Ujjaini Mahankali Temple secunderabad : సికింద్రాబాద్ జనరల్ బజారులో కిక్కిరిసిన దుకాణాల మధ్య ఉంది ఉజ్జయిని మహంకాళి ఆలయం. మొదట్లో ఇక్కడ ఆలయం మాత్రమే ఉండేది. రాను రాను జనావాసాలు పెరిగాయి. క్రీ.శ. 1813 లో సురిటి అప్పయ్య అనే వ్యక్తి  మిలటరీలో పని చేస్తూ ఈ ప్రాంతంలో నివసించేవారు. ఆయనకి ఉజ్జయినీ బదిలీ అయితే అక్కడికి వెళ్ళారు. ఒకసారి అక్కడ కలరా వ్యాధి తీవ్రంగా ప్రబలి చాలామంది మృత్యువాత పడ్డారు. అప్పుడు అప్పయ్యగారు ఉజ్జయిని మహంకాళి ఆలయానికి వెళ్ళి ఆ తల్లికి మొక్కుకున్నారు. కలరా తగ్గిస్తే తన సొంత ఊరిలో అమ్మవారికి ఆలయం నిర్మిస్తానని కోరుకోగానే కలరా తగ్గుముఖం పట్టింది. మొక్కు ప్రకారం రెండేళ్ల తర్వాత తిరిగి తన స్వస్థలానికి వచ్చిన అప్పయ్యగారు దారుతో అమ్మవారి విగ్రహాన్ని తయారు చేయించి ఓ వేప చెట్టు కింద ఉంచి పూజించేవారు. ఆ తర్వాత అక్కడో చిన్న ఆలయం  నిర్మించారు. ఆ తర్వాత ఆలయ విస్తీర్ణం పెంచే క్రమంలో తూర్పు వైపున్న బావిని మరమ్మత్తు చేయిస్తుండగా అందులో మాణిక్యాంబ విగ్రహం దొరికింది. అమ్మవారి ఆనతి ప్రకారం అమ్మవారి విగ్రహం పక్కనే మాణిక్యాంబ విగ్రహాన్ని ప్రతిష్టించారు. క్రీ.శ. 1864 సం. లో శ్రీ సురటి అప్పయ్యగారి సారధ్యంలో ఇదివరకు విగ్రహాల స్ధానంలో ఇప్పుడున్న మూర్తులను ప్రతిష్టించారు. అప్పటినుంచీ ఇక్కడ శాస్త్రోక్తంగా నిత్య పూజలు జరుగుతున్నాయి. ఇక్కడ కొలువైన అమ్మవారి చేతిలో ఖడ్గంతో, మరో చేతిలో భరిణతో దర్శనమిస్తుంది. ముందున్న వేప చెట్టుని అలాగే వుంచి చుట్టూ ఆలయం నిర్మించారు. ఉపాలయంలో ఈశ్వరాంశ సంభూతుడైన వీరభద్రస్వామి చతుర్భుజాలతో ఎదురుగా నందీశ్వరుడితోసహా దర్శనమిస్తాడు. 


Also Read: నిండు మనసుతో బోనం సమర్సిస్తే మెండు మనసుతో అనుగ్రహం కురిపించే మహంకాళి!


ఆషాడంలో మూడో ఆదివారం మహంకాళి బోనాలు
ఏటా గోల్కొండలో బోనాల ఉత్సవం మొదలయిన మూడో ఆదివారం ఈ ఆలయంలోనూ, ఈ పరిసర ప్రాంతాలలోని వందకు పైగా ఆలయాలలోనూ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అదే రోజు సాయంత్రం ఫలహారం బళ్ళు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తాయి. మర్నాడు మహంకాళి, మాణిక్యాంబల చిత్రపటాలను ఏనుగు మీద వూరేగిస్తారు. ఇక్కడ బోనాల మర్నాడు జరిగే రంగం చాలా ప్రసిధ్ధి. 


Also Read: పోచమ్మ, ఎల్లమ్మ, మాంకాళమ్మ, పెద్దమ్మ వీళ్లంతా పార్వతీదేవి సంతానమే - మరి పోతురాజు ఎవరు!


భాగ్యనగరంలో ఎప్పటి నుంచి
భాగ్యనగరం విషయానికొస్తే 1869లో జంట‌న‌గ‌రాల్లో ప్లేగు వ్యాధి మ‌హ‌మ్మారి వ్యాపించింది. వేల మంది పిట్టల్లా రాలిపోయారు. అమ్మవారి ఆగ్రహం వల్లే ఇదంతా జరుగుతోందని భావించిన ప్రజలు గ్రామ దేవ‌త‌ల‌ను శాంత‌ప‌రచ‌డానికి ప్లేగు వ్యాధి నుంచి త‌మ‌ను తాము కాపాడుకోవ‌డానికి బోనాలు చేశారని చెబుతారు. 1675లో గోల్కొండ‌ను పాలించిన ల‌బుల్ హాస‌న్ కుతుబ్ షా ( తానీషా ) కాలంలో బోనం పండుగ హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైన‌ట్టు కూడా చరిత్ర చెబుతోంది. 


గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial