Significance of Margasira Lakshmi Puja:  2024 డిసెంబరు 02 సోమవారం నుంచి మార్గశిరమాసం ప్రారంభమవుతోంది. ఈ నెలలో వచ్చే గురువారాల్లో మహాలక్ష్మికి పూజచేస్తే అప్పుల బాధలు తొలగిపోయి సిరిసంపదలు కలుగుతాయని పరాశర మహర్షి..నారదుడికి చెప్పినట్టు పురాణాల్లో ఉంది. 


కార్తీకం నెల రోజులు శివకేశవుల ఆరాధనలో మునిగితేలే భక్తులు.. మార్గశిరమాసం మొత్తం లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. ముఖ్యంగా మార్గశిర మాసంలో గురువాలాలు విశిష్టమైనవిగా భావిస్తారు. ఈ నెల విష్ణువుకి కూడా అత్యంత ప్రీతికరమైనది.  


Also Read: 108 వైష్ణవ క్షేత్రాల్లో మొదటిది.. దేశంలోనే అతి పెద్ద ఆలయం ..ధనుర్మాసంలో దర్శించుకుంటే జన్మ ధన్యం!


మార్గశిర గురువారం పూజా విధానం..


సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసి..ఇంటి ముందు మహాలక్ష్మికి ఆహ్వానం పలుకుతూ ముగ్గు వేయాలి. తలకు స్నానం చేసి దేవుడి మందిరం సిద్ధం చేసుకోవాలి. ముందుగా గణపతి పూజ చేసి అనంతరం..అమ్మవారికి షోడసోపచార పూజ చేయాలి. భారీగా పూజ చేసే సమయం లేనివారు భక్తి శ్రద్ధలతో దీపారాధన చేసి శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరం, కనకధారా స్తోత్రం చదువుకున్నా మంచి ఫలితం ఉంటుంది. 


శ్రీ మహాలక్ష్మి గాయత్రి


ఓం మహాలక్ష్మీ చ విద్మహ విష్ణుపత్నీ చ ధీమహి 
తన్నో లక్ష్మీ: ప్రచోదయాత్‌”


పూజ అనంతరం నైవేద్యం సమర్పించి మార్గశిర లక్ష్మివారం  వ్రత కథ చెప్పుకుని అక్షతలు తలపై వేసుకోవాలి


Also Read: దేవుడు ప్రతిచోటా ఉన్నాడు కదా..ఆలయాలకు ఎందుకు వెళ్లాలి - వెళ్లకపోతే భక్తి లేనట్టేనా!
 
2024 లో మార్గశిర గురువారాలు ఎప్పుడొచ్చాయి - ఏ రోజు అమ్మవారికి ఏ నైవేద్యం సమర్పించాలి


డిసెంబరు 05 మార్గశిర మాసం మొదటి గురువారం - అమ్మవారికి నైవేద్యం పులగం


డిసెంబరు 12 మార్గశిర మాసం రెండో గురువారం - అమ్మవారికి అట్లు-తిమ్మనం నైవేద్యం


డిసెంబరు 19 మార్గశిరమాసం మూడో గురువారం - అప్పాలు, పరమాన్నం నైవేద్యం


డిసెంబరు 26 మార్గశిర మాసం నాలుగో గురువారం- పులిహోర, గారెలు నైవేద్యం
 
నాలుగు గురువారాలు పూజించి..ఆఖరి వారం ఐదుగురు ముత్తైదువులను ఆహ్వానించి భోజనం, తాంబూలం సమర్పించి ఆశీర్వాదం తీసుకోవాలి. 


మామూలుగా అయితే ఏ పూజ చేసినా చివర్లో ఉద్వాసన చెబుతారు. కానీ మార్గశిరమాసం గురువారం వ్రతంలో అమ్మవారికి ఉద్వాసన చెప్పరు. ఉద్వాసన అంటే వెళ్లి రమ్మని అర్థం. శ్రీ మహాలక్ష్మి ఇంట్లో తిష్టవేసుకుని కూర్చోవాలి అనుకుంటారు కానీ వెళ్లి రమ్మని ఎవరూ చెప్పరు కదా.. అందుకే అమ్మవారికి ఉద్వాసన చెప్పరు. కొన్ని ప్రాంతాల్లో ఉద్వాసన చెప్పే సంప్రదాయం కూడా ఉంది..
 
ఈ నియమాలు తప్పనిసరి


మార్గశిరమాసంలో నోము నోచే స్త్రీలు గురువారాల్లో అత్యంత శుచిగా ఉండాలి. ఆ రోజు తలకు నూనె రాసుకోవడం, జుట్టు చిక్కులు తీసుకోవడం లాంటివి చేయకూడదు. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో నిద్రపోరాదు. భక్తిశ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించాలి. 


Also Read: శబరిమలలో పెద పాదం, చిన పాదం అంటే ఏంటి - వనయాత్ర ఎందుకు చేయాలి!


డిసెంబరు 30 అమావాస్యతో మార్గశిరమాసం ఆఖరవుతుంది.. డిసెంబరు 31 నుంచి పుష్యమాసం ప్రారంభమవుతుంది...
 
గమనిక: పండితులు చెప్పిన వివరాలు , కొన్ని పుస్తకాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా రాసిన కథనం ఇది...దీనిని ఎంతవరకూ విశ్వసించాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం...