Vaikunta Ekadashi Significance 2023


శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం
లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం
వందే విష్ణుం భవభయహరం సర్వ లోకైకనాథం


మనకు ఏడాది సమయం దేవతలకు ఒక్కరోజుతో సమానం. అందుకే మన 6 నెలలు దేవతలకు పగలు, మరో ఆరునెలలు రాత్రి. అంటే దక్షిణాయనం అంతా దేవతలకు రాత్రి..ఉత్తరాయణం అంతా పగలుగా చెబుతారు. ఈ ప్రకారం వైకుంఠ ఏకాదశి రోజు నుంచి దేవతలకు రాత్రి సమయం ముగిసిందని అర్థం. శ్రీ మహావిష్ణువు నిద్రనుంచి లేచి వైకుంఠ ద్వారం తెరుచుకున్న రోజు. స్వర్గద్వారాలు తెరిచే రోజు. ఇందుకు సూచనగా వైష్ణవ ఆలయాల్లో వైకుంఠ ద్వారాన్ని తెరిచి ఉంచుతారు...ఈ ద్వారం గుండా లోపలకు వెళ్లి స్వామివారిని దర్శించుకుంటే సకలపాపాలు హరించి పుణ్యం ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం. 


Also Read: కార్తీకమాసం ఎప్పటితో పూర్తవుతుంది - ఆఖరి రోజు చదువుకోవాల్సిన కథ ఇదే!


''వ్యక్తిర్ ముక్తిర్ మవాప్నోతి  ఉత్తర ద్వార దర్శనాత్ ''


ఏ వ్యక్తి అయినా ముక్తి పొందాలంటే ఉత్తర  ద్వార దర్శనం చేసుకోవాలని అర్థం. మార్గశిర మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశినే ఉత్తర ద్వార దర్శన ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజున ప్రతి దేవాలయంలో ఉత్తరం వైపున్న ద్వారం నుంచి ప్రవేశం కల్పిస్తారు. ఇలా దర్శించుకున్నవారికి పునర్జన్మ ఉండదని, మోక్షదాయకమే అని వేదవాక్కు. అందుకే మోక్షద ఏకాదశి అని కూడా అంటారు. 


Also Read: ఈ పత్రాలు త్రిశూలానికి సంకేతం - అందుకే శివపూజలో ప్రత్యేకం!


సమస్యలు తీర్చే ఉత్తర ద్వార దర్శనం


ముక్కోటి  ఏకాదశి రోజు ఎక్కువ  మంది భక్తులు ఉత్తర ద్వారం గుండా శ్రీమన్నారాయణుడిని దర్శించుకోవాలని ఆరాటపడుతుంటారు. వైకుంఠం వాకిళ్లు తెరుచుకునే పర్వదినం రోజున శ్రీమహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు.  రాక్షసుల బాధలు భరించలేక దేవతలంతా ఉత్తర ద్వారం దాటి శ్రీమన్నారాయణుడిని దర్శించుకుని తమ బాధలు విన్నవించుకున్నారు. అనుగ్రహించిన శ్రీ మహావిష్ణువు ఆ పీడ వదిలించాడని.. అందుకే ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మనల్ని పట్టిపీడిస్తున్న ఎన్నో సమస్యలు తీరిపోతాయని భక్తుల విశ్వాసం. 


Also Read: అష్టాదశ పురాణాలు ఏవి - ఏ పురాణంలో ఏముంది!


ఏకాదశి తిథి ఎప్పుడొచ్చిందంటే


డిసెంబరు 22 శుక్రవారం రోజు దశమి ఉదయం 9 గంటల 38 నిమషాల వరకూ ఉంది..ఆ తర్వాత నుంచి ఏకాదశి ప్రారంభమైంది. 
డిసెంబరు 23 శనివారం రోజు ఏకాదశి ఉదయం 7 గంటల 56 నిముషాల వరకూ ఉంది..


వాస్తవానికి సూర్యోదయానికి తిథి పరిగణలోకి తీసుకోవాలి కాబట్టి ముక్కోటి ఏకాదశి డిసెంబరు 2౩ శనివారం వచ్చింది. ఆ రోజు తెల్లవారు ఝామునుంచే వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. అయితే ఏకాదశి ఘడియలు దాటిపోకముందే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం ఉత్తమం. లేదంటే డిసెంబరు 22 శుక్రవారం సాయంత్రానికి ఏకాదశి తిథి ఉంది కాబట్టి..కొన్ని ఆలయాల్లో సాయంత్రం సమయంలో ఉత్తర ద్వార దర్శనభాగ్యం కల్పిస్తారు. అంటే డిసెంబరు 22 శుక్రవారం సాయంత్రం, డిసెంబరు 23 శనివారం ఉదయం 8 గంటల లోపు ఉత్తర ద్వార దర్శనం చేసుకోచ్చు. ఏకాదశి ఉపవాసం ఆచరించేవారు మాత్రం డిసెంబరు 23 శనివారమే నియమాలు పాటించాల్సి ఉంటుంది. 


ఓం నారాయణ విద్మహే వాసుదేవాయా దీమహి
తన్నో విష్ణు ప్రచోదయాత్


ఓం నమోః భగవతే వాసుదేవాయ 


Also Read: ఈ రాశులవారు ఒత్తిడి తగ్గించుకోకుంటే కష్టమే, నవంబరు 29 రాశిఫలాలు