Indiramma Committees Like Volunteers : ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ల అంశం రాజకీయంగా దుమారం రేపుతోంది. ఇప్పుడు తెలంగాణలోనూ అలాంటి వ్యవస్థ ఏర్పాటుకు సీఎం రేవంత్ నిర్ణయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే ఇందిరమ్మ కమిటీలను చేయబోతోంది. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ఈ కమిటీల ద్వారానే ప్రతి ఇంటికీ చేరనున్నాయని ఆయన ప్రకటించారు. ఏ పథకానికైనా లబ్ధిదారులను ఈ కమిటీల ద్వారానే ఎంపిక చేస్తారు. ఒక్కో కమిటీలో ఐదుగురు సభ్యులు ఉంటారు. కమిటీలోని ఒక్కో సభ్యుడికి నెలకు రూ. 6 వేల గౌరవ వేతనం ఇస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 80 వేల మందిని కమిటీల సభ్యుడిగా నియమించబోతున్నట్లుగా తెలుస్తోంది.
టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలు, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్ల మాదిరి ఇందిరమ్మ కమిటీలు
ఏపీలో టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలు, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్ల మాదిరి తెలంగాణలో ఇందిరమ్మ కమిటీలు పని చేస్తాయి. ఈ కమిటీలను కాంగ్రెస్ కేడర్ తో ఏర్పాటు చేయనున్నారు. ఇందిరమ్మ కమిటీల ద్వారా నియమించే వారు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన కార్యక్రమాలను ప్రచారం చేయడమే కాకుండా లబ్ధిదారులకు సామాజిక భద్రతా పింఛన్లు, ఇతర సంక్షేమ ప్రయోజనాలను పంపిణీ చేయడం వంటి బాధ్యతలు అప్పగించనున్నారు. గతంలో జన్మభూమి కమిటిలు లేదా ఇతర వారికి ఎలాంటి గౌరవ వేతనాలు ఇవ్వరు.
నెలకు రూ. ఆరు వేల వేతనం ఇచ్చే యోచన
ఇందిరమ్మ కమిటీల గురించి గతంలో రేవంత్ రెడ్డి చెప్పినా.. ఆ సభ్యులకు వేతనాల గురించి మాత్రం మొదటి సారి మాట్లాడారు. భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గంలో లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొనేందుకు పార్టీ సన్నద్ధతపై చర్చించేందుకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన నివాసంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలకు తన ప్రణాళికలను వెల్లడించారు. ప్రతిభావంతులైన పార్టీ కార్యకర్తలను గుర్తించి, వారికి ఇందిరమ్మకమిటీల్లో సభ్యుిగా ఉద్యోగాన్ని అప్పగించడం ద్వారా, ప్రభుత్వం సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాలను అట్టడుగు స్థాయికి సులభంగా చేరవేయవచ్చునని రేవంత్ భావిస్తున్నారు.
ఎన్నికల తర్వాత నియామకాలు చేసే అవకాశం
సామాజిక భద్రతా పింఛన్లు , ప్రజలకు వచ్చే ఇతర ప్రయోజనాలను పంపిణీ చేయడానికి కూడా ముసాయిదా రూపొందించేందుకు ప్రభుత్వ వర్గాలు సిద్దమవుతున్నాయి. పార్ట కార్యకర్తలతో ఇలాంటి వ్యవస్థలు క్షేత్ర స్థాయిలో ఉండటం వల్ల రాజకీయంగా ఎంతో లాభం ఉంటుందని పార్టీలు భావిస్తున్నాయి. అందుకే ప్రజాధనాన్ని క్యాడర్ కు జీతాలు ఇచ్చి వ్యవస్థలను ఏర్పాటు చేసుకుంటున్నారన్న విమర్శలను ఎదుర్కొంటున్నారు.