Lets Vote : ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు. ప్రజలు ఎన్నుకున్న వారు పాలకులు కాదు. తమ తరపున పాలించమని ప్రతినిధిని ఓటు ద్వారా ఎన్నుకుంటారు ప్రజలు. అంటే ప్రజలే పాలకులు. అదే ప్రజాస్వామ్య మూలసూత్రం. మరి ప్రజలు తమ తరపున పరిపాలించే వారిని ఎన్నుకోవడానికి ఓట్లు వేసేందుకు ఎందుకు బద్దకిస్తున్నారు ? పల్లెల్లో జనం ప్రజాస్వామ్య స్పూర్తిని చూపిస్తూంటే… పట్టణాల్లో జనం ఎందుకు బద్దకిస్తున్నారు ?. ఈ సారి ఆ చెడ్డపేరును వదిలించుకునేందుకు సిద్ధమయ్యారు.
ఓటింగ్ కు దూరంగా ఉంటున్న 30 శాతం మంది
తెలంగాణలో ఎప్పుడైనా 70 నుంచి 75 శాతం మధ్య పోలింగ్ నమోదవుతుంది. అంటే పాతిక నుంచి ముఫ్ఫై శాతం మంది ఓటర్లు ఓట్లేయడం లేదు. దేశంలో అయితే ఇంకా తక్కువ. గత సార్వత్రిక ఎన్నికల్లో 67 శాతం ఓటింగ్ జరిగింది. మిగిలిన 33 శాతం ఓట్లేస్తే ఫలితం ఎలా ఉండేది ? . అదే సమయంలో పల్లెల్లో కన్నా పట్టణాల్లో పోలింగ్ శాతం అతి తక్కువగా ఉంటోంది. ఓటు రాజ్యాంగం కల్పించిన హక్కు.. ప్రతి ఒక్కరు తమ ఓటును ప్రలోభాలకు గురి కాకుండా నిర్భయంగా వినియోగించుకోవాలి. ఓటు హక్కు అనేది ఎంతో పవిత్రమైనది. దానికి ఎంతో సార్థకత ఉంది. ఓటును నోటుకు అమ్ముకోకుండా విలువైన ఆయుధంగా మల్చుకోవాలి. ప్రజల చేత, ప్రజల కొరకు పనిచేసే ప్రజా ప్రభుత్వాన్ని 'ప్రజాస్వామ్య' పద్ధతిలో ఎన్నుకోవాలి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ యువత తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నారు.
ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత ఓటు హక్కు వినియోగం
ప్రజాస్వామ్య దేశంలో ప్రతి పౌరుడికి ప్రశ్నించి హక్కు ఇచ్చేది ఓటు. మన రాష్ట్ర .. దేశ స్థితిగతులనే మార్చే శక్తి ఓటుకు ఉంది. ఒక వ్యవస్థకు ప్రజా ప్రతినిధి ఎంత అవసరమో, ఆ ప్రజా ప్రతినిధిని ఎన్నుకునేందుకు ఓటు అంతే అవసరం. కానీ చాలా మంది ఓటును కేవలం ఎన్నికల ప్రక్రియగా, రాజకీయ తంతుగా భావిస్తున్నారు. కానీ అది రాజకీయం కాదు. మన బాధ్యత. మన పిల్లలను భవిష్యత్ వేస్తున్న బాట లాంటిది. పాలకులను ప్రశ్నించాలంటే సరైన విధానంలో ఓటు హక్కు వినియోగించుకోవాలంటున్నారు హైదరాబాద్‌లోని పలువురు విశ్రాంత ఉద్యోగులు. ఓటు వేసి నాయకుడ్ని తప్పు పట్టడం కంటే.. జాగ్రత్తగా అన్నీ తెలుసుకొని ఓటు వేయడం మంచిదంటున్నారు. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం పలు సంస్కరణలు చేపట్టాలని చెప్పారు. ముందుగా ఓటర్‌కు సంబంధించిన ఆధార్‌ను జతపరుచుకోవటం తప్పనిసరి చేయాలన్నారు. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు పటిష్ఠ చర్యలు తీసుకోవలంటున్నారు.
సెలవు ఇచ్చినా ఓటింగ్ తక్కువే.
పట్టణాల్లో ఓటింగ్ శాతం తక్కువగా ఉంటోంది. ముఖ్యంగా హైదరాబాద్ వంటి సిటీల్లో రాను రాను పోలింగ్ తగ్గుతోంది. ప్రభుత్వం పెయిడ్ హాలిడేగా ప్రకటిస్తోంది. ప్రైవేటు సంస్థలు కూడా దీన్ని అమలు చేస్తాయి. అయినా ఓటు వేయడానికి బద్దకిస్తున్నారు.లాంగ్ హాలీడేస్ వచ్చాయని సొంత పనులు చేసుకుంటున్నారు. ఓటు ప్రాధన్యతను గుర్తించలేకపోతున్నారు. సెలవు ఇచ్చి మరీ ఓటు వేయమంటే.. ప్రజలు వేయడం లేదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. దేశంలో ప్రజాస్వామిక ఫలాలు అధికంగా అనుభవిస్తున్న విద్యావంతులు, పట్టణ ప్రాంతాలు, మహానగరాల్లోని సంపన్న వర్గాలు ఓటింగ్ పట్ల అనాసక్తిని ప్రదర్శిస్తున్నారు
వజ్రాయుధం ఓటు !
ఓటర్లందరికీ ఉన్న మహా ఆయుధం నోటా. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎవరూ నచ్చకపోతే వారిని తిరస్కరించడానికి 'నోటా' వీలు కల్పిస్తోంది. నోటా వచ్చాక నాయకుల ఎంపికలో కొంత మార్పు కనిపించినా.. ఉన్నంతలో ఉత్తముల్ని ఎన్నుకోవడం ఓటర్లకు ఉన్న ఒక మార్గం. ఈ కొన్ని నిమిషాలు వెచ్చించి పౌరులిచ్చే తీర్పు.. రాబోయే ఐదేళ్ల పాటు వారి జీవన స్థితిగతుల్ని ప్రభావితం చేస్తుంది. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు నిరుపయోగం కాకుండా అందరూ సద్వినియోగం చేసుకుంటేనే ప్రజాస్వామ్యం ప్రకాశిస్తుంది. ఆ క్షణాలు కొన్ని గంటల్లో మన ముందుకు రాబోతున్నాయి. రాష్ట్ర భవిష్యత్తును మార్చే మీ ఓటు వేయడానికి అందరూ కదులుదాం.. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం.