Spirituality:  శ్రీ మహా విష్ణువు విగ్రహాల అమరిక నాలుగు రకాలు
1.శయన
2.ఆసన
3.స్థానక
4.నృత్య 


వీటిలో శయన విగ్రహాలు నాలుగు విధాలు
1.యోగం
2.సృష్టి
3.భోగం
4.సహారం
యోగం - ముక్తికి, సృష్టి - వృద్ధికి, భోగం - భుక్తికి, సహారం - అభిచారిక మార్గాలకు ప్రతీక. 
మోక్షం కోరేవారు యోగశయనాన్ని, పుత్రపౌత్రాది వృద్ధి కోరుకునేవారు సృష్టిశయనాన్ని, భోగ వృద్ధి కోరుకునేవారు భోగశయనాన్ని, శత్రువుల నాశనం కోరుకునేవారు సంహారశయనాన్ని ధ్యానించాలని పురాణాలు చెబుతున్నాయి. నదీతీరాల్లో, సరస్సుల పక్కన ఉన్న యోగశయన విగ్రహాలు అత్యంత ప్రశస్తమైనవిగా చెబుతారు.


Also Read: ఈ ఆలయ నిర్మాణానికి 39 ఏళ్లు పట్టింది, దీని ప్రత్యేకత ఏంటంటే!


యోగశయనం 


శ్రీమహావిష్ణువు ఎర్రతామర రేకులవంటి నేత్రాలతో యోగనిద్రలో శయనించే రూపం ఇది. రెండు భుజాలు కలిగి, ఒక ప్రక్కగా పడుకున్నట్టు అర్థశయనంలో దర్శనమిస్తాడు యోగశయనం. ఐదుపడగల శేషుడు శంఖంలా, చంద్రునిలా తెల్లగా ఉంటుంది. దీనిమీద శయనించిన శ్రీ మహావిష్ణువు గౌరశ్యామ వర్ణంతోగానీ, పీతశ్యామ వర్ణంతోగానీ దర్శనమిస్తాడు. ఈ రూపంలో స్వామివారి పూజాపీఠానికి కుడివైపు భృగు మహర్షి కానీ మార్కండేయుడు కానీ, ఎడమవైపున భూదేవి కానీ మార్కండేయ మహర్షి ఉంటారు. మధుకైటభులు, బ్రహ్మ, పంచాయుధాలు, నమస్కరిస్తున్న మహర్షులు ఉంటారు.


సృష్టిశయనం 


తొమ్మిది పడగలున్న శేషపానుపుపై  శ్రీహరి రాజసంగా, నల్లని శరీర ఛాయతో, ఎర్రని అరికాళ్లతో సృష్టిశయన రూపంలో ఉంటాడు. లక్ష్మీదేవి, భూదేవి, బ్రహ్మ, చంద్రుడు, ఇంద్రుడు, అప్సరసలు, మహర్షులు, రుద్రులు. ఆదిత్యులు, కిన్నెరలు, మార్కండేయుడు, భృగుమహర్షి, నారద మహర్షులను, మధుకైటభులను వీరందరితో కలిగిన శయనం ఉత్తమ సృష్టి శయనమవుతుంది.


Also Read: అమ్మవారి శరీరంలో 18 భాగాలు పడిన ప్రదేశాలివే, ఒక్కటి దర్శించుకున్నా పుణ్యమే


భోగశయనం


భోగశయనం రూపంలో శ్రీమన్నారాయణుడు సకలపరివారంతో కూడి ఏడు పడగల శేషునిరపై శయనిస్తూ ఉంటాడు. ఈ స్వామి నాభినుంచి వికసించిన తామరపువ్వులో కూర్చున్న బ్రహ్మ బంగారు రంగులో ఉంటాడు.  బ్రహ్మకు రెండు వైపులా శంఖం, చక్రం, గద, ఖడ్గం, శార్జ్గం అనే పంచాయుధాలు, పద్మం, వనమాల, కౌస్తుభం కలిపి అష్టాయుధాలు ఉంటాయి. ఆ ఆయుధాల ముందు గరుత్మంతుడు ఉంటాడు. స్వామి కుడిచేతివైపు  లక్ష్మీదేవి, కుదిపాదం ప్రక్కన సరస్వతి, ఎడమచేతి ప్రక్కన శ్రీదేవి, ఎడమపాదం ప్రక్కన భూదేవి ఉంటారు. సూర్యచంద్రులు, తుంబురనారదులు, సప్తఋషులు, అప్సరసలు, లోకపాలకులు, అశ్వనీదేవతలు ఉంటారు. పాదాల దగ్గర మధుకైటభులు ఉంటారు. శ్రీవారు సస్యశ్యామల వర్ణంతో, అర్థశయనంతో, యోగనిద్రా రూపంతో, నాలుగు భుజాలతో, వికసించిన ముఖంతో, తామర రేకులవంటి నేత్రాలతో పూర్ణచంద్రుని వంటి ముఖంతో దర్శనమిస్తాడు.


Also Read: సెప్టెంబరు 20 రాశిఫలాలు, ఈ రాశివారు ఇచ్చే సలహాలు అందరకీ బాగా ఉపయోగపడతాయి


సంహారశయనం 


శ్రీమన్నారాయణుడు రెండు పడగల శేషుని పానుపుగా చేసుకుని గాఢనిద్రలో, మూసిన కన్నులతో, తామస భావాన్ని వ్యక్తం చేసి మూడు కన్నులతో దర్శనమిస్తాడు.  నల్లని వస్త్రాలతో, రెండు భుజాలతో, నల్లని శరీర కాంతులతో, రుద్రుడు సహా సకల దేవతలతో కనిపిస్తాడు. ఈ రూపాన్ని దర్శించుకుంటే కష్టాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.


శ్లోకం
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాథారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం |
లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం
వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం ||


శ్రీమతే విష్ణుభక్తాయ శంఖచక్రాదిధారిణే |
వారుణీ కీర్తి సహితాయానంతాయాస్తు మంగళమ్ ||