ఆపిల్‌ను తినితిని బోరుకోడుతోందా, అయితే ఓ రోజు ఇలా స్వీట్ రూపంలోకి మార్చుకోండి. ఆపిల్ తిన్నట్టు  ఉంటుందీ, నాలికకు కొత్త రుచి తగిలినట్టు అవుతుంది. క్యారెట్ హల్వా చేసుకున్నట్టే ఆపిల్‌తో కూడా హల్వా చేసుకోవచ్చు. రుచి కూడా అదిరిపోతుంది. రోజుకో ఆపిల్ తింటే వైద్యుడికి దూరంగా ఉండొచ్చని చెబుతారు. అంత ఆరోగ్యకరమైనది ఈ పండు. దీనిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది ఒక యాంటీఆక్సిడెంట్ లా పనిచేస్తుంది. రోజూ ఆపిల్ తింటే బి కాంప్లెక్స్ లోపం ఏర్పడదు. ఎర్రరక్త కణాల ఉత్పత్తిని పెంచడం, నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడానికి దోహదం చేస్తుంది. 


బరువు తగ్గేందుకు..
బరువు తగ్గాలనుకునే వారు ఆహార తినడానికి ముందు ఒక ఆపిల్ తినాలి. పొట్ట నిండినట్టుగా అయిపోయి ఆహారం చాలా తక్కువగా తింటారు. ఆపిల్‌లో కెలోరీలు తక్కువ, ఫైబర్ అధికంగా ఉండడం వల్ల బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. భోజనం చేసేముందు ఆపిల్ తినడం వల్ల 200 కెలోరీల ఆహారం తక్కువ తినే అవకాశం ఉంది. ఆహారం తినడానికి అరగంట ముందు ఆపిల్ తినాలి. 


గుండె ఆరోగ్యానికి కూడా ఆపిల్ మేలు చేస్తుంది. ఆపిల్ తినని మహిళలతో పోలిస్తే రోజూ తినే వారిలో గుండె వ్యాధులు వచ్చే అవకాశం 43 శాతం తగ్గినట్టు అధ్యయనాల్లో తేలింది. అదే పురుషుల్లో అయితే 19 శాతం తగ్గింది. అందుకే రోజు ఆపిల్ తినడం అలవాటు చేసుకోవాలి. 


ఆపిల్ హల్వా...
కావాల్సిన పదార్థాలు
ఆపిల్స్ - నాలుగు
చక్కెర - పావు కప్పు
నెయ్యి - నాలుగు స్పూనుల
జీడిపప్పు, బాదం, పిస్తా, కిస్మిస్‌లు - గుప్పెడు
యాలకుల పొడి - చిటికెడు
వెనీలా ఎక్స్ ట్రాక్ట్ - ఒక స్పూను
కుంకుమ పువ్వు - నాలుగు రేకలు
(ఇది రంగు కోసం. కావాలంటే వేసుకోవచ్చు, ఇష్టం లేకుంటే మానేయచ్చు)


తయారీ ఇలా
1. ఆపిల్‌ తొక్కను తీసేసి మిగతా భాగాన్ని బాగా తురుముకోవాలి. 
2. ఇప్పుడు కళాయిలో నెయ్యి వేసి జీడిపలుకులు, బాదం పలుకులు, పిస్తా, కిస్మిస్‌లు వేసి వేయించుకోవాలి. వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. 
3. కళాయిలో మిగిలిన నెయ్యిలో ఆపిల్ తురుమును వేసి వేయించలి. చిన్న మంట పెట్టుకోవాలి. లేకుంటే త్వరగా మాడిపోయే అవకాశం ఉంది. 
4. ఆపిల్ తురుములోని నీరుపోయి దగ్గరగా అయ్యాక చక్కెర, కుంకుమ పువ్వు వేసి కలపాలి. 
5. పంచదారంతా కరిగి తిరగి పాకంలా అయి హల్వా అంతా దగ్గరగా చేరుతుంది. అప్పుడు వెనీలా ఎక్స ట్రాక్ట్, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. 
6. పైన ముందుగా వేయించి డ్రైఫ్రూట్స్ ను చల్లుకోవాలి. దీన్ని గోరువెచ్చగా తింటే భలే రుచిగా ఉంటుంది. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. 


Also read: నలభై ఏళ్లు దాటిన వారు రోజుకో గుడ్డు తినాల్సిందే అంటున్న అధ్యయనాలు


Also read: ప్రేమించమని చెప్పడమే వాలెంటైన్‌కు శాపమైంది, ఉరికొయ్యకు వేలాడాల్సి వచ్చింది