Shivaratri News: మాఘమాసములో కృష్ణ పక్ష చతుర్ధశి అర్ధరాత్రి ని హిందువులు శివరాత్రిగా జరుపుకుంటారు. మాఘ మాసంలో (ఫిబ్రవరి లేదా మార్చి) 13 వ లేదా 14 వ రోజును శివరాత్రిగా జరపాలని శివపురాణం చెప్తోంది. శైవులకే కాక, శివభక్తులందరికీ అతి పెద్ద పండుగ మహాశివరాత్రి. రోజంతా ఉపవాసం ఉండి రాత్రి మొత్తం జాగరణ చేస్తారు. మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి 12 గంటలకు జ్యోతి స్వరూపుడైన శివుడు లింగ రూపంలో కొలువుదీరుతాడని శాస్త్రాలు చెప్తున్నాయి. 


ఈ పవిత్రమైన రోజున భక్తులు శివాలయాలకు వెళ్ళి పూజలు, అభిషేకాలు చేస్తారు. దీపాలు వెలిగిస్తారు. ఆ మహాశివునికి బిల్వపత్రాలు సమర్పిస్తారు. శివనామస్మరణతో తరించిపోతారు. దేశమంతా భక్తి పారవశ్యంలో మునిగిపోతుంది. అలాగే తెలంగాణలో కూడా శివరాత్రి వేడుకలు ఘనంగా జరిపే పురాతన దేవాలయాలు కొన్ని ఉన్నాయి. ఈ రోజున తప్పకుండా దర్శించదగ్గ పవిత్ర స్థలాలు ఇవి:

1. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవాలయం


రాజన్న-సిరిసిల్ల జిల్లాలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవాలయం అత్యంత ప్రాచీనమైనది. దీన్ని దక్షిణ కాశీగా పిలుస్తారు.  సంతానం లేని వారు ఇక్కడ కోడెను సమర్పిస్తే సంతానం కలుగుతుందని భక్తులు నమ్ముతారు. ఇక్కడ పవిత్రమైన గండదీపాలు వెలిగిస్తే గండాలు తొలగిపోతాయని ప్రతీతి. ఇక్కడ శివరాత్రి రోజున సుమారు వందమంది అర్చకులతో మూలవిరాట్టుకి మహాలింగార్చన జరుపుతారు. అర్ధరాత్రి వేళ శివునికి ఏక రుద్రాభిషేకం చేస్తారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలల్లో తరలివచ్చి శివరాత్రి వేడుకలు జరుపుకుంటారు.


2. రామప్ప/రామలింగేశ్వరస్వామి ఆలయం


వరంగల్ లో కొలువుదీరిన 800 ఏళ్ల చరిత్ర గల ఆలయం రామప్ప. రామప్ప అంటే గుడిలో దేవుడి పేరు కాకుండా, ఈ ఆలయాన్ని ఒక గొప్ప కళాఖండంగా నిర్మించిన ప్రధాన శిల్పి పేరు ఆలయంకు పెట్టటం విశేషం. ఇటీవల ఇది మన వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించింది. అడుగడుగునా కాకతీయుల వైభవం ఉట్టిపడేలా ఆలయ నిర్మాణం ఉంటుంది.  ఈ ఒక్క దేవాలయంలోనే మహా శివరాత్రి వేడుకలు మూడు రోజుల పాటు ఘనంగా జరుగుతాయి. వేలాది మంది భక్తులతో ఆలయ ప్రాంగణం కళకళలాడిపోతుంది.


3. కీసరగుట్ట 


హైదరబాదుకు అతిదగ్గరలోని మేడ్చల్ జిల్లా కీసరగుట్ట ఆలయం ఒక పురాతన శైవ క్షేత్రం. ఇక్కడ శివరాత్రి సందర్భంగా ఆరు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ ఆధ్యాత్మిక శోభను తిలకించటానికి లక్షల్లో భక్తులు తరలివస్తారు. ఇక్కడే జాగరణ చేస్తారు. శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం రాత్రంతా మారుమ్రోగిపోతుంది.


4. కొమురవెల్లి మల్లన్న


కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయం సిద్దిపేట జిల్లా కొమురవెల్లి గ్రామంలోని కొండపై కొలువై ఉంటుంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శివరాత్రి రోజున కొమురవెల్లి మల్లన్న ఆలయంలో పెద్ద పట్నం అనే కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తారు. 46 వరుసలతో ఐదు రంగులతో పసుపు, కుంకుమ, తెల్ల పిండి , పచ్చ సునేరుతో ఒగ్గు పూజారులు పట్నాన్ని వేస్తారు. ఈ పట్నాన్ని శివసత్తులు అనే మల్లన్న భక్తులు  తొక్కి వాళ్ల భక్తిని చాటుతారు.


5. కాళేశ్వర ముక్తేశ్వరస్వామి ఆలయం


అత్యంత పురాతన శైవ దేవాలయాల్లో కాళేశ్వర ముక్తేశ్వరస్వామి దేవాలయం ఒకటి. ఇది కరీమ్నగర్ జిల్లాలోని మంథని గ్రామంలో సరిగ్గా ప్రాణహిత నది, గోదావరి కలిసే చోటున కొలువుదీరి ఉంది. ఈ ఆలయాన్ని దర్శిస్తే శివుడు పాపాలను తొలగించి ముక్తిని ప్రసాదిస్తాడని ప్రజల విశ్వాసం. శివరాత్రి రోజు ఇక్కడ ఘనంగా శివకళ్యాణం జరుగుతుంది. వేలాదిగా భక్తులు వచ్చి శివపారతులను దర్శిస్తారు.