Vaishakh Purnima 2023: చంద్రుడు విశాఖ నక్షత్రానికి దగ్గరగా సంచరించే మాసాన్ని వైశాఖ మాసం అంటారు. ఉత్తరాయణంలో వచ్చే ఈ మాసాన్ని అత్యంత పవిత్రమైనదిగా పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ రోజు సముద్ర స్నానం ఆచరిస్తే చాలా మంచి జరుగుతుందని పండితులు చెబుతారు. వైశాఖ పూర్ణిమ రోజు ఎన్నో ప్రత్యేకతలున్నాయి..ఈ రోజు జ్ఞాన పౌర్ణమి, బుద్ధ పౌర్ణమి, శ్రీకూర్మ జయంతి, అన్నమాచార్యుల జయంతి...ఇలా ఎన్నో విశేషాలున్నాయి
శ్రీ మహావిష్ణువు కూర్మావతారం ఎత్తింది ఈ రోజే
శ్రీమహావిష్ణువు దశావతారాలలో మొదటి అవతారం మత్స్యావతారము కాగా రెండో అవతారం కూర్మం. కృతయుగంలో దేవతలు, రాక్షసులు అమృతం కోసం మందరపర్వతాన్ని కవ్వంగా ఉపయోగిస్తూ పాలసముద్రాన్ని మధించడం ప్రారంభించారు. అప్పుడు ఆ పర్వతం సముద్రంలోకి మునిగిపోకుండా ఉండేందుకు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కూర్మావతారం ఎత్తి ఆ మందరపర్వతం కిందికిచేరి పర్వతం బరువును తనపై ఎత్తుకున్నాడు. కూర్మవతారాన్ని కొలిచే ఆలయాలు దేశంలోనే కాదు ప్రపంచంలోనూ చాలా తక్కువ. ప్రపంచంలోనే ఏకైక కూర్మదేవాలయం అంటే శ్రీకూర్మం అనే చెప్పాలి. అరుదైన శిల్పకళతో రూపుదిద్దిన ఈ ఆలయం శివకేశవ అబేధాన్ని సూచించే క్షేత్రంగా విరాజిల్లుతోంది.శ్రీకాకుళం జిల్లాలోని గార మండలంలో శ్రీకాకుళం నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో వంశధారా నది ఒడ్డున ఈ ఆలయం ఉంది.
Also Read: మే 5 బుద్ధ పౌర్ణమి, బోధివృక్షం పూజ - వటసావిత్రి వ్రతం రెండూ ఒక్కటేనా!
అన్నమాచార్యుల జయంతి
పదకవితా పితామహుడు అన్నమాచార్యుల జయంతి కూడా వైశాఖ పూర్ణమి రోజే. శ్రీ మహా విష్ణువు ఖడ్గమైన నందక అవతారమని భక్తుల విశ్వాసం.
ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలో రాజంపేట మండలానికి సమీపంలో ఉన్న తాళ్లపాకలో సర్వధారి సంవత్సరం వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు జన్మించారు . తల్లిదండ్రులు స్మార్త సంప్రదాయానికి చెందిన నందవారిక బ్రాహ్మణ వర్గానికి చెందినప్పటికీ...వైష్ణవ దీక్షను స్వీకరించి రామానుజాచార్య సంప్రదాయంలో వైష్ణవుడు అయ్యాడు. శ్రీవేంకటేశ్వరునిపై సంకీర్తనలను రచించి గానం చేసిన అన్నమాచార్యుల జయంతి సందర్భంగా తిరుమల సహా, ఆయన పుట్టిన తాళ్లపాకలో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
బుద్ధ పౌర్ణమి
వైశాఖ పౌర్ణమి రోజు సిద్దార్థుడు జన్మించడం, అదే వైశాఖ పౌర్ణమి రోజు ఆయనకు జ్ఞానం కలిగి బుద్ధుడిగా మారడం, అదే రోజు నిర్యాణం చెందడం వల్ల ఇది బుద్ధ పౌర్ణమి అయిందని చెబుతారు. ఆధ్యాత్మిక సాధకులకు, జ్ఞాన ప్రాప్తి పొందేవారికి, సాధువులకు ఇది అత్యంత పవిత్రమైన పౌర్ణమి అని చెబుతారు.
Also Read: బుధుడు-శుక్రుడు కలయికతో అరుదైన యోగం, ఈ రాశులవారికి ప్రత్యేక ప్రయోజనం
వైశాఖ పౌర్ణమి రోజు మొదటి చంద్రగ్రహణం
శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో మొత్తం 4 గ్రహణాలు సంభవిస్తున్నాయి. అందులో 2 సూర్య గ్రహణాలు, 2 చంద్ర గ్రహణాలున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే తొలి సూర్యగ్రహణం ఏర్పడగా.. మొదటి చంద్రగ్రహణం మే 5 న ఏర్పడబోతోంది. ఆరోజు వైశాఖ పౌర్ణమి. చంద్రుడు, సూర్యుడి మధ్య భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది.2023 సంవత్సరంలో మొదటి చంద్ర గ్రహణం 2023 మే 5 శుక్రవారం రాత్రి దాదాపు 8:45 గంటలకు ప్రారంభమవుతుంది. అర్థరాత్రి 1:00 గంటకు ముగుస్తుంది. గ్రహణం ప్రారంభం కావడానికి 9 గంటల ముందు సూతకం ప్రారంభమై గ్రహణం ముగియడంతో ముగుస్తుంది. ఈ సమయంలో ఆలయాల తలుపులు మూసేస్తారు. గర్భిణులు బయటకు రాకూడదని, నేరుగా ఎవ్వరూ గ్రహణం వీక్షించకూడదని, గ్రహణ సమయంలో ఏమీ తినకూడదని చెబుతారు. ఈ ఏడాది ఏర్పడే తొలి చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు. అందుకే సూతక కాలం పాటించాల్సిన అవసరం లేదు. యూరప్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, అంటార్కిటికా, మధ్య ఆసియా, పసిఫిక్ అట్లాంటిక్ , హిందూ మహాసముద్రంలో ఇది కనపడుతుంది.