పూజలో లేని దేవుడి ఫోటోలు, విరిగిపోయిన, తీసేసిన దేవుడి ప్రతిమల వంటివి ఏదో ఒక మూల ఉంటూ ఉంటాయి. అలాంటివన్నీ తీసి ఎక్కడైనా పారుతున్న నీటిలో లేదా గొయ్యి తీసి నేలలో పాతెయ్యడం మంచిది. ఈశాన్యం ఇంటికి కుబేర స్థానం అని మరచిపోవద్దు. ఉత్తర, ఈశాన్య దిక్కుల్లో ఎలాంటి వాస్తు దోషాలు లేకుండా చూసుకోవాలి. ఇటువైపు ఉండే వాస్తు దోషాలు ఇంటి ఆర్థిక స్థితి మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి.


అందంగా అలంకరిస్తే పాజిటివ్ వైబ్స్: ఇంట్లో దీపాలు, లైట్స్, పువ్వులు, ముగ్గులు, ఫ్లోటింగ్ క్యాండిల్స్, గులాబి రేకులు ఇతర అలంకారాలతో ముంచెత్తండి. ఇది ఇంట్లోకి పాజిటివ్ వైబ్స్ ను ఆకర్శిస్తుంది. లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. వాకిళ్లు ముగ్గులతో అలంకరిస్తే అందంగా కనిపిస్తుంది. ముంగిలి అందంగా ఉంటే లక్ష్మీదేవి ఆనందిస్తుందని అంటారు. ఇంటి మెయిన్ ఎంట్రెన్స్ దగ్గర శుభలాభాల సంకేతంగా రెండు వైపులా స్వస్తికాలు ముగ్గుగా వెయ్యడం మరచిపోవద్దు.


Also Read: ఇంట్లో నైరుతి దిక్కులో ఈ వస్తువులను పెడుతున్నారా? మీకు ఈ సమస్యలు తప్పవు