సాధారణంగా ఏ వస్తువు కొనుగోలు చేస్తున్నా అందరూ ముందుగా చూసేది దాని ఎక్స్ పైర్ డేట్. ఆ వస్తువు కాలపరిమితి ఎంత వరకు ఉన్నదో చెక్ చేసిన తర్వాతే ఆహార పదార్థాలు, పానీయాలు తీసుకోవడం జరుగుతుంది. ప్యాక్ చేసిన, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల ఎంపిక విషయంలో ఇది మరి ముఖ్యం. ఎందుకంటే తేదీ దాటిన వాటిని తినడం ఆరోగ్యానికి హానికరం అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆఖరికి తీసుకునే మెడిసిన్ విషయంలో కూడా ఎక్స్ పైర్ డేట్ చూడాలి. అలా చూసుకోకుండా ఉపయోగిస్తే ఒక్కోసారి అవి విషపూరితం అయి ప్రాణాల మీదకి వచ్చే ప్రమాదం ఉంది.


కొన్ని ఆహార పదార్థాల విషయంలో గడువు ముగిసిన తర్వాత వాటిని తీసుకుంటే ఎటువంటి సమస్య ఉండకపోవచ్చు. ఎందుకంటే వాటి విషయంలో అది కేవలం రుచి మారుతుంది. ఆ గడువు ఆహార పదార్థం తాజాదనానికి గుర్తు. అయితే గడువు ముగిసిన ఆహారం క్రమం తప్పకుండా తినడం మంచి పద్ధతి కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గడువు ముగిసిన ఆహారం ఎందుకు తినకూడదంటే..


ఫుడ్ పాయిజనింగ్: పాత లేదా గడువు ముగిసిన ఆహారం తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ కి దారి తీయవచ్చు. అయితే గుడ్లు, మాంసం, కూరగాయలు, పండ్లు  వంటి త్వరగా పాడైపోయే ఆహారాలు తాజావి తీసుకోకపోతే అవి ఆరోగ్యానికి హాని చేస్తాయి. ఆహారాలని నిల్వ ఉంచినట్లయితే వాటిని గడువు తేదీ ముందే తినాలని నిర్థారించుకోవాలి.


బ్యాక్టీరియాకి ఆవాసం: ప్యాక్ చేసిన ఆహారాలు గడువు తేదీతోనే వస్తాయి. అటువంటి వాటిని తప్పనిసరిగా గడువు తేదీ లోపే తినడం చెయ్యాలి. ఇవి నిల్వ ఉండేందుకు కొన్ని ప్రిజర్వేటివ్ లు ఉన్నాయి. ఇచ్చిన తేదీ లోపు మాత్రమే ఆహారం సురక్షితంగా ఉంటుంది. గడువు ముగిస్తే ఆహారాన్ని కలుషితం చేసే వివిధ రకాల బ్యాక్టీరియాలు చేరి పోతాయి. ఉదాహరణకి బ్రెడ్.. ఇది గడువు తేదీ కంటే ముందే తినకపోతే ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. వాటిలో నల్లగా ఫంగస్ ఏర్పడుతుంది.


పోషక విలువలు పోతాయి: శరీరానికి కావాల్సిన పోషకాలు అందాలంటే తప్పకుండా తాజా ఆహారాన్నే ఎంపిక చేసుకోవాలి. ఎక్కువ రోజులు నిల్వ ఉన్న ఆహారంలో పోషక విలువలు తగ్గిపోతాయి. అందుకే గడువు తేదీ దాటిన ఆహారాన్ని తింటే అది ఆరోగ్యానికి మంచిది కాదు, దాని పోషక విలువలు కూడా నశించిపోతాయి. అటువంటి పదార్థాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టినట్టే.


మనం కొనుగోలు చేసే ఉత్పత్తులపై తప్పని సరిగా తయారీ తేదీ, దాని గడువు తేదీ తప్పనిసరిగా గమనించాలి. మరికొంచెం అవగాహన ఉన్న వాళ్ళు అయితే వాటి తయారీకి ఉపయోగించే పదార్థాలు ఏంటి అనేది కూడా గమనిస్తారు. ఇక పాల ఉత్పత్తులు ఫ్రిజ్ లో పెడుతున్నాం కదా ఎన్ని రోజులు తర్వాత అయినా తినొచ్చు అని అనుకోకూడదు. ఎక్కువ రోజులు కూలింగ్ కి ఉండటం వల్ల దాని రుచి కోల్పోతుంది. అందుకే నిర్ణీత గడువు లోపే వాటిని తినడం ఉత్తమం.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: మహిళలూ రొమ్ము క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలా? ఈ పంచ సూత్రాలు పాటించండి