బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ గురించి తెలుగు ప్రేక్షకలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 500 లకి పైగా చిత్రాల్లో నటించిన ఆయన, ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించారు. కమర్షియల్ సినిమా లేదా ఆర్ట్ సినిమా అయినా చెరగని ముద్ర వేస్తాడు ఖేర్. ఎలాంటి క్యారెక్టర్ అయినా అందుకు తగ్గట్లుగా లుక్ ని మార్చుకోవడం, ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని చెప్పాలి. అయితే ఇప్పుడు సవాలుతో కూడిన మరో పాత్రను పోషించబోతున్నాడు ఈ వర్సటైల్ యాక్టర్. ఈసారి గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ గా సినీప్రియులను కనువిందు చేయడానికి రెడీ అయ్యారు.
అనుపమ్ ఖేర్ తన కొత్త ప్రాజెక్ట్ లో దిగ్గజ కవి, గీతాంజలి రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్ పాత్రలో నటించనున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడిస్తూ, ఇన్స్టాగ్రామ్ లో ఓ చిన్న వీడియోని షేర్ చేశారు. ఇందులో అనుపమ్ ఫస్ట్ లుక్ చూసి అందరూ షాక్ అవుతున్నారు. తెల్లటి విగ్, పొడవాటి గడ్డంతో ఠాగూర్ అవతార్లో కనిపించాడు ఖేర్. నిజంగా ఠాగూరే దిగి వచ్చాడా అన్నంతగా ఆ పాత్రలో ఒదిగిపోయాడు. ఐకానిక్ పాత్ర కోసం అతని ట్రాన్సఫర్మేషన్ కు నెటిజన్ల ప్రశంసలు దక్కుతున్నాయి.
అనుపమ్ ఖేర్ తన అద్భుతమైన ఫస్ట్ లుక్ తో పాటు, ఈ ప్రాజెక్ట్ గురించి మరింత సమాచారాన్ని వెల్లడిస్తానని అభిమానులకు హామీ ఇచ్చారు. “నా 538వ ప్రాజెక్ట్ లో #గురుదేవ్ #రవీంద్రనాథ్ ఠాగూర్ పాత్రను పోషించడం ఆనందంగా ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు రాబోయే రోజుల్లో వెల్లడిస్తాను. యే మేరా సౌభాగ్య హై కీ ముఝే గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ కో పార్దే పర్ సాకర్ కర్నా కా సౌభాగ్య ప్రాప్ట్ హువా హై" అని ఖేర్ తన పోస్టులో పేర్కొన్నారు.
Also Read: Baby Trailer: 'మొదటి ప్రేమకు మరణం లేదు' - హార్ట్ టచ్చింగ్ ఎమోషనల్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ 'బేబీ'
రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక తత్వవేత్త, కవి, సంగీతకారుడు, రచయిత మరియు విద్యావేత్త. భారతీయ సంస్కృతిలో ఆయనొక ప్రతీక. విశ్వభారతి విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. 1913లో గీతాంజలి కవితా సంకల నానికి నోబెల్ బహుమతిని అందుకున్నారు ఠాగూర్. ఈ అవార్డ్ సాధించిన మొట్ట మొదటి ఆసియా వాసిగా ఆయన చరిత్రకెక్కారు. బ్రిటీష్ రాజు జార్జ్ V ద్వారా అతనికి నైట్ హుడ్ అవార్డ్ లభించింది. ఠాగూర్ ను గురుదేవ్ అని, అతని కంపోజిషన్లను రవీంద్ర సంగీత్ అని పిలుస్తారు. రవీంద్రసంగీత్ కానన్ లోని జన గణ మన, అమర్ షోనార్ బంగ్లా పాటలు ప్రస్తుతం భారతదేశం, బంగ్లాదేశ్ జాతీయ గీతాలుగా కొనసాగుతున్నాయనే సంగతి తెలిసిందే. అలాంటి ఐకానిక్ పాత్రలో ఇప్పుడు అనుపమ్ ఖేర్ నటించనున్నారు.
అనుపమ్ గతంలో 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్' సినిమాలో మాజీ భారత ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గా నటించారు. బ్లాక్ బస్టర్ 'ది కాశ్మీర్ ఫైల్స్' లో పుష్కర్ నాథ్ గా ఆయన నటనకు ప్రశంసలు దక్కాయి. ఇక బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఎమర్జెన్సీ' చిత్రంలో భారత స్వాతంత్ర్య కార్యకర్త, సోషలిస్ట్ నాయకుడు జయప్రకాష్ నారాయణ్ గా కూడా కనిపించనున్నారు. ఇదే క్రమంలో ఇప్పుడు నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ గా నటించడానికి సిద్ధమయ్యారు.
చివరిసారిగా సంకల్ప్ రెడ్డి డైరెక్ట్ చేసిన 'IB 71' సినిమాలో కనిపించిన అనుపమ్ ఖేర్.. 'కార్తికేయ 2' వంటి ఎపిక్ బ్లాక్ బస్టర్ తో టాలీవుడ్ లో అడుగుపెట్టాడు. ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'టైగర్ నాగేశ్వరరావు' చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అలానే 'విజయ్ 69' తో సహా అనేక ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నాడు. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో 'ది వ్యాక్సిన్ వార్' సినిమా చేస్తున్నాడు. 'బుద్దా ఇన్ ఎ ట్రాఫిక్ జామ్' 'ది కాశ్మీర్ ఫైల్స్' తర్వాత దర్శకుడు వివేక్ అగ్నిహోత్రితో ఇది ఖేర్ మూడవ ప్రాజెక్ట్. కుచ్ ఖట్టా హో జాయే, మెట్రో ఇన్ డినో, ది సిగ్నేచర్, నౌతంకీ సినిమాలు కూడా అనుపమ్ ఖాతాలో ఉన్నాయి.
Also Read: Naga Shourya Apologies : మీడియాకి సారీ చెప్పిన నాగశౌర్య - స్పూఫ్ ఇంటర్వ్యూపై ఇంకోసారి క్లారిటీ
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial