Srisailam Temple:  ఎన్నో జన్మల పుణ్యఫలం శ్రీశైల దర్శనం అంటారు పండితులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా నల్లమల అటవీప్రాంతంలో కొండల మధ్య జ్యోతిర్లింగ స్వరూపుడిగా వెలిశాడు శంకరుడు. నిత్యం పంచాక్షరి మంత్రంతో మారుమోగే ఈ క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి. భౌతిక ఇంద్రియాలతో మనం చూడలేని దివ్యత్వం శ్రీశైలంలో అణువణువూ వ్యాపించి ఉందని స్కాందపురాణంలో ఉంది. 

శ్రీ అంటే సంపద

శైలం అంటే పర్వతం

అంటే సంపద్వంతమైన పర్వతం అని దీని అర్థం. దీనిని మరో కైలాశం అంటారు భక్తులు. అయితే ఇది నిజమే అన్నట్టు.. క్రీ.శ.1313 లో రాసిన ఓ శాసనం ప్రకారం ఇక్కడ పార్వతీ సమేతంగా పరమేశ్వరుడు కొంతకాలం నివశించాడని..అందుకే కైలాసం అంటారని ఉంది. ఇక్కడ అమ్మవారు భ్రమరాంబికాదేవిగా భక్తులను అనుగ్రహిస్తోంది. ఇంత మహిమాన్వితమైన ఈ క్షేత్రాన్ని ఎప్పుడు దర్శించుకున్నా పూర్వజన్మ సుకృతమే...అయితే.. ఒక్కో నెలలో దర్శించుకుంటే ఒక్కో ఫలితం పొందుతారని శ్రీ పర్వత పురాణం వివరించింది... 

చైత్రమాసం ( ఏప్రిల్)ఈ నెలలో శ్రీశైల దర్శనం సకల శుభాలను చేకూర్చుతుంది. ఎన్నో యజ్ఞాలు నిర్వహించిన ఫలితాన్నిస్తుంది. అపమృత్యు దోషం తొలగిపోతుంది

వైశాఖ మాసం ( మే )వైశాఖంలో శ్రీశైల మల్లికార్జునిడిని దర్శించుకుంటే కష్టాలు తీరిపోతాయి. గోదానం చేసినంత ఫలితం లభిస్తుంది

జ్యేష్ట మాసం ( జూన్)ఈనెలలో శ్రీశైలం దర్శించుకుంటే కోరిన కోర్కెలు నెరవేరుతాయి..గోవులను బంగారంతో అలంకరించి దానం చేసినంత పుణ్యం

ఆషాఢ మాసం ( జూలై)ఆషాడంలో శ్రీశైలం మల్లన్నని దర్శనం చేసుకుంటే కోటి గోవులను శివాలయానికి దానం ఇచ్చినంత ఫలితం దక్కుతుంది

శ్రావణ మాసం ( ఆగష్టు)శ్రావణంలో భ్రమరాంబసహిత మల్లికార్జునిడిని దర్శించుకుంటే పచ్చని పంటపొలాన్ని బ్రాహ్మణుడికి దానం ఇచ్చినంత ఫలితం

భాద్రపద మాసం ( సెప్టెంబరు)భాద్రపదంలో శ్రీశైల మల్లికార్జునిడిని దర్శించుకుంటే పండితులకు కోటి నల్లటి గోవులను దానం ఇచ్చినట్టే... ఆశ్వయుజ మాసం ( అక్టోబరు)ఈ నెలలో క్షేత్ర దర్శనం పాపాలను హరించివేస్తుంది. ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. కన్యాదానం చేసిన ఫలితం ఇస్తుంది..

కార్తీక మాసం  ( నవంబరు)శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన కార్తీకమాసంలో శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకుంటే వేయి యజ్ఞాలు చేసిన ఫలితం పొందుతారు

మార్గశిర మాసం ( డిసెంబరు)వైష్ణవులకు అత్యంత ముఖ్యమైన ధనుర్మాసం ఈ నెలలోనే వస్తుంది...మార్గశిరమాసంలో శ్రీశైల దర్శనం సకల పాపాలను తొలగిస్తుంది. 

పుష్య మాసం ( జనవరి )ఈ నెలలో శ్రీశైల దర్శనం మోక్షాన్నిస్తుంది..అతిరాత్ర యాగం చేసినంత ఫలితం దక్కుతుంది

మాఘ మాసం ( ఫిబ్రవరి)మాఘమాసంలో మల్లికార్జునిడి దర్శనం రాజసూయయాగం చేసిన పుణ్యాన్ని ప్రసాదిస్తుంది

ఫాల్గుణ మాసం ( మార్చి )తెలుగు నెలల్లో ఆఖరి నెల అయినా ఫాల్గునంలో మల్లికార్జునుడి దర్శనం తరగని సంపదలు ప్రసాదిస్తుంది... 

Also Read: అశ్వత్థామ ఇప్పుడు ఎక్కడున్నాడు? ‘కల్కి 2898 ఏడీ’ లో అమితాబ్ నుదుట కనిపించిన అద్భుతమైన మణి గురించి తెలుసా!

శ్రీశైల క్షేత్రంలో స్వామి అమ్మవార్ల దర్శనం అనంతరం ఆ చుట్టుపక్కల సందర్శించాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి...

అక్కమహాదేవి గుహలు

శ్రీశైలంలోని కృష్ణానదిలో బోటింగ్ ద్వారా దట్టమైన అడవులు, పర్వత దృశ్యాలు చూస్తూ బోటింగ్ ద్వారా అక్కమహాదేవి గుహలు దర్శించుకోవచ్చు. ఈ గుహలకు ప్రయాణం పర్యాటకులను మంచి అనుభూతినిస్తుంది. కవయిత్రి అక్కమహాదేవి పరమేశ్వరుడిని భర్తగా భావించి ఇక్కడ తపస్సు చేసి ఆయనలో ఐక్యం అయిపోయిందని చెబుతారు. 

ఇష్టకామేశ్వరి దేవి  

శ్రీశైలం కూడలి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవుల మధ్య కొలువైంది ఇష్టకామేశ్వరి దేవి. ఇక్కడ అమ్మవారికి బొట్టుపెట్టి ఏం కోరుకున్నా నెరవేరుతుందని భక్తుల విశ్వాసం. ఇక్కడికి చేరుకోవడం అంత సులభం కాదు.  

పాతాళగంగ

పాపాలను పోగొట్టే పరమ పవిత్ర ప్రదేశంగా పాతాళగంగను భావిస్తారు భక్తులు. ఔషధ గుణాలుండే ఈ నీటికి ఎన్నో అనారోగ్య సమస్యలు నివారించే గుణం ఉందని చెబుతారు ఆయుర్వేద నిపుణులు. 

Also Read: కల్కి ఎంట్రీతో కలియుగం అంతమైపోతుందా - కల్కి ఎప్పుడు వస్తాడు!

నాగార్జునసాగర్ - శ్రీశైలం టైగర్ రిజర్వ్

రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తరించిన శ్రీశైలం టైగర్ రిజర్వ్..నల్లమల కొండలు  ప్రకృతి అందాల మధ్య అద్భుతంగా ఉంటుంది. విభిన్న వృక్షజాతులతో పాటూ బెంగాల్ టైగర్, ఏనుగులు, చిరుత పులులు, ఎలుగుబంట్లు వంటి ఎన్నో అడవి జంతువులను ఇక్కడ చూడొచ్చు. ఇందుకోసం జంగిల్ సఫారీ అందుబాటులో ఉంటుంది. 

శ్రీశైలం డ్యామ్

శ్రీశైలం నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది శ్రీశైలం ఆనకట్ట. దేశంలో ఉన్న జల విద్యుత్ కేంద్రాలల్లో సామర్ధ్యం విషయంలో శ్రీశైలం ఆనకట్ట రెండవ అతిపెద్దది. పర్యాటకులు ఇక్కడ బోట్ షికార్ ని ఎంజాయ్ చేయొచ్చు.  

Also Read: కలియుగం ఇంకా ఎన్నేళ్లుంది - కల్కి అవతరించేది అప్పుడేనా!