Andhra Yuva Sankalp 2K25 Digital Marathon | అమరావతి: మీరు యువతలో సామాజిక సృహను కలిగించే వీడియోలు చేయగలరా? కుటుంబ విలువలు, సంబంధ బాంధవ్యాల గురించి తెలియజేసే సామర్థ్యం ఉందా? ఫిట్‌నెస్ ప్రాధాన్యతను వివరించచం ఇష్టమా? లేదా ఏఐ (Artificial intelligence) వంటి సాంకేతిక మార్పులకు ప్రజలను సిద్ధం చేయగల ఆలోచనలు మీకు ఉన్నాయా? అయితే మీకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందిచింది. ఏపీ యువజన సర్వీసుల శాఖ చేపట్టిన "ఆంధ్ర యువ సంకల్ప్‌ 2కే25" అనే డిజిటల్ మారథాన్‌లో మీరు పాల్గొనవచ్చు. ఈ కార్యక్రమం వికసిత్ భారత్‌ - 2047 (Vikasit Bharat 2047), స్వర్ణాంధ్ర విజన్‌ - 2047 లక్ష్యాల్లో భాగంగా యువతను చైతన్యవంతంగా తీర్చిదిద్దడమే ఈ డిజిటల్ మారథాన్ ఉద్దేశ్యం.

ఈ మారథాన్‌లో 3 ప్రధాన థీమ్‌లు ఇవేయూత్ రెస్పాన్స్‌బిలిటీస్ – ఇందులో సామాజిక బాధ్యతలు, కుటుంబ బంధాలు, మానవీయ విలువలు వంటి అంశాలపై వీడియోలు రూపొందించాలి.

ఫిట్ యూత్ ఏపీ – ఫిట్‌నెస్, లైఫ్‌స్టైల్, క్రీడలు, పోషకాహారం, శారీరక మరియు మానసిక ఆరోగ్యంపై అవగాహన కలిగించాలి.

స్మార్ట్ యూత్ ఏపీ – సాంకేతిక పరిజ్ఞానం, ముఖ్యంగా ఏఐ వంటివి, వాటి ప్రయోజనాలు, వాటిపై ఉన్న అపోహలను తొలగించేలా వీడియోలు చేయాలి.

ఈ మూడు విభాగాల్లో మీకు నచ్చినదానిపై లేదా మూడింటిపై ప్రేరణాత్మకంగా, సమాజాన్ని చైతన్యపరిచేలా వీడియోలు లేదా షార్ట్స్ రూపొందించాలి. అనంతరం వాటిని #ఆంధ్రయువసంకల్ప్2K25 హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లలో పోస్ట్ చేయాలి.

 సెప్టెంబర్ 1 నుండి 30 వరకు డిజిటల్ మారథాన్ కార్యక్రమం కొనసాగుతుంది. పాఠశాల, కాలేజీ, యూనివర్సిటీ విద్యార్థులు, యువ ఉద్యోగులు, డిజిటల్ కంటెంట్ క్రియేటర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, ఫిట్‌నెస్ ట్రైనర్లు సహా ఆసక్తి ఉన్న ఎవరైనా ఇందులో పాల్గొనే అవకాశం ఉంది. మీరు కావాలంటే పైన పేర్కొన్న మూడు విభాగాలపై సైతం ఆసక్తికర వీడియోలు, షార్ట్స్ చేయవచ్చు. మీ పేరు, ఈమెయిల్, కాంటాక్ట్ నెంబర్, జిల్లా పేరు, గ్రామం పేరు, ఏ విభాగం, మీ వీడియో థీమ్, Social Media Handle పేర్లను నమోదు చేసి ఈ కార్యక్రమానికి రిజిస్టర్ కావాలి.

మీ వీడియోల లింక్‌ను ఆంధ్రా యువ సంకల్ప్ అనే  వెబ్‌సైట్‌ www.andhrayuvasankalp.comలో పోస్ట్ చేయాలి. మీ వ్యక్తిగత వివరాలు కూడా నమోదు చేయాలి. వీటిలో ప్రజాదరణ పొందినవాటిని, వినూత్నంగా, స్ఫూర్తిదాయకంగా ఉన్నవాటిని ఎంపిక చేసి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందిస్తారు. మొదటి బహుమతిగా 1 లక్ష రూపాయలు, రెండో బహుమతిగా రూ. 75 వేలు, మూడో బహుమతిగా రూ. 50 వేలు అందుకోనున్నారు

మూడు విభాగాలలో కలిపి విజేతలుగా నిలిచిన తొమ్మిది మందిని ’ఆంధ్ర యూత్ బ్రాండ్ అంబాసిడర్ - 2025’గా ప్రకటిస్తారు. ఈ డిజిటల్ మారథాన్‌లో పాల్గొన్న వారికి ‘డిజిటల్ క్రియేటర్ ఆఫ్ ఏపీ 2025’గా గుర్తింపుతో యువజన సర్వీసుల శాఖ నుండి సర్టిఫికెట్ లభిస్తుంది.