హిందూ ఆచార వ్యవహా రాల విషయంలో శకునాల పాత్ర ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఏ పని ప్రారంభించినా శుభ శకునం చూసుకుని ప్రారంభించాలి. అశుభ శకునం ఎదురైతే ఆ పని అసంపూర్ణంగా ముగుస్తుందని విశ్వసిస్తుంటారు. మారుతున్న పరిస్థితుల బట్టి కొందరు తమ అభిప్రాయాలు మార్చుకున్నా...మరికొందరు మాత్రం సెంటిమెంట్స్ ని ఫాలోఅవుతునే ఉన్నారు. కర్ణాటకలో స్లీపింగ్ ఎలిఫెంట్ గురించి తెలుసుకుంటే మీరూ ఇదే అంటారేమో...


కర్ణాటక రాష్ట్రం హాసన్ జిల్లా బేలూరు తాలూక బెన్నినామనే గ్రామంలో పది అడుగుల పొడవైన రాతి ఏనుగు ఇప్పుడు నిటారుగా నిలబడింది. రాతి ఏనుగు నిలబడడం ఏంటి, ఇన్నాళ్లూ ఏమైందంటారా...నిజమే రాతి ఏనుగు నిలబడలేదు నిలబెట్టారు. కొన్నేళ్లుగా ఆ ఏనుగు విగ్రహం ఎడమవైపు వాలి ఉండేది. దాని పాదాలు మొత్తం మట్టిలో కూరుకుపోయి ఉండేవి. దీంతో స్లీపింగ్ ఎలిఫెంట్ అని పిలిచేవారు..పైగా గ్రామంలో ఏ చెడు జరిగినా ఆ ఏనుగు విగ్రహమే కారణం అనుకునేవారు. ఆ విగ్రహం ఉన్న స్థలం నింగేగౌడ అనే వ్యక్తిది. స్లీపింగ్ ఎలిఫెంట్ సెంటిమెంట్ తో ఎవ్వరూ ఆ స్థలం కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదు. ఏడమవైపు వంగి నిద్రపోతున్నట్టు ఉండే ఈ ఏనుగు వల్ల నష్టం జరుగుతుందని భావించేవారు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆ స్థలాన్ని అన్నే గౌడ అనే వ్యక్తి కొనుగోలు చేశాడు. ఇప్పుడు అన్నేగౌడ పిల్లల అధీనంలో ఉంది. అక్కడ కాఫీ సాగుచేయాలని నిర్ణయించుకుని పనులు ప్రారంభించారు. ఇలాంటి సమయంలో గ్రామంలో ఏదైనా జరిగితే తాము చేసే పనులు, తమ స్థలంలో ఉన్న ఏనుగు విగ్రహంపై నిందలేస్తారని భావించిన అన్నేగౌడ పిల్లలు...రెండు క్రేన్‌లు, జేసీబీని అద్దెకు తీసుకుని ఏనుగును పైకి లేపి నేరుగా అదే స్థలంలో అమర్చారు.


Also Read: వసంత పంచమి ప్రత్యేకత ఇదే... వ్యాసమహర్షి ప్రతిష్టించిన సరస్వతీ నిలయంలో అక్షరాభ్యాసం చేయిస్తే..
“ఏనుగు ఎడమవైపు నిద్రపోతున్నట్టు ఎడమవైపు వంగి ఉండడం వల్ల ఏ చెడు సంఘటన జరిగినా గ్రామస్తులు దాన్ని నిందిస్తారని... ఈ స్థలాన్ని ఎవ్వరూ కొనడానికి సిద్ధంగా లేనప్పుడు మా నాన్న కొనుగోలు చేశారన్నారు అన్నేగౌడ పిల్లలు. దీని గురించి ధర్మస్థలంలో ఉన్న మ్యూజియం వారికి సమాచారం అందించాం.. వారు కూడా ఈ విగ్రహాన్ని తీసుకెళ్లేందుకు వచ్చారు. కానీ ఈ భారీ రాతి విగ్రహాన్ని తరలించడానికి సరైన అవకాశం లేక ఆ ఆలోచన విరమించుకున్నారని చెప్పారు అన్నేగౌడ పిల్లలు. కాఫీ తోటసాగుచేసేందుకు ఎలాగూ ప్లాట్ ను చదునుచేస్తున్నాం... అందుకే క్రేన్లు, జేసీబీలు అందుబాటులో ఉండడంతో చెడుశకునంగా భావించే స్లీపింగ్ ఎలిఫెంట్ ని లేపి నిల్చోబెట్టాం అంటున్నారు. 


Also Read: ఏడు జన్మల పాపాలు, ఏడు రకాలైన వ్యాధులు నశించాలంటే రథసప్తమి ఇలా చేయాలట….
ఏనుగు 10 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు దాదాపు  40 టన్నుల బరువు ఉంటుంది. ఇది అసంపూర్తిగా ఉన్న విగ్రహం. బేలూర్‌లోని హొయసలలు నిర్మించిన అనేక దేవాలయాల శిల్పాల్లో ఉపయోగించిన రాయిలా ఉందట.  ఈ విగ్రహాన్ని ఎవరు చెక్కారు, ఇక్కడకు ఎలా వచ్చింది, ఎందుకు ఇక్కడే వదిలేసి వెళ్లారనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదన్నారు పురావస్తు శాఖాధికారులు. మొత్తానికి చెడు శకునంగా భావించే స్లీపింగ్ ఎలిఫెంట్ ఇప్పుడు లేచి నిల్చుంది. మరి ఇకకైనా అంతా మంచే జరుగుతుందని స్థానికులు భావిస్తారేమో...చూద్దాం....


Also Read: అప్పులు, అనారోగ్యం, శత్రుబాధలు తొలగించే సూర్యారాధన ...రథసప్తమి ప్రత్యేకత ఇదే..