Papikondalu : గోదావరి నది మధ్యలో ఉన్న పాపికొండల అందాలు చూడాలని అనుకుంటారంతా. గోదారిలో బోట్ లో ప్రయాణిస్తూ పాపికొండల అందాలు చూసి మైమరిచిపోతుంటారు. అయితే ఒకప్పుడు పాపికొండలు విహారానికి వెళ్లే పర్యాటకులకు వింత సంఘటన తరచూ ఎదురయ్యేదట. సరిగ్గా పాపికొండలు మధ్యకు వెళ్లేసరికి ఒక్కసారిగా పడవలు ఆగిపోయి, నదిలోపల నుంచి సింహగర్జన వినిపించేది.
ఎందుకిలా జరిగేది?
అక్కడ ఏముంది?
ఇప్పటికీ అలాంటి శబ్దాలు ఏమైనా వస్తున్నాయా?
ఈ ప్రశ్నలకు సమాధానం భద్రాచలంలో ఉంది...
భద్రాచలం పేరు చెప్పగానే మనకు వెంటనే గుర్తు వచ్చేది భక్త రామదాసూ ఆయన కట్టించిన రాముని ఆలయం. అది అంత ఫేమస్ మరి. కానీ అదే భద్రాచలంలో మరో అరుదైన ఆలయం ఉంది. యోగ ముద్ర లో ఉండే అరుదైన నరసింహుని ఆలయం అది. "బొబ్బల నరసింహుడి"గా పేరు పొందిన ఈ ఆలయం చాలా ప్రత్యేకమైనది అంటారు పండితులు.
గోదావరిలో దొరికిన నరసింహ స్వామి
రాజమహేంద్రవరం నుంచి భద్రాచలం వరకు లాంచీల్లో/పడవుల్లో వెళ్లడం అనేది ఎప్పటినుంచో ఆనవాయితీ గా ఉంది. మధ్యలో తగిలే పాపి కొండల నడుమ గోదావరి అందాలు చూస్తూ పడవుల్లో ప్రయాణించడం అనేది ఒక మరపురాని అనుభవం. అయితే ఒకప్పుడు పాపికొండల నడుమకు వచ్చేసరికి పడవలన్నీ ఆగిపోయవని ప్రవచన కారులు చెబుతుంటారు. నదిలో నుంచి సింహ గర్జన లాంటి శబ్దం వినపడేదని నదికి కర్పూర హారతి ఇచ్చిన తర్వాత మాత్రమే అక్కడ నుంచి పడవలు బయలుదేరి వెళ్లేవని పండితులు అంటారు. కొన్నాళ్ల తర్వాత అసలు శబ్దం ఏంటో చూద్దామని గజ ఈతగాళ్లు నదిలో వెతగ్గా యోగ ముద్ర లో ఉన్న నరసింహ స్వామి విగ్రహం దొరికింది అని దీనిని యోగానంద నరసింహస్వామి గా భద్రాచలంలో ప్రతిష్టించారని అంటారు. ఇక నుంచి గోదావరి లో సింహనాదాలు ఆగిపోయాయని అయితే అంతవరకూ పెద్ద పెద్ద గర్జనలు (బొబ్బలు) వినిపించే నరసింహస్వామి కాబట్టి ఆ మూర్తిని బొబ్బల నరసింహుడుగా పిలవడం ప్రారంభమైందని స్థానిక కథనం. భద్రాచలం శ్రీ రాముడి గుడి కి పక్కనే ఉన్న శిఖరం పై ఈ బొబ్బల నరసింహస్వామి ఆలయం ఉంది.
లక్ష్మి దేవి పక్కన లేని నరసింహుడు
ప్రధానంగా ఏ నారసింహస్వామి ఆలయం తీసుకున్నా పక్కనే ఏదో ఒక రూపంలో లక్ష్మీదేవి ఉంటుంది. కానీ బొబ్బల నరసింహ స్వామి వద్ద అలాంటి విగ్రహం ఏదీ ఉండదు. ఆయన పూర్తిగా యోగ ముద్ర లో ఉండడంతో లక్ష్మీదేవిని ఒక దండ రూపంలో ఆయన మెడలో వేస్తారు. పూర్తిగా లక్ష్మీదేవి రూపం ముద్రంచి ఉన్న మాడలతో కూడిన దండను స్వామి మెడలో ఉంచి పూజలు జరుపుతారు. ఇటీవల కాలంలో ప్రవచనకారుల ప్రసంగాల కారణం గా భద్రాచలం లోని "బొబ్బల నరసింహస్వామి "ఆలయం పాపులర్ అవుతోంది. ఈసారి భద్రాచలం వెళ్ళినప్పుడు ఈ బొబ్బల నరసింహడిని కూడా దర్శించండి మరి.
"మిరాయ్" సినిమా కథ ఇదేనా..అశోక చక్రవర్తి స్థాపించిన 9మంది అజ్ఞాత వ్యక్తుల రహస్యం నిజమేనా? పూర్తి వివరాలకోసం ఈ లింక్ క్లిక్ చేయండి