Tirupati devotional news: Varalakshmi Vratham 2024 Sri Padmavati Temple Tiruchanoor
తిరుచానూరు...
శ్రీవారి దేవేరి నిలయంలో వరలక్ష్మి వ్రతం..!
పవిత్రమైన శ్రావణ మాసంలో శుక్ల పక్షం పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతం నిర్వహించడం ఆనవాయితీ గా వస్తోంది. హిందూ సంప్రదాయం ప్రకారం మహిళలు చాలా మంది దేవాలయాల్లో లేదా తమ ఇంట్లో సామూహికంగా వరలక్ష్మి వ్రతం నిర్వహిస్తారు. ఇలా వ్రతం చేయడం లేదా పాల్గొనడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో వరలక్ష్మి వ్రతం ప్రాముఖ్యత ఉన్న తిరుమల శ్రీవారి దేవేరి శ్రీ పద్మావతి అమ్మవారి కోలువైన తిరుచానూరు లో నిర్వహించడం చాలా ప్రాముఖ్యతగా అర్చకులు చెబుతున్నారు. ఈనెల 16వ తేదీ శుక్రవారం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జరిగే వరలక్ష్మి వ్రతానికి టీటీడీ ఘనంగా ఏర్పాట్లు చేసింది.
Also Read: తిరుమల హుండీలో సొమ్ము 3 భాగాలు - మీరు ఏ భాగంలో వేస్తున్నారు , ఎలాంటి ముడుపులు చెల్లిస్తున్నారు?
వ్రత విశిష్టత..
భవిష్యోత్తర పురాణంలో వ్యాస భగవానుడు వరలక్ష్మీ వ్రత పూజావిధానాన్ని, మహత్యాన్ని తెలియజేశారు. పూర్వం శంకరుడు పార్వతిదేవికి ఈ వరలక్ష్మీ వ్రతం విశిష్ఠత, అచరించవలసిన విధానాన్ని తెలియచేసినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. త్రేతాయుగంలో కుండలినీ నగరంలో నివసించిన చారుమతి అనే భక్తురాలు వరలక్ష్మీ నోము ఆచరించి పొందిన ఫలప్రదాన్ని అర్చకులు వివరించారు. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి ప్రీతితో అవతరించిన తిరుచానూరులో వరలక్ష్మీవ్రతంలో పాల్గొన్న మహిళలకు సత్సంతానం, దీర్ఘమాంగల్యసౌఖ్యం, సిరిసంపదలు, ఆరోగ్యం, కుటుంబసౌఖ్యం వంటి ఎన్నో మహాఫలాలు కలుగుతాయని పురాణాల ద్వారా తెలుస్తోంది.
Also Read: తిరుమల వెళుతున్నారా.. ఈ తప్పులు ఎప్పుడూ చేయకండి!
ముస్తాబైన తిరుచానూరు
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ఆస్థాన మండపంలో శుక్రవారం శ్రీ వరలక్ష్మీ వ్రతం కోసం వైభవంగా ఏర్పాట్లు చేశారు. టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్యర్యంలో ఆస్థాన మండపంలో ఏర్పాటు చేసిన వ్రత మండపం అకట్టుకునేలా వివిధ రకాల పుష్పాలతో పాటు పండ్లతో అలంకరణ చేస్తున్నారు.
శుక్రవారం వేకువజామున అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన, మూలవర్లకు, ఉత్సవర్లకు అభిషేకం నిర్వహిస్తారు. అనంతరం అమ్మవారికి బంగారుచీరతో అలంకరణ చేసి భక్తులకు దర్శనమిస్తారు. తరువాత అమ్మవారి ఉత్సవమూర్తిని ఆస్థాన మండపానికి వేంచేపు చేసి పద్మపీఠంపై ఆస్థానం నిర్వహిస్తారు. అక్కడ విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశస్థాపన, అమ్మవారి ఆరాధన, అంగపూజ, లక్ష్మీ సహస్రనామార్చన, అష్టోతర శత నామావళి అనంతరం అమ్మవారిని రోజా, చామంతి, మల్లె, సంపంగి, తులసి, పన్నీరు ఆకు, మరువము, తామరపూలు, వృక్షి వంటి పుష్పాలతో అమ్మవారిని ఆరాధిస్తారు. అమ్మవారిని 9 గ్రంథులతో(నూలుపోగు) అలంకరించారు. ఒక్కో గ్రంథిని ఒక్కో దేవతకు గుర్తుగా ఆరాధిస్తారు. తరువాత 12 రకాల నైవేద్యాలను అమ్మవారికి నివేదించి మహా మంగళ హరతితో వరలక్ష్మీ వ్రతం ముగిస్తుంది.
స్వర్ణరథోత్పవం
వరలక్ష్మీ వ్రతం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు అమ్మవారు స్వర్ణరథంపై విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.
* లైవ్ లో వ్రతం
తిరుచానూరు లో 16న శుక్రవారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు జరిగే వ్రతానికి నేరుగా హాజరుకాలేదు భక్తుల కోసం టీటీడీ శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా లైవ్ ఇవ్వనున్నారు.