సంజయుడు పాండవ శిబిరం నుంచి తిరిగి వచ్చి పాండవుల మనసులో మాటను ద్రుతరాష్ట్రునికి వివరించి చెప్పిన తర్వాత.. పాండవుల మనోగతం తెలిసిన ద్రుతరాష్ట్రుడు చాలా బెంగ పడతాడు. అప్పుడు విదురుడు ద్రుతరాష్ట్రునికి ధైర్యం చెబుతూ జీవితానికి అవసరమైన అనేక విషయాల గురించి వివరిస్తాడు. అతడి నీతి వాక్యాలు ఇప్పటికీ ఆచరణీయం. అటువంటి విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
ఎవరికి నిద్ర పట్టదు?
నిద్ర పట్టకపోవడం ఒక మానసిక స్థితి. పగలంతా కష్టించి పనిచేసే వాడికి నిద్ర లేకపోవడం ఉండదు. కష్టం తెలియని సుఖ లాలసునికి నిద్ర దొరకదు. అంతేకాదు, చింతలు వేధించే వారిని కూడా నిద్ర వరించదు. అసలు నిద్ర పట్టని బెంగ ఎందుకుంటుంది? ఎటువంటి వారికి నిద్ర దూరం అవుతుందనే విషయాలను విదుర నీతిలో చక్కగా వివరించారు.
ఈ లక్షణాలుంటే నిద్రకు లోటు ఉండదు: సాత్విక స్వభావంతో మెదిలేవాడు, ధర్మం తప్పని వాడిని ఎవ్వరూ వంచించలేరు. దుర్మార్గపు ఆలోచనలకు దూరంగా ఉండడం, సత్కర్మలు ఆచరించడం, అబద్ధం చెప్పకపోవడం ఉత్తముడి లక్షణాలు. అల్ప సంతోషము, ఆత్మ స్తుతి, కోపిష్టి తనము, ఇతరులెవ్వరిని మోసం చెయ్యని వాడే విధ్వాంసుడు. లోకవ్యవహారం గ్రహిస్తూ శక్తిని అనుసరించి కృషి చేస్తూ, అర్హతను మించి ఆశించకుండా ఉండే వాడు లౌక్యం తెలిసిన వాడు. దు:ఖ సమయాల్లో సంయమనం కోల్పోకుండా, గడిచిన కాలం గురించి, పోయిన వాటి గురించి బాధపడకుండా, ధైర్యం కోల్పోకుండా మొదలు పెట్టిన కార్యాన్ని ఎన్ని అడ్డంకులు ఎదురైనా వదలని వాడు ధీరుడు. ఇటువంటి వారికి కార్యసాధనలో అపాయం లేని విధానాలు వారికి బోధ పడతాయి. రాత్రి పూట సుఖ నిద్ర కోరుకునే వాడు పగటి పూట అందుకోసం శ్రమించాల్సి ఉంటుంది. సత్యం, క్షమ, దానం, అసూయ లేకపోవడం, ఆరోగ్యం, అనుకూలవతి అయిన బార్య, చెప్పుచేతలలో ఉండే పుత్రుడు, ధనార్జనకు ఉపయుక్తమైన విద్య ఈ లోకంలో సుఖాన్ని అందించే దారులు. ఇవి కలిగి ఉన్న వారు చింతలేని జీవితాన్ని గడుపుతారు. ఇటువంటి వారికి నిద్రకు లోటు ఉండదు.
ఇలాంటివారికి నిద్ర కరువే: బలవంతులతో విరోధం బలహీనులకు మంచిది కాదు. ఇతరుల సంపదలు హరించే వాడికి, దొంగకు, అతిగా కామం కలిగిన వాడికి రాత్రుళ్లు నిద్రపట్టదు. అయోగ్యులకు బాధ్యతలు అప్పగించిన వారికి కూడా సుఖ నిద్ర ఉండదు. విద్యా వివేకం లేకుండానే గర్వంతో చరించేవాడు, దరిద్రుడై ఉండి విపరీతమైన భోగ లాలస కలిగి ఉండే వాడు అసూయతో రగిలి పోతుంటాడు. ఇటువంటి వారు తమకు తామే శత్రువులు. ఏ కృషి చెయ్యకుండానే ఫలితాలను ఆశించేవాడు, స్వంత పనులు వదిలి ఇతరుల పనులకు ప్రాముఖ్యతను ఇచ్చేవాడు, తమ కంటే బలవంతులతో వైరం పెంచుకునే వాడు, ప్రతీకార వాంఛతో రగిలిపోయే వాడు, రకరకాల అనుమానాలతో చెయ్యాల్సిన పనులను వాయిదా వేసేవాడు, మిత్రులు లేని వాడు, పితృకార్యాలు నిర్వహించని వాడు, ఇతరులలో ఎప్పుడూ లోపాలు వెతికేవాడు, అర్థం లేకుండా కోపం తెచ్చుకునేవాడు వీరంతా కూడా మూర్ఖులే. ఇటువంటి మూర్ఖత్వంతో చరించే వారికి రాత్రి పూట నిద్ర కరువవుతుంది.
Also Read: ఈ రాశివారు గతంలో చేసిన పొరపాటుకి ఇప్పుడు భయపడతారు, అక్టోబరు 8 రాశిఫలాలు
Also Read: ఈ తేదీల్లో పుట్టినవారికి శత్రువులు కూడా స్నేహహస్తం అందిస్తారు, అక్టోబరు 8 న్యూమరాలజీ