సొంత ఇళ్లు నిర్మించుకోవాలన్నది ప్రతీ ఒక్కరి కల. అందుకోసం అన్నింటినీ ఆలోచించి ప్రతీది వాస్తు ప్రకారం ఉండాలని అనుకుని ఇల్లు కట్టుకుంటారు. వాస్తు శాస్త్రంలో ప్రతి ఒక్క దిశ ఒక్కో ప్రాధాన్యతను సూచిస్తుంది. అయితే ఆ దిశలో చేయాల్సింది చేయకుండా వేరే రకంగా కడితే అది గృహంలో ప్రతికూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. అది ఆ ఇంట్లో వ్యక్తులపై పడుతుంది. ఇంట్లో నైరుతి భాగం చాలా ప్రాధాన్యత కలిగి ఉంది. అది ఇంట్లోని ఆనందానికి కారణం. ఇంటి పడమర, దక్షిణ దిశలలో వీధులు ఉండే ఆ స్థలాన్ని నైరుతి  దిశ అంటారు. నైరుతి దిశ వాస్తు ప్రకారంగా ఉండి అలాంటి స్థలాలలో పెద్ద పెద్ద కట్టడాలు ఉంటే, వ్యాపార రంగంలో బాగా రాణింపు ఉంటుంది.


వాస్తు శాస్త్రం, జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ నైరుతి దిశ అనేది గ్రహాలలో ఒకటైన రాహువు అధిపతి, పాలకుడు నిరతుడు అనే రాక్షసుడు. ఈ దిశ మీ ఇంటి స్థిరత్వాన్ని కూడా సూచిస్తుంది. అందుకని ఈ ప్రాంతాన్ని దానికనుగుణంగా మార్చడం చాలా అవసరం. అక్కడ వాస్తు ప్రకారం లేకపోతే ఇంట్లో కలతలు ఉండే అవకాశం ఉంది. మరి ఆ దిశలో అసలేం ఉండాలి, ఏం ఉండకూడదో చూద్దాం.


1. ఇంట్లో నైరుతి భాగంలో పూజామందిరం ఉంటే వెంటనే అక్కడ నుంచి దాన్ని తీసేయండి. నైరుతి భాగంలో పూజా మందిరం అస్సలు ఉండకూడదు. అక్కడ పూజా మందిరం ఉంటే దేవుడి మీద ఏకాగ్రత రాదు, మనసు చంచలంగా ఉంటుంది. దానివల్ల మనం చేసిన పూజలన్నీ నిష్ఫలం అవుతాయి. 


2. నైరుతి మూలలో మనకున్న స్థలం మొత్తం మిగితా అన్ని దిశలకంటే కాస్త ఎత్తుగా ఉండేలా చూసుకోండి. నైరుతి దిశ ఎత్తుగా ఉండడం వలన ఆ ఇంటివారు సకల సంపదలతో తులతూగుతారు. వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఇంటి పెద్దకు సమాజంలో గుర్తింపు లభిస్తుంది. మాటకు బలం ఉంటుంది. అన్నింటా కార్యసిద్ది కలుగుతుంది.


3. నైరుతి దిశకు నైరుతి భాగంలో ఎలాంటి వీధి పోటు ఉండవద్దు. దీనివల్ల అశుభ ఫలితాలు కలుగుతాయి. అంతేకాదు ఆ దిశలో బావి ఉంటే వెంటనే దాన్ని మూసేయండి. అంతేకాదు వర్షం నీరు కూడా నిలవకుండా , కరెంటుకు సంబంధించిన వస్తువులు కూడా ఉండకుండా  జాగ్రత్త పడండి. 


4. నైరుతి భాగంలో ఎంత బరువు ఉంటే అంత మంచిది. అందుకని నైరుతి దిశలో గ్యారేజీలు, పార్కింగ్ లు వంటివి, మేడమెట్లు వంటివి కడితే శుభఫలితాలు కలుగుతాయి. 


5. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే నైరుతి మూలలో మరుగుదొడ్డిని అస్సలు నిర్మించవద్దు. ఇది ఇంట్లో అస్థిరతకు, ద్రవ్యనష్టానికి, గొడవలకు దారితీస్తుంది. 


6. గృహనికి నైరుతి మూలలో ఏదైన నిర్మాణం చేయాలనుకుంటే పని ప్రారంభమైన నాటి నుంచి నిర్మాణం ఆగకుండా పని జరగాలి. ఒకవేళ నిర్మాణం ఆగితే తిరిగి కట్టడం కష్టతరం అవుతుంది. దాంతో పాటూ ఆర్థిక బాధలు, ప్రాణాపాయం ఉండే అవకాశాలుంటాయి. కాబట్టి ఆ మూలలో కట్టాలనుకుంటే దాని నిర్మాణానికి సంబంధించిన అన్ని వస్తువులను సమకూర్చుకున్నాకనే నిర్మాణం మొదలుపెట్టాలి.


7. ఈ దిశ ప్రవేశానికి మంచిది కాదు. నైరుతి ద్వారం గుండా నడవకూడదు. ఇక ఈ దిశంలో భారీ ఫర్నీచర్, ఆభరణాలు, విలువైన డాక్యుమెంట్లు, పెయింటింగ్స్ లాంటివి ఉంచితే చాలా మంచిది.


Also Read: విదుర నీతి ప్రకారం ఎలాంటి వ్యక్తులకు నిద్రపట్టదు?