జీవితమన్నాకా మంచీచెడు, సుఖదు:ఖాలు చాలా సహజమైన విషయాలు. అంతా మంచే ఉండదు. అలాగని ఎప్పుడూ చెడే జరగదు. ఇప్పుడు కీడు కాలం సాగుతోందని చింతిస్తూ కూర్చునే పనిలేదు. త్వరలోనే మంచి రోజులు రావచ్చు. అలా మంచి రోజులు వస్తున్నాయని చెప్పేందుకు సూచనగా మనలను సన్నద్ధం చేస్తూ కొన్ని సంకేతాలు మనకు ప్రకృతి చూపుతుందట. కావల్సిందల్లా అది గమనించగలిగే నిశిత దృష్టి మాత్రమే. మరి ఆ మంచి సంకేతాలేమిటో? వాటిని ఎలా గుర్తించాలో? శాస్త్రం చెబుతున్న విషయాలు తెలుసుకుందాం.


నీరునిండిన పాత్ర


నీళ్లు సహజసంపద. ఆ శ్రీమహావిష్ణువు సంకేతం. అందుకే జలనిధి అంటుంటారు. నీటితో నిండి ఉన్న పాత్ర మీకు రోడ్డు మీద ఎదురుపడితే అతి శుభసూచకంగా భావించాలి. ఈ శకునం తర్వాత శుభవార్తలు వింటారు. జీవితంలో జరగబోయే కొన్ని మంచి మార్పులకు సంకేతంగా దీన్ని భావంచవచ్చు.


అరచేతిలో దురద


పురుషులైతే వారి కుడి అరచేతిలో, స్త్రీలైతే వారి ఎడమ అర చేతిలో తరచుగా దురదగా ఉంటే అది రాబోయే మంచి రోజులకు సంకేతం. ఇది ఆర్థిక సమస్యలు తీరబోతున్నాయని ఆకస్మిక ధనలాభం కలుగబోతోందని చెపేందుకు సూచనగా భావించవచ్చు. గడ్డుకాలం ముగిసి మంచి కాలం ప్రారంభం కాబోతోందనేందుకు సంకేతంగా భావించాలి.


చీపురు


ఇంటి నుంచి బయటకు వెళ్లిన తర్వాత తరచుగా మీకు చీపురు కనిపిస్తే అది శుభసూచకమట. చీపురు లక్ష్మీ స్వరూపం అంటుంటారు. అందుకే చీపురు పదేపదే మీకు కనిపిస్తోందంటే ఏదో ఆకస్మిక ఆర్థిక ప్రయోజనాన్ని తెలియజేస్తుందని శాస్త్రం చెబుతోంది.


నల్లచీమలు


ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే అది శుభసూచకమట. ఇంటి గోడల మీద నల్లచీమల బారు కనిపిస్తే ఆ ఇంట్లో జరిగే శుభానికి సంకేతం. వృత్తి వ్యాపారాల్లో లాభాలు రావచ్చు. ఇంట్లో కనిపించిన చీమలకు హాని చెయ్యకుండా పిండి లేదా పంచదార వంటివి వెయ్యాలి. అవి త్వరలోనే ఇంట్లోంచి వెళ్లిపోతాయి.


శంఖ ధ్వని


ఉదయం నిద్ర లేస్తూనే మీకు శంఖారావం వినిపిస్తే చాలా శుభాలు మీకు ముందుముందు జరగబోతున్నాయని అర్థం. ఇప్పటి వరకు ప్రతిక్షణం ఒక సవాలుగా గడిచినప్పటికీ ఇక నుంచి జీవితం సజావుగా సాగేందుకు అవసరమయ్యే దారి కనిపిస్తుందని, సమస్యలు తీరిపోతాయని అనేందకు ఇదొక ముఖ్య సంకేతంగా భావించాలి. ఎందుకంటే శంఖారావం అంత సులభంగా వినిపించే ధ్వని కాదు. కాబట్టి దీనికి చాలా ప్రాధాన్యత ఉంటుంది.


సువాసనలు


తరచుగా ఇంట్లో అప్రయత్నంగా సువాసనలు వ్యాపించిన భావన కలుగుతుంటే ఏదో ఒక దివ్యశక్తి మీ వెన్నంటి ఉంటోందని అర్థం. ఇది జీవితంలో జరగబోయే శుభాలకు ఒక ప్రత్యేక సూచన. గొప్ప విజయలేవో మీ వెన్నంటి వస్తున్నాయని అర్థం.


మంత్ర ధ్వని


కలలో మంత్ర ధ్వని వినబడితే  అది చాలా మంచి స్వప్నంగా భావించాలి. ఇక మీ జీవితం విజయపథాన సాగబోతోందని అనేందకు సంకేతంగా భావించాలి. గొప్ప మార్పులేవో జరిగి మీకు మంచి రోజులు వస్తున్నాయనేందుకు సూచన.


Also Read : ఇంటి ముఖద్వారం తలుపు మీద దేవుడి ఫోటో ఉందా? ఈ విషయాలు తెలుసుకోవాలి





Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు.. ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.