సతీ సావిత్రి గురించి మొత్తం తెలియకపోయినా యముడి నుంచి భర్త ప్రాణాలు వెనక్కు తీసుకొచ్చిందని మాత్రం చెప్పుకుంటారు. ఇంతకీ ఆమె ప్రేమకథ ఏంటి..ఎక్కడ మొదలైంది..ప్రేమని దక్కించుకునేందుకు ఏం చేసిందంటే..


సతీ సావిత్రి జననం-వివాహం
అశ్వపతి, మాళవిల కుమార్తె సావిత్రి. అశ్వపతి ''మద్ర'' దేశానికి రాజు. అన్నీ ఉన్నా సంతానం లేదనే బాధలో ఎన్నో పూజలు చేస్తారు. ఒక రుషి సూచన మేరకు 18 సంవత్సరాలు ఉపాసనం చేయగా కలిగిన సంతానమే సావిత్రి. ఆమెకు యుక్త వయసు రాగానే కోరుకున్నవాడికిచ్చి పెళ్లిచేయాలనుకుంటారు. అప్పటికే సత్యవంతుడి గురించి విన్న సావిత్రి తననే పెళ్లిచేసుకుంటానని చెబుతుంది. నిత్యం సత్యం మాట్లాడటం వల్లే సత్యవంతుడికి ఆ పేరు వచ్చింది. అయితే సత్యవంతుడు ఏడాది కన్నాఎక్కువ కాలం బతకడని అశ్వపతికి  తెలియడంతో పెళ్లికి నిరాకరిస్తాడు. అయితే సావిత్రి మాత్రం తాను అతన్ని తప్ప మరొకరిని పెళ్లి చేసుకోనని చెబుతుంది. దీంతో చేసేది లేక వివాహం జరిపిస్తాడు. 


Also Read: ఈ మంత్రం జపిస్తే లవ్ సక్సెస్ అవుతుందట
సత్యవంతుడి ప్రాణాలు తీసుకెళ్లిన యముడు
సావిత్రి మామ రాజ్యాన్ని కోల్పోతాడు. అంధుడవుతాడు.  భర్త, అత్తమామలనే దైవంగా భావించి వారికి సేవలు చేస్తూ బతికింది సావిత్రి. ఇంతలోనే సత్యవంతుడికి మరణం దగ్గర పడుతుంది. ఆ విషయం ముందే గ్రహించిన సావిత్రి వారం ముందునుంచే ఉపవాస దీక్ష ప్రారంభిస్తుంది. ఒక సంవత్సరం పాటు వారు సంతోషంగా జీవించారు. ఓ రోజు ఉదయాన్నే సత్యవాన్ అడవిలో కలప తీసుకొచ్చేందుకు బయలుదేరుతాడు. తాను కూడా వెంట వస్తానని సావిత్రి అడగడంతో సరే అంటాడు. ఎత్తైన చెట్టు కింద మెత్తటి ఆకులతో ఆసనాన్ని ఏర్పాటు చేస్తాడు. ఓ వైపు చెక్కలు నరకుతూనే మరోవైపు ఆమెకోసం పూలు కోస్తాడు. మధ్యాహ్నానికి అలసిపోయిన సత్యవంతుడు కాసేపటి తర్వాత వచ్చి సావిత్రి ఒడిలో తలపెట్టి పడుకున్నాడు. అంతలో తన ఎదురుగా నిల్చున్న వ్యక్తిని చూసి ఎవరు నువ్వు అని ప్రశ్నిస్తుంది. నేను ఎవ్వరికీ కనపడను కదా అని ఆలోచించిన యముడు..సావిత్రి మహా ప్రతివ్రత కావడంతో కనిపించానని గ్రహిస్తాడు. ఎందుకు వచ్చానో చెప్పిన యముడు..సత్యవంతుడి ప్రాణాలు తీసుకెళ్లిపోతాడు. 


Also Read: తొలిచూపులోనే భీముడితో ప్రేమలో పడిన హిడింబి
భర్త ప్రాణాలు దక్కించుకున్న సావిత్రి
భర్త ప్రాణాలు తీసుకెళుతున్న యముడివెంటే నడక సాగించిన సావిత్రిని చూసి ఎందుకు నా వెనుక వస్తున్నావంటాడు. నా భర్త వెంట నడవడమే నా ధర్మం అని చెబుతుంది సావిత్రి. ఆమె పతిభక్తికి మెచ్చిన యముడు ఏం వరం కావాలో కోరుతో పతి ప్రాణాలు తప్ప అంటాడు. గుడ్డివారైనా తన అత్తమామలకు కళ్లు రావాలి అని కోరుకుంటుంది.  మళ్లీ అనుసరించడంతో మరో వరం కోరుకో ఇస్తా అంటే..తన మామగారి రాజ్యం తిరిగి దక్కించుకునేలా చేయమని అడుగుతుంది..తథాస్తు అంటాడు యముడు. ఇంకా అనుసరిస్తున్న సావిత్రితో మరో వరం ఇస్తా కోరుకో అన్న యముడితో నాకు అద్భుతమైన తనయుడు కావాలని కోరుతుంది. సరే అని బదులిచ్చిన యముడితో భర్త సత్యవంతుడు లేకుండా తనయుడు ఎలా సాధ్యం అని ప్రశ్నిస్తుంది. తప్పని పరిస్థితుల్లో ఇచ్చిన వరం మేరకు యముడు సావిత్రి పతి ప్రేమ ముందు తలొంచక తప్పలేదు. 


ప్రేమ ఎంత గొప్పగా ఉండాలో చెప్పేందుకు ఇంతకన్నా నిదర్శనం ఏముంది. ఓ వ్యక్తిని ప్రేమించింది.. ఏడాది కన్నా ఎక్కువ బతకడని తెలిసి పెళ్లిచేసుకుంది. కేవలం తన ప్రేమ,పతి భక్తి ముందు యముడిని కూడా ఓడించింది. అందుకే చరిత్రలో ఐదుగురు పతివ్రతల్లో సావిత్రి పేరు నిలిచిపోయింది.