అక్షతలు లేదా అక్షింతలు అంటే తెలియని వారుండరేమో. ఏ పండగ వచ్చినా, ఏదైనా శుభకార్యం జరిగినా, దేవాలయాల్లోను, పూజల్లోనూ అక్షతలు వినియోగిస్తారు. ముఖ్యంగా ఆశీర్వచనం తీసుకునేటప్పుడు తలపై అక్షతలు వేసి దీవిస్తారు. ఇంతకీ అక్షతలు ఎందుకు వేస్తారు


అక్షతలు వేయడం వెనుకున్న పరమార్థం
క్షతమ్ అంటే కొరత గలది. అక్షతమ్ అంటే పరిపూర్ణమైనది, కొరతలేనిది, నిండైనదని అర్థం. జీవితంలో కొరత లేకుండా పరిపూర్ణంగా జీవించాలని కోరుకుని ఆశీర్వదించడమే అక్షింతలు వేయడంలో ముఖ్య ఉద్దేశం. పసుపు కలిపిన బియ్యం మంగళ ప్రధమైనవి. అందుకే బియ్యంలో పసుపు కలిపి అక్షింతలు చేస్తారు. నవగ్రహాల్లో ఒక్కో గ్రహానికి ఒక్కో ధాన్యాన్ని దాన వస్తువుగా చెబుతుంటారు. ఆ రకంగా నవగ్రహాల్లో చంద్రుడికి  ప్రీతి కరమైనవి బియ్యం. చంద్రుడు మనస్సుకు అధినాయకుడు. మనిషి మనసు, బుద్ధి, గుణం, వ్యసనం వీటన్నిటికి చంద్రుడే కారణమని, మనిషిపై చంద్రుడి ప్రభావం ఎక్కువగా ఉంటుందని మన పెద్దల నమ్మకం. అందుకే ఆ చంద్రుడికి సంకేతమైన బియ్యం కూడా మనిషి మనస్సుపై ప్రభావం చూపుతుందని, మనోధర్మాన్ని నియంత్రిస్తాయి అని గట్టిగా విశ్వసిస్తారు. అందుకే అక్షతలను తల పై వేసి ఆశీర్వదిస్తారు.


Also Read: వాస్తుప్రకారం ఎలాంటి స్థలం కొనుగోలు చేయాలి, ఎలాంటి స్థలం కొనుగోలు చేయకూడదు


శాస్త్రీయ కారణం
సైంటిఫిక్‌గా చెప్పాలంటే బియ్యానికి విద్యుత్ శక్తిని గ్రహించే తత్వం ఉంది. దేహం ఓ విద్యుత్‌ కేంద్రం. విద్యుత్‌ సరఫరాల్లో హెచ్చు తగ్గులు మనస్సు మీద, ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపుతాయి. పెద్దలు అక్షతలు వేసి ఆశీర్వదించే సమయంలో, వారి దేహంలోని విద్యుత్తులో కొంత భాగం ఈ అక్షతలను తాకుతాయి. ఆశీస్సులు ఇచ్చే వాళ్ల నుంచి పుచ్చుకునే వాళ్లకి కొంత విద్యుత్‌ బదిలీ అవుతుంది. దేహంలో ఉన్న 24 విద్యుత్ కేంద్రాల్లో  శిరస్సు ప్రధానమైనది. ఇది విద్యుదుత్పత్తి కేంద్రమే కాదు,విద్యుత్‌ ప్రసార కేంద్రం కూడా. తలపై అక్షతలు వేయడం ద్వారా వాటిలోని విద్యుత్‌ను గ్రహించి దేహానికి ప్రసారం చేస్తుంది శిరస్సు. అందుకే అక్షతల ద్వార పెద్దల్లో ఉండే సాత్విక గుణం పిల్లలకు లభిస్తుంది. పసుపు క్రిమి సంహారకం కూడా కావడంతో ఆరోగ్యానికి కూడా మంచింది. 


Also Read: నరుడు-నారాయణడు అంటారు కదా వీళ్లెవరు
పాదాలకు ఎందుకు నమస్కరిస్తారు
పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకోనేటపుడు వారి పాదాలకు నమస్కరించడం మన సంప్రదాయం. అలా చేయడం వెనుకున్న పరమార్థం ఏంటంటే..మన శరీరంలో తల ఉత్తర ధృవం అయితే పాదాలు దక్షిణ ధృవం. వ్యతిరేక  ధృవాలే ఆకర్షించుకుంటాయి. అప్పుడే శక్తి విడుదల అవుతుంది. అలానే పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకోనేటపుడు మన తలను వారి పాదాలకు తాకించి ఆశీర్వాదం తీసుకుంటాం. ఆ సమయంలో వారి పాదాల్లోని దక్షిణ దృవం మన తలలో గల ఉత్తర దృవంతో ఆకర్షితంమై శక్తిని వెలువరుస్తుంది. అందుకే మన హిందు సంప్రదాయం లో పెద్దల కాళ్ళకు నమస్కరిస్తాం.


హిందూ సంప్రదాయంలో పాటించే ప్రతి పద్ధతిలోనూ ఓ పరమార్థం దాగి ఉంటుంది. వితండవాదం చేయకుండా అదేంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తే పెద్దలు ఎంత ఆలోచించి ఈ పద్ధతులు పెట్టారో అర్థమవుతుంది.