Avanamcode Saraswathi Temple


సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణీ 
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా 
పద్మపత్ర విశాలాక్షీ పద్మ కేసరవందినీ 
నిత్యం పద్మాలయా దేవీ సా మాం పాతు సరస్వతీ
భగవతీ భారతీ నిశ్శేషజాడ్యాపహా


పిల్లల్ని స్కూల్ కి పంపించే ముందు సరస్వతీ కటాక్షం సిద్ధించాలంటూ అక్షరాభ్యాసం చేయిస్తారు. అయితే కేరళలో ఉన్న ఆవనంకోడ్ సరస్వతీదేవి ఆలయంలో మాత్రం పెద్దవారికి కూడా అక్షరాభ్యాసం చేయిస్తారు. ఇక్కడ అక్షరాభ్యాసం చేయించుకునే వారికి చదువుతోపాటూ వాక్కునూ అందించే శక్తిస్వరూపిణిగా సరస్వతీదేవి పూజలు అందుకుంటోంది. ఈ ఆలయంలో అమ్మవారితోపాటూ జ్ఞానాన్ని ప్రసాదించే దక్షిణామూర్తినీ ఆటంకాలను తొలగించి విజయాలను అందించే వినాయకుడు కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నారు. వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆవనంకోడ్‌ సరస్వతీ దేవాలయం కేరళలోని కొచ్చి విమానాశ్రయానికి దగ్గరగా ఉంటుంది. ఇంకా ఈ ఆలయం విశిష్టతలేంటంటే...


Also Read: ఫిబ్రవరి 14 న మీ పిల్లలతో ఈ శ్లోకాలు చదివించండి!


పరశురాముడు ప్రతిష్టించిన విగ్రహం


ఒకప్పుడు ఈ ఊరివాళ్లు గడ్డికోసేందుకు వెళ్లినప్పుడు ఓ రాయికి కొడవలి తగిలి నెత్తురోడిందట. అది చూసిన పరశురాముడు అక్కడికి వచ్చి ఆ శిలలో సరస్వతీదేవి ఉందని గ్రహించి ఆ శిలనే ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించాడని కథనం. అలా పరశురాముడు నిర్మించిన 108 దుర్గాలయాల్లో ఆవనంకోడ్‌ సరస్వతీదేవి సన్నిధానం కూడా ఒకటని చెబుతారు


శంకరాచార్యుల అక్షరాభ్యాసం జరిగిన ప్రదేశం


అద్వైత వేదాంత సృష్టికర్త అయిన జగద్గురువు ఆదిశంకరాచార్యులకు చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో అక్షరాభ్యాసం జరగలేదట. కొన్నాళ్లకు శంకరాచార్యుల తల్లి ఈ ఆలయానికి తీసుకొచ్చి అమ్మవారి సమక్షంలోనే అక్షరాభ్యాసం చేయించారని చెబుతారు.


Also Read: పిబ్రవరి 14 వసంతపంచమి - ఈ రోజు విశిష్టత ఇదే!


ఇక్కడ అక్షరాభ్యాసం 2 రకాలు
1 . విద్యారంభం - చదువు ప్రారంభించనున్న పిల్లలకు జరిపించే అక్షరాభ్యాసం
2. విద్యావాగీశ్వరి - ఉన్నత విద్యను అభ్యసించాలి అనుకునేవారు చేయించుకునే అక్షరాభ్యాసం


ఈ ఆలయంలో ఏడాది మొత్తం అక్షరాభ్యాసాలు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ జరిగే ప్రక్రియ కూడా కొంత భిన్నంగా ఉంటుంది..
ఆలయంలోని ప్రధానార్చకుడు అమ్మవారిని పూజించిన బియ్యాన్ని తీసుకొచ్చి అందులో ‘ఓం హరి శ్రీ గణపతయే నమః’ అని పిల్లల చేత రాయిస్తారు. తర్వాత అదే నామాన్ని వాళ్ల నాలుకపైనా రాస్తారు. ఆ ప్రక్రియ పూర్తయ్యాక బియ్యాన్ని పిల్లలకే ఇచ్చేసి అమ్మవారిని అభిషేకించిన నెయ్యిని ప్రసాదంగా ఇస్తారు. అక్షరాభ్యాసం చేయించాలనుకునేవారు నావ్‌, మణి, నరయంగా పిలిచే నాలుక, గంట, కలం, ఆకారాలను అమ్మవారికి కానుకగా సమర్పిస్తారు. ఇక్కడ అక్షరాభ్యాసం చేసుకునేవారు కెరీర్లో ఉన్నత స్థానంలో ఉంటారని భక్తుల విశ్వాసం. ఈ ఆలయ ప్రాంగణంలో ఇసుకపైన కూడా అక్షరాలు రాస్తుంటారు భక్తులు...


Also Read:  ఎవరీ రతీ మన్మధులు - వీరి ప్రేమకథ ఎందుకంత ప్రత్యేకం!


పాస్ పోర్ట్ అమ్మవారు


తెలంగాణ రాష్ట్రం చిలుకూరు బాలాజీలా... ఆవనంకోడ్‌ సరస్వతీ దేవి ఆలయంలోనూ ఉన్న ప్రత్యేకత ఏంటంటే.. విదేశాలకు వెళ్లాలి అనుకునేవారంతా ఇక్కడ ముందుగా పాస్ పోర్టులు పెట్టి పూజిస్తారు. విమానంలో ఎగిరిపోయే ముందు పాస్ పోర్టులు అమ్మవారి దగ్గర ఉంచి పూజిస్తే వెళ్లిన పని వందశాతం సక్సెస్ అవుతుందని విశ్వసిస్తారు. అందుకే ఈ సన్నిధానానికి పాస్‌పోర్ట్‌ ఆలయమనే పేరూ ఉంది. కళాకారులూ, రచయితలూ సైతం తమ పుస్తకాలనూ, సంగీత వాయిద్యాలనూ అమ్మవారి సమక్షంలో ఉంచి పూజలు చేయిస్తారు. 


Also Read: రాక్షసిని దేవతగా మార్చిన అద్భుతమైన ప్రేమకథ!


పశ్చిమ ముఖంగా అమ్మవారు


స్వయంభువుగా వెలసిన సరస్వతీ దేవి ఈ ఆలయంలో పశ్చిమ ముఖంగా దర్శనమిస్తుంది. నిత్యం అక్షరాభ్యాసాలతో కళకళలాడే ఈ ఆలయంలో దసరా, వసంత పంచమి సహా ఏడాదికోసారి మార్చిలో వచ్చే పూరమ్ పేరుతో పది రోజుల పాటూ వైభవంగా ఉత్సవాలు జరిపిస్తారు.