పాండవులంటే మహాభారత కథ నాయకులు, మంచి వారు అని, కౌరవులు అంటే ప్రతినాయకులు, చెడ్డ వారని అనే అభిప్రాయం ఉంటుంది. అయితే కౌరవుల్లో సరైన ఆలోచనా విధానంతో ధర్మబద్ధమైన జీవితం గడిపిన వారున్నారు. వారిలో యుయుత్సుడు, వికర్ణుడు లాంటి వారున్నారు. అయితే యుయుత్సుడు పాండవుల వైపు నిలబడి కురుక్షేత్ర యద్ధంలో పాల్గొన్నాడు. ధర్మబద్ధుడైనప్పటికీ వికర్ణుడు అన్నను వీడిపోలేక కౌరవుల తరపునే యుద్ధంలో పాల్గొన్నాడు. వికర్ణుడు వందమంది కురుపుత్రుల్లో మూడవ వాడు. వంద మంది సోదరుల్లో నలుగురు మాత్రమే అందరికీ తెలిసిన వారు. వారు సుయోధనుడు, దుశ్శాసనుడు, వికర్ణుడు, చిత్రసేనుడు.
వికర్ణుడు అనే పేరు విన – కర్ణ అనే రెండు పదాలతో ఉంటుంది. కర్ణ అంటే చెవులు అనే అర్థం. విన అంటే మాత్రం రెండు అర్థాలు ఉన్నాయి. విన అంటే విశాలమైన అని అనుకోవచ్చు, లేదా లేకుండా అని కూడా అనుకోవచ్చు. దీన్ని బట్టి వికర్ణ అంటే రెండు అర్థాలున్నాయి. విశాలమైన చెవులు కలవాడని, అంటే ఎక్కువగా విని జ్ఞానాన్ని పొందేవాడని, మరో అర్థం చెవులు లేని వాడని అంటే ఎవరు చెప్పింది వినకుండా తనదైన స్థిరమైన అభిప్రాయం కలిగిన వాడని. వికర్ణుడిని సార్థక నామధేయుడుగా చెప్పుకోవచ్చు. ఈ రెండు అర్థాలు కూడా అతడి వ్యక్తిత్వానికి సందర్భానుసారం సరిగ్గా సరిపోతాయి. చిన్నతనం నుంచి కూడా ఎలాంటి తరతమ బేధాలు లేని వాడు. పాండవులతో కూడా సఖ్యత కలిగి ఉండేవాడు. సోదరులు చేస్తున్న కుట్రల్లో పాలు పంచుకోలేదు.
ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తించే వారిని ఎప్పుడూ ఉపేక్షించలేదు. వ్యతిరేకించడానికి వెనుకాడలేదు. వికర్ణుడు మంచి విలుకాడు. అర్జునుడి లాగే గొప్ప వీరుడు. వికర్ణుడి భార్య సుదేశ్నవతి. కాశీ దేశపు యువరాణి. వికర్ణుడి కూతురు పేరు దుర్గ. కర్ణుడి కుమారుల్లో ఒకడైన సత్యసేనుడి భార్య దుర్గ పాండవ ద్వేషి. హస్తినా పురంలో మాయా జూదం ప్రారంభానికి ముందే కురువృద్ధులతో కలిసి జూదం తగదని వికర్ణుడు వారించాడు. ప్రతి సందర్భంలోనూ అంతా ధర్మబద్ధంగా సాగాలని కోరుకున్న వారిలో వికర్ణుడు కూడా ఒకడు. ద్రౌపది కి అవమానం జరుగుతున్న సందర్భంలో కూడా అలా జరగకూడదని సోదరులను వ్యతిరేకించిన ఒకేఒక కౌరవుడు వికర్ణుడు మాత్రమే.
ద్రౌపది సంధించిన ప్రశ్నలకు సమాధానం కావాలని సభను కోరి ద్రౌపది పక్షాన నిలబడింది కేవలం వికర్ణుడు ఒక్కడే. ద్రౌపది ప్రశ్నలకు సమాధానం చెప్పక పోతే తమ వంశ నాశనం తప్పదని అప్పుడే వికర్ణుడు హెచ్చరిస్తాడు. తన మాట చెల్లకపోయినా సరే ఎప్పుడూ సోదర ధర్మాన్ని కూడా విస్మరించలేదు వికర్ణుడు. యుద్ధ సమయంలో కౌరవుల పక్షానే యుద్ధం చేశాడు. తనను వ్యతిరేకిస్తున్నా కూడా సుయోధనుడు కూడా ఎప్పుడూ వికర్ణుని విస్మరించలేదు. ఎందుకంటే తమ్ముడి వీరత్వం మీద అతడికి ఉన్న నమ్మకమని చెప్పవచ్చు.
ఎన్నో దివ్యాస్త్రాల ప్రయోగం తెలిసిన వీరుడు వికర్ణుడు. పాండవులతో వీరోచిత పోరాటం చేసిన యోధులలో వికర్ణుడు కూడా ఒకడు. యుద్ధం పద్నాలుగో రోజున జయదృదుడిని చంపేందుకు అర్జునుడికి మార్గం సుగమం చేస్తున్న భీముడిని అడ్డుకునేందుకు వికర్ణుడు ప్రయత్నిస్తాడు. ఇక్కడ భీముడి చేతిలో వీరమరణం పొందాడు. వికర్ణుడి అంత్యక్రియలు కూడా భీముడే నిర్వహించాడని కొన్ని భారత కథలు చెబుతాయి. దర్మాధర్మాలు తెలిసిన వికర్ణుడు సోదరధర్మాన్ని వీడక పోవడం అనేది వికర్ణుడి విలక్షణ వ్యక్తిత్వంగా చెప్పుకోవచ్చు.