బాలీవుడ్ నటి శిల్పాశెట్టిని వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే తన భర్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో ఇరుక్కోగా.. అందులో శిల్పా ప్రమేయం కూడా ఉందంటూ ఆరోపణలు వినిపించాయి. ఆ సమయంలో శిల్పా కఠిన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది. తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది ఈ బ్యూటీ. శిల్పాశెట్టి, ఆమె తల్లి సునంద, సోదరి షమితా శెట్టిలకు కోర్టు నోటీసులు ఇచ్చింది. 


తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేదని ఆరోపిస్తూ ఓ ఆటోమొబైల్ ఏజెన్సీ యజమాని ముంబైలోని అంధేరీ కోర్టును ఆశ్రయించాడు. అతడి ఫిర్యాదు స్వీకరించిన కోర్టు ఈ నెల 28న కోర్టులో హాజరు కావాలంటూ శిల్పాశెట్టితో పాటు ఆమె సోదరి షమితాశెట్టి, తల్లి సునంద శెట్టిని ఆదేశించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. శిల్పాశెట్టి తండ్రి సురేంద్ర శెట్టి ఓ ఆటోమొబైల్ ఏజెన్సీ యజమాని దగ్గర నుంచి 2015లో అప్పు తీసుకున్నారు. 


దాదాపు రూ.21 లక్షలను రుణంగా తీసుకోగా.. తిరిగి 2017 జనవరి నాటికి చెల్లిస్తానని ఒప్పందం చేసుకున్నారు. అనూహ్యంగా సురేంద్ర శెట్టి 2016 అక్టోబర్ నెలలో మృతి చెందారు. అయితే తన దగ్గర సురేంద్ర అప్పు తీసుకున్నారనే విషయం శిల్పాశెట్టితో పాటు ఆమె తల్లికి కూడా తెలుసని.. అయినప్పటికీ డబ్బు తిరిగి ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని ముంబైకి చెందిన వ్యాపారవేత్త ఫర్హద్ అమ్రా ఆరోపించారు. 


ఈ మేరకు గత శుక్రవారం నాడు జుహు పోలీస్ స్టేషన్ లో శిల్పా కుటుంబంపై ఫిర్యాదు చేయగా.. శిల్పాశెట్టితో పాటు ఆమె సోదరి షమితా శెట్టి, తల్లిపై కేసు నమోదు చేశారు. దీంతో ఈ నెల 28న కోర్టుకి హాజరు కావాలని సమన్లు జారీ అయ్యాయి. ఇదిలా ఉండగా.. శిల్పాశెట్టి తన కూతురు బర్త్ డే సెలెబ్రేషన్స్ కోసం ఫ్యామిలీతో పాటు ఆలీబాగ్ వెళ్లింది. మరి ఈ కేసుపై ఆమె ఎలా స్పందిస్తుందో చూడాలి!