తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీకి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తమ గుర్తు కారును పోలిన గుర్తును ఇతర పార్టీలకు కేటాయించొద్దని టీఆర్ఎస్ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఈ సమయంలో పిటిషన్ పై జోక్యం చేసుకోలేమని హైకోర్టు వ్యాఖ్యానించింది. గతంలో జరిగిన ఎన్నికల్లో కారు గుర్తును పోలిన గుర్తుల (కెమెరా, చపాతీ రోలర్‌, డోలి (పల్లకి), రోడ్‌ రోలర్‌, సబ్బు పెట్టె, టీవీ, కుట్టుమిషన్‌, ఓడ)తో తమ అభ్యర్థులకు నష్టంమని, ఇతర పార్టీల అభ్యర్థులకు కారును పోలిన ఎన్నికల గుర్తులను కేటాయించవద్దని టీఆర్ఎస్ పార్టీ హైకోర్టులో పిటిషన్ వేయగా, నేడు విచారణ చేపట్టిన ధర్మాసనం ఆ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.


టీఆర్ఎస్ లో గుర్తుల భయం !
మునుగోడు ఉప ఎన్నికల్లో నామినేషన్లు వేసిన స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల సంఘం కేటాయించిన గుర్తులు టీఆర్ఎస్ ని కలవరపాటుకు గురి చేస్తున్నాయి. కొన్ని గుర్తులు కారు గుర్తును పోలి ఉండడంతో తమకు రావాల్సిన ఓట్లు చీలతాయని గులాబీ నేతలు ఆందోళన చెందుతున్నారు. తమ ఎన్నికల గుర్తు కారును పోలిన సింబల్స్‌ను ఇతరులకు కేటాయించ వద్దని ఎన్నికల కమిషన్‌కు ఆదేశాలివ్వాలని కోరుతూ టీఆర్ఎస్ పార్టీ హైకోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు వేసింది. ఈ పిటిషన్‌పై హైకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టి, ఆ పిటిషన్ ను కొట్టివేసింది.


మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు కారును పోలిన గుర్తులు ఇతరులకు ఇవ్వవద్దని అక్టోబర్ 10న ఈసీని కలసి విజ్ఞప్తి చేశారు టీఆర్ఎస్ నేతలు. కానీ ఈసీ నుంచి స్పందన కరువు కావడంతో, హైకోర్టుకు వెళ్లింది టీఆర్ఎస్. కానీ అక్కడ సైతం అధికార పార్టీకి చుక్కెదురైంది. ఈవీఎంలో స్టాంప్‌ పరిమాణంలో ఉండే కారును పోలిన గుర్తుల కారణంగా ఓటర్లు తికమకపడతారని, రోడ్‌ రోలర్‌ గుర్తును ఎవరికీ కేటాయించబోమని ఈసీ 2011లో ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత కూడా ఆ గుర్తును కేటాయించారని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.


మభ్యపెడుతున్న రోడ్డు రోలర్ గుర్తు! 
2018లో రోడ్డు రోలర్‌ గుర్తుకు జహీరాబాద్‌లో ఏకంగా 4330 ఓట్లు వచ్చాయి. ఇక్కడ సీపీఐకి 1,036 ఓట్లే పోలయ్యాయి. డోర్నకల్‌లో రోడ్డురోలర్‌కు 4,117 ఓట్లు, సీపీఐకి 1,361 ఓట్లు, మునుగోడులో రోడ్డు రోలర్‌కు 3,569 ఓట్లు, బీఎస్పీకి 743 ఓట్లు వచ్చాయి. దీనికి కారణం రోడ్‌ రోలర్‌ గుర్తు కారును పోలి ఉండటమే. మరికొన్ని చోట్ల ఇదే కారణంగా కెమెరాకు 3 వేల నుంచి 9 వేల ఓట్లు.. టీవీకి 2 వేల నుంచి 3 వేల ఓట్లు వచ్చాయి. ఇలాంటి గుర్తులను కేటాయిస్తే టీఆర్‌ఎస్‌ నష్టపోయే అవకాశం ఉందని పిటిషన్ లో వివరించింది. 


ఉప ఎన్నికలో నామినేషన్ల ఉపసంహరణ తరువాత అభ్యర్థులకు ఎన్నికల అధికారులు సోమవారం రాత్రి గుర్తులను కేటాయించారు. కొందరు అభ్యర్థులు టీఆర్‌ఎస్, బీజేపీలను ఇరకాటంలో పెట్టే గుర్తులను ఎంచుకోవడంతో ఆ పార్టీ నేతల్లో ఆందోళన నెలకొంది. కారు గుర్తును పోలి ఉన్న డోజర్, రోడ్డు రోలర్‌లను స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించడంతో వాటిని జాబితా నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. వాటిని ఎవరికీ కేటాయించవద్దని టీఆర్‌ఎస్‌ నేతలు చండూరులోని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం వద్ద సోమవారం రాత్రి ధర్నాకు దిగారు. గత అనుభవాల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌కు చెందిన కారు గుర్తును పోలి ఉన్న గుర్తులను ఎవరికీ కేటాయించవద్దని, వాటిని జాబితా నుంచి తొలగించాలని కోరారు.