Bhagavad Gita Sloka: హిందూ మతంలో అనేక పవిత్రమైన, మతపరమైన గ్రంథాలు ఉన్నాయి. వీటిలో దైవిక సాహిత్యంగా ప్రసిద్ధి చెందిన శ్రీమద్ భగవద్గీత ఉంది. మహాభారత యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసిన ధర్మ బోధ సారాంశం ఈ ఇందులో ఉంది. శ్రీమద్భగవద్గీత పఠించి, అందులో పేర్కొన్న విషయాలను అనుసరించే వ్యక్తి జీవితాంతం దుఃఖాలు, చింతలు లేకుండా ఉంటాడు.
Also Read : 'శంఖం' సంపదకు ప్రతీకగా ఎందుకు చెబుతారు, దీన్ని ఎలా పూజించాలి!
మహాభారత యుద్ధ సమయంలో కురుక్షేత్రంలో కౌరవులకు, పాండవులకు మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు అర్జునుడి మనస్సు కలత చెందింది. తన రక్త సంబంధీకులతో ఎలా పోరాడాలో తెలియక అయోమయంలో ఉన్నాడు. అప్పుడు దిక్కుతోచని అర్జునుడిని చూసి శ్రీకృష్ణుడు అతనికి భగవద్గీత అనే పరమ జ్ఞానాన్ని ప్రసాదించాడు. ప్రతి ఒక్కరూ శ్రీమద్భగవద్గీతను హృదయపూర్వకంగా పఠించాలి. గీత రెండవ అధ్యాయంలో వర్ణించిన ఈ 5 శ్లోకాలలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ప్రసాదించిన పరమ జ్ఞాన సారం ఉంది.
మొదటి శ్లోకం
వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోஉపరాణి |
తథా శరీరాణి విహాయ జీర్ణా న్యన్యాని సంయాతి నవాని దేహీ ||
తాత్పర్యం: మానవుడు పాత దుస్తులు వదిలి కొత్త దుస్తులు ధరించినట్టే, ఆత్మ పాత, పనికిరాని శరీరాన్ని విడిచిపెట్టి కొత్త శరీరాన్ని స్వీకరిస్తుంది.
రెండవ శ్లోకం
నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః |
న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః ||
తాత్పర్యము: ఆత్మను ఏ ఆయుధము ముక్కలు చేయజాలదు, అగ్ని దానిని కాల్చజాలదు, నీరు దానిని తడపలేదు, గాలి చలింప చేయలేదు.
మూడవ శ్లోకం
జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ |
తస్మాదపరిహార్యే உర్థేన త్వం శోచితుమర్హసి ||
తాత్పర్యము: ఈ లోకములో పుట్టినవాడికి మరణము తప్పదు. మరణించిన తర్వాత పునర్జన్మ పొందడం తప్పదు. అందుకే తన అనివార్య కర్తవ్య నిర్వహణలో దుఃఖించకూడదు.
నాల్గవ శ్లోకం
సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ ।
తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి ।।
తాత్పర్యము: సుఖం-దుఃఖం, లాభం-నష్టం, గెలుపు-ఓటమి గురించి ఆలోచించవద్దు, వాటన్నింటినీ సమానంగా స్వీకరించి, కర్తవ్య నిర్వహణగా యుద్ధం చేయి. నీ బాధ్యతలని నిర్వర్తించటం వలన నీకు ఎన్నటికీ పాపం అంటదు.
ఐదవ శ్లోకం
అథ చేత్త్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి ।
తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి ।।
తాత్పర్యము: నీవు స్వధర్మాన్ని, కీర్తిని విడిచి, ఈ ధర్మ యుద్ధాన్ని చేయటానికి నిరాకరిస్తే, తప్పకుండా పాపాన్ని చేసినవాడివవుతావు.
Also Read : మీ అరచేతిలో పంచభూతాలున్నాయని మీకు తెలుసా!
గురువు నుంచి ఉపదేశం పొందాక మాత్రమే చదువవలసినవి, ఒక నియమితమైన పద్ధతిలో మాత్రమే పారాయణ చేయవలసినవి, పైకి ఉచ్ఛరించకూడనివి, నలుగురిలో చర్చకు పెట్టకూడనివి, ఇలా మనకు మన సంప్రదాయంలో ఎన్నో కట్టుబాట్లు ఉన్నాయి. శాస్త్రం చెప్పిన ఆ విధి విధానాలను తప్పక అనుసరించాలి. అయితే ప్రత్యేక పరిస్థితుల్లో ప్రతీ విధానానికీ కొన్ని మినహాయింపులను కూడా శాస్త్రం ఇస్తూనే ఉంటుంది. ఇక్కడ మనం ముందుగా చూడవలసినది భగవద్గీత పుట్టిన సందర్భాన్ని. విషాదంలో మునిగిపోయి, దీనుడై, తన కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి అశక్తుడై, ధైర్యాన్ని కోల్పోయిన ఓ జీవాత్మకు, పరమాత్మ ఇచ్చిన ధైర్యమే, స్వస్వరూప జ్ఞానమే ఈ భగవద్గీత.