Kurnool Temple Stange Custom: రాయలసీమ.. ఎన్నో ప్రముఖ ఆలయాలకు నెలవు. కొండంత దేవుడు.. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశుడు కొలువైన ప్రసిద్ధ ప్రాంతం. ఆచార సంప్రదాయాలకు సీమ గడ్డ పెట్టింది పేరు. దశాబ్దాలు గడుస్తున్నా.. ఆనాటి కొన్ని వినూత్న సంప్రదాయాలను నేటికీ అక్కడి స్థానికులు పాటిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఉగాది వచ్చిందంటే రాయలసీమ ముఖ ద్వారమైన కర్నూలులో (Krunool) బురద పందేల సంబరం అంబరాన్ని అంటుతుంది. తెలుగు సంవత్సరాది రోజు ఆలయం చుట్టూ ఎడ్ల బండ్లు, పాడి పశువులతో ప్రదక్షిణలు చేసి భక్తులు మొక్కుబడి తీర్చుకుంటారు. ఉగాది తర్వాత రోజు ఆ ఆలయం చుట్టూ రజకులు గాడిదలతో ప్రదక్షిణలు చేస్తారు. మానవుల అభ్యుదయం జంతువుల మచ్చికతోనే ప్రారంభమైందని వినూత్న తరహాలో చాటి చెప్పిన ఈ ఉత్సవం చాలా స్పెషల్ అని చెప్పవచ్చు.
కర్నూలు (Krunool) వాసులు ఉగాది పండుగను చాలా వెరైటీగా జరుపుకొంటారు. పండుగ రోజున ఎడ్ల బండ్లు, పాడి పశువులతో వెరైటీగా దేవాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కుబడి తీర్చుకుంటే.. పండుగ మరుసటి రోజు రజకులు సైతం తమదైన శైలిలో గాడిదలతో ప్రదక్షిణల చేస్తూ మొక్కులు తీర్చుకుంటారు. నగరం నడిబొడ్డున ఉన్న కల్లూరు చౌడేశ్వరి మాత ఆలయంలో (Kalluru Chowdeswari Temple) ఉగాది ఉత్సవాలు ఆనవాయితీ ప్రకారం ఈసారి కూడా వినూత్న శైలిలో నిర్వహించారు. ఆలయం చుట్టూ బంక మట్టి వేసి నడుము లోతు బురదలో రజకులు గాడిదల బండ్లతో ప్రదక్షిణలు చేశారు. తరతరాలుగా వస్తున్న ఈ విశిష్ట ఆచారం వేలాది మంది భక్తజనుల కేరింతల మధ్య అత్యంత ఉత్సాహంగా సాగింది. గాడిదలు బురదలో నడవలేకపోతుంటే... బురదలో దిగిన యువకులు కేరింతలతో వాటిని ప్రోత్సహిస్తూ... ప్రదక్షిణలు ముగించడం వెరైటీ. అంతకు ముందు తమ ఇళ్ల నుంచి గాడిదలను అందంగా అలంకరించి తీసుకుని వచ్చే వారు కొందరైతే.. మరికొందరు గాడిదలతో బండ్లు కట్టుకుని.. బ్యాండు మేళాలు... తప్పట్లు.. తాళాలు.. నృత్యాలతో వినాయక నిమజ్జనం ఊరేగింపును తలపించేలా ఊరేగింపుతో మరీ తరలివచ్చారు. చాలా వెరైటీగా సాగే ఈ ఉత్సవాలను తిలకించేందుకు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చారు.
అదే కారణం..!
పూర్వీకుల నుంచి తరతరాలుగా వస్తోన్న ఈ ఆచారాన్ని తాము కూడా పాటిస్తున్నామని.. దేవుడు తమను చల్లగా చూడాలని మొక్కుబడులు చెల్లించుకునేందుకు ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నామని భక్తులు ఉత్సాహంగా చెబుతున్నారు. వర్షాలు బాగా కురవాలని, తమ పశు సంపద వృద్ధి చెందాలని, పశువులు చల్లగా ఉండాలని, పంటలు బాగా పండాలని కోరుకుంటూ ఇలా పశువులతో ప్రదక్షిణలు చేయిస్తున్నామని పేర్కొంటున్నారు. ఉగాది తర్వాత రోజు రజకులు సైతం తమ గాడిదలను అలంకరించి ఆలయం చుట్టూ బురద మట్టిలో ప్రదక్షిణలు చేయించారు. గతంలో తమ పూర్వీకులు ఈ వేడుకలు చాలా ఘనంగా జరిపే వారని.. అయితే రాను రాను వర్షాలు లేక పాడి పశువులు తక్కువైపోతున్నందున తమ వంతుగా ఈ సంప్రదాయాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తున్నామని రైతులు, రజకులు చెబుతున్నారు. తమ పాడి పశువుల, గాడిదలతో ఈ సంప్రదాయాన్ని భావి తరాలకు వారసత్వంగా అందించేందుకు కొనసాగించే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు.
పాడి పశువులు, గాడిదలు శ్రమ శక్తికి ప్రతిరూపాలని.. ఎంతటి కష్టాన్నైనా ధైర్యంగా అధిగమించాలనే ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుందని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. అమ్మవారి ఆశీస్సులుంటే కష్టాలను సులువుగా ఎదిరించే ధైర్యం వస్తుందంటున్నారు. దాదాపు 150 ఏళ్లుగా బురదలో ప్రదక్షిణలు చేసే సంప్రదాయం వస్తోందని పేర్కొంటున్నారు.