Subrahmanya Sashti 2024 Significance : లోక సంరక్షనార్ధం దేవతల కోర్కె మేరకు పరమేశ్వరుడి అంశతో జన్మించాడు సుబ్రహ్మణ్యస్వామి. ఆరోజు మార్గశిరమాసం శుద్ధ షష్ఠి కావడంతో సుబ్రహ్మణ్య షష్ఠి లేదా స్కంద షష్ఠి అని పిలుస్తారు.
"తారకాసురుడు" అనే రాక్షసుడు ఘోరతపస్సు ఆచరించి శివుడిని ప్రశన్నం చేసుకుంటాడు. తనకు బాలుడి చేతిలో తప్ప ఇంకెవరీ వల్ల చావు లేదనే వరం పొందుతాడు. అప్పటి నుంచి తాను అజేయుడిని అనే అహంకారంతో ముల్లోకాలను వణికించాడు. దేవతలంతా శ్రీ మహావిష్ణువు వద్దకువెళ్లి మొరపెట్టుకోగా.ఆ వరం ఇచ్చిన శివుడి సంతానం వల్లే తారకాసురుడి మరణం ఉంటుందని తెలియజేసి శివుడి వద్దకు వెళ్లమని సెలవిచ్చాడు. అలా సుబ్రహ్మణ్యస్వామి జన్మకు కారకులయ్యాడు శంకరుడు..
Also Read: ధనస్సు రాశిలోకి సూర్యుడు.. ఈ 3 రాశులవారికి అన్నింటా విజయం, ఐశ్వర్యం, ఆరోగ్యం!
ఓ రోజు పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంలో ఉండగా శివుడి నుంచి వచ్చి తేజస్సును అగ్నిదేవుడు స్వీకరిస్తాడు. దానిని భరించలేక ఆ దివ్య తేజాన్ని గంగలో విడిచిపెడతాడు. ఆసమయంలో నదీస్నానం ఆచరిస్తున్న ఆరుగులు కృత్తికల దేవతల గర్భంలోకి ప్రవేశిస్తుంది. రుద్రుడి తేజస్సుని మోయలేక నది పక్కనే ఉన్న రెల్లు పొదల్లో విడిచిపెడతారు. ఆ పొదల నుంచి ఆరుముఖాల తేజస్సుతో ఉద్భవించిన బాలుడే సుబ్రహ్మణ్యస్వామి. రుద్రాంశసంభూతుడు అయిన ఆ బాలుడిని కైలాశానికి తీసుకెళ్లారు పార్వతీ పరమేశ్వరులు.
గంగాదేవి గర్భంలో తేజోరూపంతో ఉన్నందున గాంగేయుడని, ఆరు ముఖాలు ఉండడం వల్ల షణ్ముఖుడు, గౌరీశంకరుల పుత్రుడు అయినందున కుమారస్వామి అని, శూలాన్ని ఆయుధముగా కలిగిన వాడు కావడంతో వేలాయుధుడు అని, శరవణం అంటే రెల్లు వనంలో జన్మించాడు కాబట్టి శరవణుడు అని..ఇంకా స్కంధుడు, స్వామినాధుడు , మురుగన్ అని వివిధ పేర్లతో పూజిస్తారు.
కారణజన్ముడు అయిన సుబ్రహ్మణ్యస్వామిని దేవతలకు సైన్యాధ్యక్షుడిగా నియమించి తారకాసుర సంహారం చేయిస్తారు పార్వతీ పరమేశ్వరులు.
Also Read: పుష్ప 2లో గంగమ్మ జాతర సీన్‌తో ఫ్యాన్స్ పూనకాలు- ఇంతకీ ఈ వేడుకలో లేడీ గెటప్‌కి ఎందుకంత ప్రాధాన్యత!
సుబ్రమణ్య స్వామి ఆరాధన వల్ల కంటికి, చర్మానికి సంబంధించిన రోగాలు తొలగిపోతాయి. పెళ్లికానివారు సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే వివాహం జరుగుతుంది..సంతానం లేనివారు పూజిస్తే కోర్కె నెరవేరుతుందని, జాతకంలో ఉండే రాహు కేతు దోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.
ఈ ఏడాది సుబ్రహ్మణ్య షష్ఠి డిసెంబరు 07 శనివారం వచ్చింది. ఈ రోజు వేకువజామునే స్నానమాచరించి సుబ్రహ్మణ్యస్వామిని దర్శించుకుని పాలు, పండ్లు నైవేద్యంతో పాటూ వెండిపడగలు, వెండికళ్లు మొక్కులు చెల్లించుకుంటారు.
ఎవరి జాతకంలో అయినా కుజదోషం, కాలసర్పదోషం ఉన్నా, పెళ్లి జరగకపోయినా..ఈ రోజు ఆలయాల్లో "శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి" కళ్యాణం (Sri Valli Devasena Sametha Subrahmanya Swamy Kalyanam) చేయించినా, చూసినా త్వరలోనే వారిజీవితంలో శుభం జరుగుతుందని నమ్మకం.
తమిళనాడులో సుబ్రహ్మణ్య షష్ఠిని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. కుమారస్వామి ఆలయాలకు కావిడలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. కొన్ని ఆలయాల్లో నాగప్రతిష్టలు చేస్తారు.
ముఖ్యంగా నాగుల చవితి, నాగుల పంచమి రోజు పుట్టలో పాలు పోయలేకపోయినవారు...సుబ్రహ్మణ్య షష్ఠి రోజు పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకుంటారు..
నమస్తే నమస్తే మహాశక్తి పాణే |
నమస్తే నమస్తే లసద్వజ్రపాణే ||
నమస్తే నమస్తే కటిన్యస్త పాణే |
నమస్తే నమస్తే సదాభీష్ట పాణే ||
ఓ చేతిలో మహాశక్తివంతమైన ఆయుధాన్ని, మరో చేతిలో ప్రకాశవంతమైన వజ్రాయుధాన్ని కలిగి అభయాన్నిస్తున్న సుబ్రహ్మణ్యస్వామికి నమస్కారం అని అర్థం.
Also Read: డిసెంబరు 02 నుంచి మార్గశిర మాసం.. 4 గురువారాలు ఇలా పూజ చేస్తే లక్ష్మీ అనుగ్రహం!