Diwali 2022: దీపావళి వచ్చిందంటే తెలుగు లోగిళ్లు దీపాలతో వెలిగిపోతాయి. ఇంటికి లక్ష్మిదేవిని స్వాగతించడానికి ఇళ్లను అలంకరిస్తారు. దీపావళి ముందు వచ్చే ధనత్రయోదశితో దీపావళి వేడుకలు ప్రారంభమవుతాయి. దీపావళికి ఇంటి కోసం ఎన్నో కొత్త వస్తువులు కొంటుంటారు. బంగారం వెండే కాదు, ఇంట్లోని గిన్నెలు, ఎలక్ట్రానిక్ వస్తువులు కొనేవాళ్లు కూడా ఎక్కువే. అయితే ఆ రోజున కొనకూడని వస్తువులు కూడా ఉన్నాయి. తెలియక చాలా మంది వాటిని కొనేస్తుంటారు. ఇలా కొనడం దురదృష్టమని నమ్ముతారు. కొందరికి ఇవి మూఢనమ్మకాలుగా కనిపిస్తాయి కానీ ఈ నమ్మకాలు తరతరాలుగా జాతిలో ఇమిడిపోయాయి. నమ్మేవాళ్లు నమ్ముతారు, ఆచరిస్తారు. ఈ రోజున ఏమీ కొనకూడదో తెలుసుకోండి. మరొక విషయం ఇవి నమ్మకాలపై ఆధారపడిన విషయం. నమ్మేవాళ్లు నమ్మవచ్చు, నమ్మని వాళ్లు కేవలం దీన్ని ఓ కథనంగా చదవండి.
కళాయి
చాలా మందికి దీపావళికి కొత్త కళాయిలు, గిన్నెలు కొనే అలవాటు ఉంది. కానీ పూర్వపు నమ్మకాల ప్రకారం కళాయి కొనకూడదు. ఎందుకంటే కొన్నప్పుడు కళాయి ఖాళీగా ఉంటుంది. ఇలా ఖాళీగా ఉన్న గిన్నెలు కొనడం వల్ల ఇల్లు కూడా ఖాళీ అవుతుందని, ఇంట్లో సంపద ఉండదని నమ్మకం. ఒకవేళ తెలియక కొన్నట్లయితే ఆ కొత్త గిన్నెను నీటితో లేదా ఏదైనా ఆహారంతో నింపి ఇంటికి తీసుకెళ్లండి. ఖాళీ గిన్నె మాత్రం తీసుకెళ్లద్దు.
కత్తులు
కిచెన్లో కత్తిపీటలు మాయమై చాకులే వాడుతున్నారు. కత్తిని మనం ఎందుకు ఉపయోగిస్తాం, ఏదైనా వస్తువును ముక్కలు చేసేందుకు. అంతే దాని ఆకారాన్ని నాశనం చేస్తున్నామన్నమాట. అందుకే చాకులను కొని ఇంటికి తీసుకెళ్లకూడదు. ఇవి దురదృష్టాన్ని తెస్తాయని పెద్దలు నమ్ముతారు.
ఇనుము
ఇనుముతో చేసి వస్తువులను ఇళ్లల్లో అధికంగానే వాడతాము. ఇనుముతో చేసిన వస్తువులు రాగి, ఇత్తడి కన్నా చాలా తక్కువ రేటుకే వస్తాయి. అందుకే వీటినే కొనేందుకు ఇష్టపడతారు. అయితే దీపావళి, ధన్ తేరాస్ పండుగల్లో ఇనుముతో చేసిన వస్తువులు కొనకూడదు.
గాజు వస్తువులు
జ్యోతిషశాస్త్రపరంగా గాజు వస్తువులు రాహు గ్రహంతో సంబంధం కలిగి ఉంటాయి. అందుకే వీటిని ఈ పండుగ సందర్భంగా కొనకూడదు. గాజు పగలితే పదునైనా వస్తువుగా మారుతుంది. ఇవి సులభంగా కూడా పగిలిపోతాయి. కాబట్టి వీటిని పండుగ సందర్భంగా ఇంటికి తీసుకెళ్లకూడదు.
నూనె, వెన్న
నూనెలు, నెయ్యి, వెన్న వంటివి ప్రత్యేకంగా ఈ పండుగ కోసం కొనడం నివారించాలి. ఎందుకంటే ఆ ఉత్పత్తులు పవిత్రమైన ఉత్పత్తుల జాబితాలోకి రావు. అందుకే ఆ రోజు కొనకూడదు అంటారు. మీకు నూనెలు అవసరం ఉంటే దీపావళి, ధన్‌తేరాస్ పండుగలకు ముందే కొనేసి ఇంట్లో పెట్టుకోవాలి. లేదా ఆ పండుగల తరువాత కొనాలి. ఆ రెండు రోజులు మాత్రం కొనకూడదు.
Also read: మగవారికీ రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందా? ఈ లక్షణాలు కనిపిస్తే ఏమిటర్థం?