Virat Kohli 100th Test: వందో టెస్టుకు ముందు టీమ్‌ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీకి దిగ్గజ క్రికెటర్లు అభినందనలు తెలియజేశారు. అతడు అందరికీ రోల్ మోడల్‌గా నిలిచాడని ప్రశంసించారు. చిరకాలం గుర్తుండిపోయే వందో టెస్టులో రాణించాలని కోరుకున్నారు. సచిన్ తెందూల్కర్, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్ అతడికి విషెస్ చెప్పారు.
విరాట్ కోహ్లీ ఇప్పుడు మొహాలిలో ఉన్నాడు. టీమ్‌ఇండియాతో కలిసి సాధన చేస్తున్నాడు. శ్రీలంకతో టెస్టు సిరీసుకు సిద్ధమవుతున్నాడు. మార్చి 4 నుంచి ఈ మ్యాచ్ మొదలవుతోంది. ఇప్పటి వరకు కింగ్ కోహ్లీ 99 టెస్టుల్లో 50.39 యావరేజ్‌తో 7,962 పరుగులు చేశాడు. అతడి వందో టెస్టు సందర్భంగా బీసీసీఐ వీడియో సందేశాలు పోస్టు చేసింది. దిగ్గజ క్రికెటర్లతో మాట్లాడించింది.
'ఇన్నేళ్లూ నీ ఆటను చూస్తుండటం ఆనందంగా ఉంది. గణాంకాలు వాటి పాత్రను అవి పోషిస్తాయి. కానీ మొత్తం ఒక తరాన్ని మోటివేట్ చేయడమే నీ అసలైన బలం' అని సచిన్ తెందూల్కర్ అన్నాడు. 'ఇండియన్ క్రికెట్‌కు నువ్వెంతో సేవ చేశావు. దానినే నేను అసలైన విజయం అంటాను. నువ్వు ఇంకా చాలా కాలం క్రికెట్ ఆడాలి. రాణించాలి' అని పేర్కొన్నాడు.
'విరాట్ కోహ్లీ గర్వపడాల్సిన ఘనత ఇది. అతడిపై ఎంతో ఒత్తిడి ఉన్నా చక్కగా రాణించాడు. టెస్టుల్లో అతడి యావరేజ్ 50గా ఉంది. ప్రపంచంలోని అన్ని పిచ్‌లపై అదరగొట్టాడు. అలా ఆడినప్పుడే ఇలా 100 టెస్టుల ఘనత దొరుకుతుంది. అతడీ ప్రశంసలకు అర్హుడు' అని టీమ్‌ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. 'పదేళ్లుగా విరాట్ కోహ్లీ అద్భుతాలు చేస్తున్నాడు. అతడి ఆటంటే అందరికీ ఇష్టం. ఒక మాజీ క్రికెటర్, కెప్టెన్‌గా బీసీసీఐ తరఫున అతడికి అభినందనలు తెలియజేస్తున్నా' అని గంగూలీ అన్నాడు.
ఆస్ట్రేలియాలో 2011లో పర్యటించనప్పుడు విరాట్ కోహ్లీతో జరిగిన ఓ సంఘటనను సచిన్ తెందూల్కర్ వివరించాడు. ఫిట్‌గా ఉండేందుకు ప్రతిజ్ఞ చేశాడని పేర్కొన్నాడు. 'అన్నిటినీ త్వరగా గ్రహించడం నీ బలం. అదలాగే కొనసాగుతోంది. 2011లో మేం కాన్‌బెర్రాలో ఉన్నాం. సాధారణంగా మేం అక్కడికి వెళ్లి ఏదైనా తిని హోటల్‌కు వచ్చేవాళ్లం. అలా మనం హోటల్‌కు వెళ్లి తిరిగిచ్చాక నువ్వో మాట అన్నావు. చాలా సమయం గడిచిపోయింది, ఇక ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టాలని చెప్పావు. ఫిట్‌నెస్ పరంగా నువ్విప్పుడు శిఖర స్థాయిలో ఉన్నావని చెప్పగలను. ఆ రోజు చెప్పింది నువ్వు సాధించావు' అని సచిన్ గుర్తు చేసుకున్నాడు.