Telangana Polling Day 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు గురువారం జరగనున్నాయి. ఈ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం ఏడు గంటల నుంచి ఓటింగ్ ప్రారంభం అవుతుంది. సమస్యాత్మకమైన 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగియనుండగా.. మిగతా 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 వరకు ఓటింగ్ ( Telangana Assembly Elections ) జరగనుంది. ఆ సమయానికి పోలింగ్ కేంద్రానికి వచ్చిన వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. పోలింగ్ కంటే ముందే అంటే ఉదయం 5 గంటలా 30 నిమిషాలకు మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. మంచిర్యాల, ఆసిఫాబాద్, సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంథని, భూపాలపల్లి, ములుగు, ఇల్లందు, పినపాక, కొత్తగూడెం, భద్రాచలం, అశ్వరావుపేట, నియోజకవర్గాల్లో సాయంత్రం 5కి పోలింగ్ ముగియనుంది. రాష్ట్రవ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ సిబ్బంది 1,85,000 మంది, 22,000 మంది మైక్రో అబ్జర్వర్లు, స్క్వాడ్స్, ఇతరులు మొత్తం కలిపి 2 లక్షలకుపైగా పోలింగ్ విధుల్లో ఉండనున్నారు. 


తెలంగాణ ఎన్నికల్లో మొత్తం 2290 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వీరిలో 2068 మంది అభ్యర్థులు పురుషులు కాగా, 221 మంది మహిళలు.. ఒకరు ట్రాన్స్ జెండర్ ఉన్నారని ఈసీ వెల్లడించింది. అధికార బీఆర్ఎస్ మొత్తం 119 స్థానాల్లో అభ్యర్థులను బరిలో నిలిపింది. కాంగ్రెస్ పార్టీ 118 చోట్ల  పోటీ చేస్తుండగా, బీజేపీ 111 స్థానాల్లో అభ్యర్థులు, బీఎస్పీ నుంచి 108 అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. సీపీఎఎం 19, బీజేపీ మిత్రపక్షం జనసేన 8 స్థానాల్లో, సీపీఐ ఒక స్థానంలో పోటీ చేస్తున్నాయి. అత్యల్పంగా నారాయణపేట, బాన్స్‌వాడలో కేవలం ఏడుగురు అభ్యర్థులు పోటీలో నిలిచారు.


ఈసీ తెలిపిన వివరాల ప్రకారం..  తెలంగాణలో మొత్తం 3.26 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,63,01,705 మంది మహిళా ఓటర్లు ఉండగా, 1,62,98,418 మంది పురుషులు ఉన్నారు. రాష్ట్రంలో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు.  ట్రాన్స్ జెండర్లు ఓటరు 2,676 మంది ఉన్నారు. సర్వీసు ఓటర్లు 15,406, ప్రవాస ఓటర్లు 2,944 మంది ఉన్నారు. కొత్త వారి సంఖ్య 9,99,667. రాష్ట్రంలో మొత్తం 59,779 బ్యాలెట్ యూనిట్లను పోలింగ్ కోసం వినియోగిస్తున్నారు. ఎల్బీనగర్‌లో 4 బ్యాలెట్ యూనిట్లు వాడనున్నారు. రిజర్వ్ బ్యాలెట్ యూనిట్లు కలిపి మొత్తం 72,931 బ్యాలెట్ యూనిట్లు అందుబాటులో ఉంటాయి. 56,592 కంట్రోల్ యూనిట్లు వినియోగిస్తున్నారు.  2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 88 స్థానాలను గెలుచుకుంది, 19 సీట్లతో కాంగ్రెస్ రెండో స్థానంలో నిలవగా, AIMIM 7 సీట్లు, టీడీపీ 2, బీజేపీ ఒక్క సీటు నెగ్గాయి. AIFB, ఒక స్వతంత్ర అభ్యర్థి సైతం గెలుపొందారు. 


జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు
హైదరాబాద్: పోలింగ్ రోజు ఎప్పటికప్పడు పోలింగ్ రోజున రిపోర్ట్ కోసం జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. సెక్టోరియల్ అధికారులు ఎప్పటికప్పుడు పోలింగ్  కేంద్రాల నుండి మాక్ పోలింగ్,  పోలింగ్ శాతం వివరాలు, క్యూ  లైన్ వివరాల గురించి సెక్టోరల్ ఆఫీసర్ పిఓ నుండి  సేకరించిన సమాచారాన్ని పంపిస్తారు. సెక్టార్ ఆఫీసర్ సకాలంలో పంపించని పక్షంలో సంబంధిత సెక్టార్ ఆఫీసర్ కు ఫోన్ చేసి సమాచారాన్ని సేకరిస్తారు. దీని కోసం 150 విద్యార్థులతో సమాచారం సేకరించేందుకు శిక్షణ కల్పించారు. వీరు ఉదయం 5 గంటల నుండి విధుల్లో పాల్గొంటారు. ఈ విద్యార్థులకు ఒక్కొక్క విద్యార్థికి 3 నుండి 4 సెక్టార్ లు కేటాయించి సమాచారాన్ని సేకరించేందుకు కృషి చేస్తారు. వీరికి ఐటీ సెక్షన్ లో పని చేసే అధికారులు పర్యవేక్షణ, సూచనలు ఇస్తారు.
Also Read: Telangana Elections 2023 : ఫుల్ స్వింగ్‌లో బెట్టింగ్ బంగార్రాజులు - సొంత సర్వేలతో తెలంగాణ ఎన్నికల ఫలితాలపై పందేలు !


Also Read: Voting Procedure: ఇలా చేస్తే మీరు ఓటు వేసినా నో యూజ్‌! - పర్ఫెక్ట్ ఓటింగ్‌కి ఈ సూచనలు పాటించండి


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply