Spirituality: ఏనుగు (గణేషుడు), కోతి (హనుమంతుడు), పాము (సుబ్రమణ్యస్వామి) వీటితో పాటూ ఆవు..ఇలా జంతువులు, పక్షులను దేవుడిగా భావించి పూజలందిస్తారు..మరికొన్ని దేవుళ్లు, దేవతలకు వాహనంగా ఉంటాయి. ఇవి కేవలం వాహనం మాత్రమే కాదు.. మనిషి ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో చెప్పే సూచికలు. కొందరు దేవుళ్ళకు వాహనాలుగా బాగా ప్రసిద్దిచెందిన కొన్ని జంతువులు మరియు పక్షులేంటో తెలుసుకుందాం
ఎలుక
ఎలుక వినాయకుడికి వాహనం. ఎలుక క్రోధ, లోభ, మోహ, మద, దురభిమానాలకు ప్రతీక. మూషికం తమో రజోగుణాల విధ్వంసకర శక్తికి సంకేతం. జ్ఞానానికి అధినేత అయిన వినాయకుడు వీటన్నింటిపై చేసే సవారీ అని అర్థం. మూషికుడనే రాక్షసుడు వినాయకుడితో యుద్ధం చేసి ఓడిపోయి శరణుజొచ్చి, తన వాహనంగా చేసుకొమ్మని వినాయకుడిని వేడుకున్నాడు.
ఎద్దు (నంది)
ఎద్దుకున్న తెలుపు రంగు స్వచ్ఛత, న్యాయాన్ని సూచించగా... శివాలయాల్లో గర్భగుడి వైపు కూర్చున్న నంది వ్యక్తి జీవాత్మను, మనసు ఎల్లప్పుడూ పరమేశ్వరుడిపై దృష్టి పెట్టాలి అనే సందేశాన్నిస్తుంది. శక్తికి చిహ్నంగా ఉన్న ఎద్దు మోహం, భౌతిక కోరికలకు అతీతంగా జీవించే జీవిగా పరిగణిస్తారు.
Also Read: రామాయణం - మహాభారతం రెండింటిలోనూ ప్రధాన పాత్ర పోషించిన ఐదుగురు
సింహం
సింహం అడవిలో ఉమ్మడి కుటుంబంలో నివసించే జీవి. ఇది అడవిలో అత్యంత శక్తివంతమైన జీవి..అనవసరంగా తన శక్తిని అస్సలు వృధా చేయదు. అవసరమైనప్పుడు వెనక్కు తగ్గదు. అధిపతిగా ఇంటిని ఐక్యంగా ఉంచడం, అనవసర విషయాలకు దూరంగా ఉండడాన్ని సూచిస్తుంది సింహం
గుడ్లగూబ
గుడ్లగూబ చురుకైన స్వభావం కలిగిన పక్షి. లక్ష్మీ దేవి వాహనం. రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసే వ్యక్తిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని సూచిస్తుంది గుడ్లగూబ.
నెమలి, హంస
హిందూ మతంలో ముఖ్యమైన దేవతా మూర్తుల్లో సరస్వతిని చదువులతల్లిగా ఆరాధిస్తారు. అమ్మవారు త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మ దేవేరి. వేదాలు, పురాణాలలో విపులంగా సరస్వతీ నది కూడా ప్రస్తావించబడింది. సరస్వతి హ౦స వాహన౦పై, మయూర వాహన౦పై కూర్చున్నట్లు కనిపిస్తు౦ది. జ్ఞానానికి ప్రధాన దేవతగా మయూరాన్ని చెబుతారు. హ౦స శబ్ద శక్తికి, ప్రాణ శక్తికి స౦కేత౦, పాలు నీళ్లను వేరే చేసే సామర్థ్యం హంస సొంతం. నెమలి సుబ్రమణ్యస్వామి వాహనం కూడా....
Also Read: తిరుప్పావై అంటే ఏంటి, 30 రోజులు పాడే పాశురాల ప్రత్యేకత ఏంటి!
గరుత్మంతుడు(గ్రద్ద)
అన్నిపక్షులకు అధిపతి గరుడ. అష్టాదశ పురాణాల్లో గరుడుడి పేరుమీద ఓ పురాణం ఉంది..అదే గరుడ పురాణం. ఈ పురాణం శ్రీ మహా విష్ణువు ..తన వాహనమైన గరుత్మంతుడికి ఉపదేశించాడు. అందుకే ఈ పురాణానికి "గరుడ పురాణం" అని పేరు వచ్చింది. మోక్షాన్ని ప్రసాదించే శ్రీ మాహావిష్ణువుకి వాహననమైన గరుత్మంతుడిని దర్శించుకోవడం ద్వారా సుఖసంతోషాలు చేకూరుతాయని విశ్వాసం.
ఐరావతం
ఏనుగు ఇంద్రుని వాహనం. సురుల ప్రభువైన ఆ మహేంద్రుని వాహనం. ఏనుగు విశ్వసనీయత, గౌరవం, అధికారం, హోదాని సూచిస్తుంది.
మొసలి
వరుణుడి వాహనం మొసలి. వేదకాలంలో వరుణుడిని ఆకాశానికి, నీటికి అధిపతిగా కొలిచేవారు. సృష్టికి నాశనం చేసే అంశాల కంటె అభివృద్ధి చేసే అంశాలే వరుణుడిలో ఎక్కువ. వేదాల ప్రకారం..వరుణుడు స్వర్గాన్ని, భూమిని, గాలిని సృష్టించాడు. మొసలి గౌరవం, శక్తి, వేగం, శక్తి, జిత్తులమారి, ధైర్యానికి సూచన
అశ్వం
గుర్రం..ప్రత్యక్షదైవం అయిన సూర్యుడి వాహనం. అశ్వం ఇంద్రధనుస్సును సూచిస్తుంది. ఆది దేవుడు ఏడు గుర్రాల మీద స్వారి చేస్తాడు. గుర్రం వేగానికి చిహ్నం.