Importance of Maredu: పరమేశ్వరుడి అనుగ్రహం కోసం శ్రీ మహాలక్ష్మి సప్తర్షులను ఋత్విక్కులుగా నియమించుకుని ఏకాదశ రుద్ర యాగాన్ని ప్రారంభించింది. యాగం నిర్విఘ్నంగా ముగియడంతో, హోమగుండం నుంచి ఓ వికృత శక్తి స్వరూపం బయటకు వచ్చి 'ఆకలి! ఆకలి!' అని కేకలు వేసింది. అప్పుడు లక్ష్మీదేవి ఖడ్గంతో తన వామభాగపుస్తనాన్ని ఖండించి...శక్తికి సమర్పించాలి అనుకుంది. అప్పుడు ప్రత్యక్షమైన పరమేశ్వరుడు విష్ణు వక్షః స్థలంలో స్థిరంగా ఉంటావు...నీ నామాల్లో 'విష్ణు వక్షఃస్థల స్థితాయ నమః' అని స్తుతించిన వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయనే వరమిచ్చాడు. లక్ష్మీదేవి నివేదిత స్థలం అయిన హోమగుండం నుంచి ఓ వృక్షాన్ని సృష్టించాడు..అదే బిల్వవృక్షం. ఈ దళాలతో తనను పూజిస్తే అనుగ్రహం తప్పక సిద్ధిస్తుందని చెప్పాడు శివుడు. అలా పరమేశ్వరుడి సేవకోసమే బిల్వవృక్షం భూలోకంలో పుట్టింది. 


Also Read: అష్టాదశ పురాణాలు ఏవి - ఏ పురాణంలో ఏముంది!


మారేడును బిల్వ అని కూడా అంటారు. బిల్వం అంటే శ్రీఫలం. అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన ఫలాన్ని ఇచ్చేదని అర్థం. మారేడు పత్రాలు త్రిశిఖలా ఉంటాయి..మూడు ఆకులతో ఉన్నందునే త్రిశూలానికి సంకేతంగా భావిస్తారు. ఈశ్వరారాధనలో మారేడు దళాలను తప్పనిసరిగా ఉపయోగిస్తారు. మారేడు దళాలతో పూజిస్తే శివుడు త్వరగా అనుగ్రహిస్తాడని పురాణాల్లో ఉంది. అందుకే  కొందరు లక్ష బిల్వ పత్రాలతో, మరికొందరు ఏకంగా కోటి బిల్వ పత్రాలతో శివుని ఆరాధిస్తారు.  శివ పురాణం విద్యేశ్వర సంహిత సాధ్యసాధన ఖండం ఇరవై రెండో అధ్యాయం వివరణలోనే మారేడు విశిష్టత, శివభక్తులలో ఉన్న ప్రవృత్తి, నివృత్తిపరుల భక్తి విశేషాలు కూడా సవివరంగా కనిపిస్తాయి. మారేడు చెట్టు మొదట్లో దీపం వెలిగించిన వారికి  తత్వజ్ఞానం లభిస్తుంది. మరణానంతరం శివ శాయుజ్యం పొందుతారు. కొత్త చిగుళ్లతో ఉన్న మారేడు కొమ్మను ముట్టుకోవడం, పూజించటం వల్ల సకలపాపాల నుంచి విముక్తి లభిస్తుంది. అంతటి పవిత్రమైన మారేడు చెట్టు కింద ఒక్క భక్తుడికి భోజనం పెట్టినా కోటి రెట్ల పుణ్యఫలం లభిస్తుంది. ఆ వృక్షం కింద ఆవు పాలు, స్వచ్ఛమైన నెయ్యితో వండిన పరమాన్నాన్ని శివభక్తుడికి పెడితే జీవితంలో దారిద్ర్యం అనేది దరిచేరదు. 


Also Read: శివుడికి ఈ ద్రవ్యంతో అభిషేకం చేస్తే సర్వ సంపద వృద్ధి


ఆరోగ్య ప్రయోజనాలూ ఉన్నాయ్



  • శివపూజలో వినియోగించే బిల్వ పత్రాల్లో ఎన్నో ఆయుర్వేద గుణాలున్నాయి. నీటిని శుభ్రపరచడంలో మారేడు ఆకులను మించినవి లేవు

  • ఈ చెట్టు నుంచి వచ్చే గాలి శరీరానికి సోకడం ఎంతో ఆరోగ్యకరం. ఈ గాలిని పీల్చడంవల్ల  బాహ్య, అంతర కణాలు శుద్ధి అవుతాయి, దేహాన్ని శ్రేష్ఠంగా ఉంచుతాయి

  • దేవాలయం గర్భగుడిలో గాలి సోకదు, సూర్యకిరణాలు ప్రసరించవు కనుక స్వచ్చత కోల్పోయే అవకాశం వుంది. అలాంటి వాతావరణంలో మారేడు ఆకులు స్వచ్చతను కలుగచేస్తాయి. ఎందుకంటే సూర్యుడిలో ఉండే తేజస్సు మారేడులో ఉంటుంది.

  • బిల్వ దళాల్లో తిక్తాను రసం, కషాయ రసం, ఉష్ణ వీర్యం ఉంటాయి. ఇవి జఠరాగ్నిని వృద్ది చేస్తుంది. వాత లక్షణాన్ని తగ్గిస్తుంది. మలినాలను పోగొడుతుంది. శ్లేష్మాన్ని, అతిసారాన్ని తగ్గిస్తుంది. గుండె సంబంధమైన వ్యాధులను తగ్గిస్తుంది.

  • బిల్వ పత్రాల నుంచి వచ్చే రసాన్ని శరీరానికి రాసుకుంటే చర్మ సమస్యలు తగ్గుతాయి, శరీరం నుంచి వచ్చే దుర్గంధం పోతుంది

  • మారేడు చెట్టు వేళ్లనుంచి తీసిన కషాయం మూలశంకను నయం చేస్తుంది

  • ఎండిన మారేడుకాయల్ని ముక్కలు చేసి, కషాయం కాచి తీసుకుంటే జ్వరం తగ్గుతుంది

  • మారేడు వేరునుంచి తీసిన రసాన్ని తేనెతో కలపి తాగితే వాంతులు తగ్గుతాయి

  • మారేడు చెట్టులో అణువణువూ ఔషధ గుణమే...అందుకే ఆరోగ్యానికి కూడా మారేడు అద్భుతం అంటారు ఆయుర్వేద నిపుణులు...


Also Read: కార్తీకమాసంలో పాటించే ఈ నియమం శారీరక, మానసిక ఔషధం!


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం పండితులు, కొన్ని పుస్తకాల నుంచి సేకరించింది మాత్రమే. ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.