Significance of Aarti in Hinduism : షోడశోపచారాలలో ఒకటైన హారతి లేనిదే ఏ పూజా సంపూర్ణం కాదు. ఎంత ఘనంగా పూజ చేసినా చివర్లో హారతి కళ్లకు అద్దుకున్న తర్వాతే ఆ ఫలం దక్కినట్టు అనిపిస్తుంది. ఇంతకీ ఆ హారతిని ఎందుకిస్తారు..ఎందుకివ్వాలి? హారతివ్వడం వెనుకున్న ఆధ్యాత్మిక - శాస్త్రీయ కారణాలేంటో తెలుసా...
శరీరంలో నూతన ఉత్తేజం
ఎప్పుడైనా హారతి ఇచ్చేటప్పుడు గమనించారా. అప్రయత్నంగా గంటను తీసి మోగిస్తారు. ఆలయాల్లో భక్తులు కూడా క్యూ లైన్లలో నిల్చునే అందుబాటులో ఉన్న గంటను మోగిస్తారు. కొన్ని ప్రదేశాల్లో శంఖం ఊదుతారు. గంటలు, శంఖం శబ్దం వల్ల ఎలాంటి ఆలోచనలు లేకుండా పూర్తిగా భగవంతుడిపై మనసు లగ్నం అవుతుంది. ఫలితంగా శరీరంలో నిద్రిస్తున్న ఆత్మ మేల్కొంటుంది. శరీరంలో నూతన ఉత్తేజం వస్తుంది.
Also Read: ఈ 6 రాశులవారికి ఆదాయం, ఆనందం, విజయాన్నిచ్చి వెళ్లిపోతోంది 2023
ఆరోగ్యాన్నిచ్చే హారతి
ఒకప్పుడు ఆలయాలలో ఎలాంటి కృత్రిమమైన దీపాలూ ఉండేవి కావు. పైగా గాలి కూడా చొరబడని రాతితో నిర్మాణాలు సాగేవి. అలాంటి ప్రదేశాలలో తేమ అధికంగా ఉండటం సహజం. దీంతో దుర్వాసన, సూక్ష్మక్రిములు చేరేవి. సాధారణంగా కర్పూరానికి సూక్ష్మక్రిములను సంహరించే శక్తి, అంటువ్యాధులను నివారించే గుణం ఉన్నాయని ప్రాచీన వైద్యుల నమ్మకం. ఇప్పుడంటే కర్పూరం తయారీలో రసాయనాలను ఉపయోగిస్తున్నారు కానీ ఒకప్పుడు కర్పూరం చెట్ల నుంచే సేకరించేవారు. అలా అర్చనకు, ధూపదీపాలు సహా మొత్తం పూజంతా ప్రకృతి సిద్ధంగానే సాగేది.
భగవంతుడిని తాకినంత భావన
భగవంతుడికి ఇచ్చిన హారతిని కళ్లకు అద్దుకోవడం సహజం. ఈ ప్రక్రియతో కళ్లకి చలువ చేస్తుంది. పైగా భగవంతుని మూలవిరాట్టుని నేరుగా తాకలేము కాబట్టి, ఈ హారతి ద్వారా ఆయనను స్పర్శించుకుంటున్నామన్న తృప్తి కలుగుతుంది.
Also Read: 2023 డిసెంబరు నెల ఈ రాశులవారికి కొన్ని హెచ్చరికలు చేస్తోంది
ఘంటానాదం ఎందుకు?
హారతితో పాటుగా ఘంటానాదాన్ని చేయడం సహజం. కళ్లు మూసుకుని హారతిని అద్దుకోవడం ద్వారా మనసు, చెవులు, ఆఘ్రానించే శక్తీ, స్పర్శా...ఇన్ని ఇంద్రియాలు భగవంతుని ధ్యానంలో లగ్నమవుతాయి.
శాస్త్రీయ కారణం
కర్పూరాన్ని వెలిగించడం ద్వారా అద్భుతమైన సుగంధ పరిమళాలతో కూడిన సువాసన వస్తుంది. ఈ సువాసన నలుమూలలా వెదజల్లి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఫలితంగా ఆ ప్రదేశమంతా సానుకూల శక్తి ప్రసరిస్తుంది. అంతేకాకుండా ప్రతికూల శక్తులు దూరమై అక్కడ ఉన్నవారికి మానసిక ప్రశాంతత చేకూరుతుంది. అందుకే హారతిని ప్రశాంతతకు చిహ్నంగా పరిగణిస్తారు.
Also Read: ఇదే ఏడాదిలో మళ్లీ ముక్కోటి ఏకాదశి - న్యూ ఇయర్ కన్నా ముందే వచ్చింది!
మనిషి జీవితం హారతిలా ఉండాలి
కర్పూరానికి రెండు సుగుణాలు ఉన్నాయి.
1. ఎలాంటి అవశేషమూ మిగలకుండా దహించుకుపోవడం
2. రెండోది సుగంధాన్ని, ప్రకాశాన్ని వెదజల్లడం
బహుశా మనిషి జీవితం కూడా ఇలాగే సాగాలన్నది దీనివెనుకున్న ఆంతర్యం. భక్తుడు ఎలాంటి కర్మ ఫలం మిగలకుండా, మోక్షం వైపుగా సాగిపోవాలనీ.. జీవించినంతకాలం జ్ఞానమనే ప్రకాశాన్నీ, సద్గుణాలు అనే సుగంధాలనీ వెదజల్లుతూ ఉండాలనీ ఉద్దేశం.
గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply